కృత్రిమ చేయికీ స్పర్శ!

5 Mar, 2014 23:42 IST|Sakshi
కృత్రిమ చేయికీ స్పర్శ!

ఈయన పేరు ఇగోర్ స్పెతిక్. మూడేళ్ల క్రితం ఓ ప్రమాదంలో చేయి మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. కృత్రిమ చేయి అమర్చుకున్నా... చేత్తో పట్టుకున్నది అక్కడే ఉందో లేక జారి పడిపోయిందో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు అదే కృత్రిమ చేయితో స్పెతిక్ చెర్రీపండ్ల తొడిమలను తీసేయగలడు. వాటిని ముట్టుకున్న అనుభూతి కూడా పొందగలడు! అంతా... అమెరికాలోని క్లీవ్‌లాండ్ వెటరన్స్  ఎఫైర్స్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు 20 ఏళ్ల ప్రయోగాల ఫలితం. ప్రమాద తాకిడికి తెగిపోగా మిగిలిన కొన్ని నాడులకు వేర్వేరు మోతాదుల్లో సూక్ష్మస్థాయిలో విద్యుత్తును ప్రవహింపజేయడం ద్వారా ఇది సాధ్యమైంది.

చేయి పైభాగంలో దాదాపు 20 తీగలను ఏర్పాటు చేసి... వాటిని కృత్రిమ చేతి ముంజేయి భాగంలోని ప్రధానమైన ప్రాంతాలకు కలిపారు. ప్రవహించే విద్యుత్తును బట్టి దాదాపు 20 రకాల స్పర్శానుభూతులను పొందగలడిప్పుడు. గరుకుకాగితానికి తాకితే.. పెన్ను మొనను నొక్కితే.. ఎలా ఉంటుందో తెలుస్తోందని స్పెతిక్ అంటున్నారు.

ప్రమాదం జరిగిన తొలినాళ్లలో తన చేయి ఇంకా ఉన్న ఫీలింగ్ ఉండేదని, విపరీతమైన నొప్పీ ఉండేదని... ఇప్పుడు మాత్రం అంతా మామూలుగానే ఉన్నట్లు అనిపిస్తోందని సంతోషంగా చెబుతున్నాడు. నాడులను ప్రేరేపించగల ఈ కొత్త టెక్నాలజీ మెరుగైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ విస్తృత వాడకంలోకి వచ్చేందుకు మాత్రం కొంచెం సమయం పడుతుందని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డస్టిన్ టైలర్ అంటున్నారు.
 

మరిన్ని వార్తలు