అమ్మాయిలకు కర్ర సాయం

5 Nov, 2013 00:02 IST|Sakshi

‘అమ్మాయిలకు చదువుతోపాటు కర్రసాములో మెళకువలు నేర్పించండి. ఉద్యోగం చేయడానికి చదువు ఎంత ఉపయోగపడుతుందో గాని, తమను తాము రక్షించుకోవడానికి కర్రసాము నూటికినూరుపాళ్లు సహకరిస్తుంది’ అంటున్నారు అరుణ్‌జ్యోతి.ఎస్.లోఖండే! నల్గొండ వాసి అయిన అరుణ్‌జ్యోతి స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు కర్రసాములో ఉచిత శిక్షణనిస్తున్నారు. అందుకోసం నాలుగేళ్లుగా తనూ సాధన చేస్తున్నారు. మహిళలకు ఉచిత యోగా శిక్షణ, పేపర్ క్రాఫ్ట్స్, మట్టితో విగ్రహాలు... ఇలా తన వంతుగా మహిళాభ్యుదయానికి కృషి చేస్తున్న నలభయ్యేఏళ్ల అరుణ్‌జ్యోతి ‘సమాజానికి నా వంతుగా ఏమిస్తున్నాను అనే ఆలోచనే నన్ను ఇలాంటివాటి వైపు నిరంతరం నడిపిస్తోంది’ అంటున్నారు.
 
 అభిరుచులే ఆసరాగా...

 ‘నాకు చిన్ననాటి నుంచి పర్యావరణం మీద ఉన్న ఇష్టంతో పేపర్ రీ సైక్లింగ్, వెజిటబుల్ అండ్ ఫ్రూట్ కార్వింగ్, మట్టి విగ్రహాల తయారీ చేసేదాన్ని. యోగా, డ్రెస్ డిజైనింగ్, డ్యాన్స్‌ల్లోనూ ప్రవేశం ఉంది. ఇప్పుడు ఎం.ఎ. చేస్తున్నాను. ఏ పని నేర్చుకున్నా అది నాతోనే ఆగిపోకూడదు. నలుగురికి పరిచయం చేయాలి అనుకుంటాను. మాకు లేడీస్ కార్నర్ షాప్ ఉంది. ఆ ఆదాయమే మా కుటుంబ పోషణ. మాకు ఓ బాబు. ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఇల్లు, షాప్ చూసుకుంటూనే సమయాన్ని కుదుర్చుకుని నా అభిరుచులకు పదునుపెట్టుకుంటూ, నా చుట్టూ ఉన్నవారికి శిక్షణ ఇస్తూ ఉంటాను. వీటికి మావారు సతీష్ ప్రోత్సాహం ఎంతగానో ఉంది.
 
 కర్ర పడితే... బడితె పూజే...

 అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలను, దారుణాలను విన్నప్పుడల్లా ఏదో తెలియని బాధ. అలాంటి ఆవేదనేదో పురిగొల్పి... నాలుగేళ్ల క్రితం కర్రసాము నేర్చుకున్నాను. ఆ తర్వాత మా చుట్టుపక్కల అమ్మాయిలకు ఈ విద్య నేర్పిస్తే బాగుంటుందనుకున్నా. కర్రసాము మన రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రాచీన కళ. రాను రాను ఇది మరుగునపడిపోతోంది. కర్ర తిప్పడం వచ్చిన వారికి రోడ్డు మీద ఏదైనా ప్రతికూల సంఘటన ఎదురైతే ఎంత చిన్న కర్రతో అయినా తమను తాము రక్షించుకోవచ్చు. ఎదుటివారిని కూడా రక్షించవచ్చు. కర్రసాము వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంలోనూ సమతౌల్యత ఏర్పడుతుంది. నా వంతుగా పదిమంది అమ్మాయిలకైనా ఆత్మరక్షణకు పనికొచ్చే విద్యను నేర్పాలని, మాల్‌బౌలి శిశుమందిర్‌లో వారాంతంలో కర్రసాము శిక్ష ణా తరగతులు తీసుకుంటున్నా. నా దగ్గర శిక్షణ తీసుకునే అమ్మాయిలంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే!
 
 ఇల్లిల్లూ తిరుగుతూ...

 మొదట్లో రోజూ ఉదయం పూట కర్రసాములో శిక్షణ ఇచ్చేదాన్ని. అమ్మాయిలు కూడా బాగా ఆసక్తి చూపేవారు. చిన్నవయసు కావడంతో వాళ్ల ఏకాగ్రత అమోఘంగా ఉంటుంది. కాని అమ్మాయిల తల్లిదండ్రులు చదువుపట్ల చూపించినంత శ్రద్ధ, కర్రసాము పై చూపించడం లేదు. దీంతో రెండు మూడు రోజులు వచ్చి, మానేసేవారు. అమ్మాయిలను సాధన కోసం రప్పించడం చాలా కష్టమవుతుంది. అలాగని వదిలేయకుండా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ఈ విద్య గురించి, ప్రాముఖ్యత గురించి ఇప్పటికీ చెబుతున్నాను. స్టేజ్ పైన అమ్మాయిలతో కర్రసాము ప్రోగ్రామ్స్ ఇప్పించడానికైతే పెద్దయజ్ఞమే చేయాల్సి వస్తోంది.

అమ్మాయిల తల్లిదండ్రుల్లో కొందరు ‘ఆడపిల్లలకు ఇదంతా ఎందుకు? అన్నట్టు కొంత చిరాగ్గా మాట్లాడుతుంటారు. బాధనిపిస్తుంది. కాని వదిలే యను. వెంటబడి మరీ ప్రోగ్రామ్‌లు ఇప్పిస్తారు. అది చూసి తర్వాత వారే సంతోషించి, మెచ్చుకుంటారు. ఇప్పటికీ చూసినవాళ్లందరూ కర్రసాము విద్యను మెచ్చుకుంటారు. కరాటేకంటే మంచి విద్య అంటారు. మా పిల్లలు కూడా నేర్చుకుంటే బాగుండు అంటారు. కాని సాధనకు పంపించడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటివరకు 30 మంది అమ్మాయిలు ఈ కళను నేర్చుకున్నారు. ఇప్పుడు మరో పదిహేను మంది శిక్షణ తీసుకుంటున్నారు.
 
 అమ్మాయిలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. కాని తమను తాము రక్షించుకోవడంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంటున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులను నేను కోరేదొక్కటే...  తమకు తామే రక్షణగా ఉండేలా కూతుళ్లను తీర్చిదిద్దండి.’
 
 - నిర్మలారెడ్డి
 

మరిన్ని వార్తలు