శిఖరానికి డాక్టరేట్‌

12 Nov, 2018 00:44 IST|Sakshi

అరుణిమా సిన్హా ఒకప్పుడు జాతీయ స్థాయి ఫుట్‌బాల్, వాలీబాల్‌ ప్లేయర్‌. ఇప్పుడు పర్వతారోహకురాలు. అరుణిమ 2013, మే 21వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. ప్రపంచంలోనే ఎవరెస్టును ఎక్కిన తొలి  మహిళగా రికార్డు సాధించారు! తొలి మహిళా?! జపాన్‌ మహిళ జంకో తాబేకి ఆ రికార్డు ఉంది కదా! నిజమే. జంకో తాబే ఎవరెస్టును అధిరోహించిన తొలి మహిళ. అరుణిమది అంతకంటే పెద్ద రికార్డు, మనసును కదిలించే రికార్డు. స్ఫూర్తిని నింపే రికార్డు. వెక్కిరించిన విధిని ఒక్క తోపు తోసేసి శిఖరం పైకి నడిచిన విజయం ఆమెది.

ఒక ఘర్షణలో ప్రమాదవశాత్తూ కాలిని (ఎడమ) పోగొట్టుకున్న అరుణిమ కృత్రిమ కాలితో ఎవరెస్టును అధిరోహించారు. ప్రపంచంలోనే తొలిసారి ఎవరెస్టును ఎక్కిన వికలాంగ మహిళగా రికార్డు సాధించారు.  ఆ తర్వాత అనేక రికార్డులకు ఆమె గౌరవాన్ని తెచ్చారు. ఆఫ్రికాలో కిలిమంజరో, యూరప్‌లోని ఎల్‌బ్రస్, ఆస్ట్రేలియాలోని కోస్‌కుయిజ్‌కో, సౌత్‌ అమెరికాలోని ఆకాంకాగువా, ఇండోనేసియాలో కార్‌స్టెంజ్‌ పిరమిడ్‌లను అధిరోహించారు. ఈ పర్వతాలన్నీ ఆమె స్ఫూర్తి ముందు తలవంచాయి. ఇప్పుడు ఆమె దీక్షకు గుర్తింపుగా యుకెలోని స్ట్రాత్‌క్లైడ్‌ యూనివర్సిటీ పురస్కరించింది. గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

కాలు ఎలా పోయింది?
2011, ఏప్రిల్‌ 12వ తేదీ. ఉత్తర ప్రదేశ్, అంబేద్కర్‌ నగర్‌ కి చెందిన అరుణిమ ఢిల్లీకి వెళ్లడానికి లక్నోలో రైలెక్కింది. జనరల్‌ కోచ్‌లో ఉన్న అరుణిమ మీద దొంగల చూపు పడింది. ఆమె మెడ మీద వాళ్ల చెయ్యి పడింది. ఆమె మెడలో ఉన్న బంగారు దండ, బ్యాగ్‌లో డబ్బు దొంగల పాలు కాకుండా కాపాడుకోవడానికి వారితో పెనుగులాడింది అరుణిమ.

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎస్‌ఎఫ్‌) ఉద్యోగం కోసం పరీక్ష రాయడానికి వెళ్తున్న అమ్మాయి కావడంతో దొంగలకు లొంగిపోవడానికి సిద్ధంగా లేదామె. ఆ పెనుగులాటలో ఆమెను రైల్లోంచి బయటకు తోసేశారు దొంగలు. ఆమె ప్రయాణిస్తున్న రైల్లోంచి పక్కనే ఉన్న పట్టాల మీద పడిందామె. ఆ పట్టాల మీద మరో రైలు వస్తోంది. ఆ రైలు రావడం కనిపిస్తోంది, తనను తాను రక్షించుకోవడానికి పక్కకు తిరిగిందామె.

దేహం పూర్తిగా పట్టాల మీద నుంచి బయటపడనేలేదు. మరో రెండు సెకన్లయితే పూర్తిగా పక్కకు దొర్లిపోయేదే, అంతలోనే వచ్చేసింది రైలు. కాలి మీదుగా వెళ్లిపోయిందా రైలు. మోకాలి కింద భాగం నుజ్జయిపోయింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నాలుగు నెలల కాలం బెడ్‌మీదనే గడిచిపోయింది. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చిందామె.   కోలుకున్న తరవాత జీవితాన్ని సాహసోపేతంగా గడపాలని. ఎవరెస్టును అధిరోహించాలనే కోరిక కూడా ఆ నిర్ణయంలోంచి పుట్టినదే.

కృత్రిమ కాలితో శిక్షణ
హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత ఉత్తరాలు, టెలిఫోన్‌ ద్వారా బచేంద్రిపాల్‌ను (ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ) సంప్రదించింది అరుణిమ.  బచేంద్రిపాల్‌ పూర్తి సంపూర్ణ సహకారాలందించారామెకి. అరుణిమ సోదరుడు ఓంప్రకాశ్‌ ప్రోత్సహించాడు. ప్రోస్థెటిక్‌ లెగ్‌ అమర్చిన తర్వాత పర్వతారోహణ శిక్షణ మొదలైంది.

మొదట 2012లో హిమాలయాల్లోని ఐలాండ్‌ పీక్‌ను అధిరోహించి, ఫిట్‌నెస్‌ విషయంలో నిర్ధారణకు వచ్చింది. తర్వాత ఏడాది ఎవరెస్టును అధిరోహించింది. ఆ అనుభవాలను ‘బార్న్‌ అగైన్‌ ఆన్‌ ద మౌంటెయిన్‌’ అని పుస్తకంగా రాసింది అరుణిమ. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తోపాటు టెన్సింగ్‌ నార్గే అవార్డులతో అరుణిమలోని స్ఫూర్తిని గౌరవించింది.

తనలాంటి వాళ్ల కోసం
ఆరు పర్వత శిఖరాలను పూర్తి చేసుకున్న తర్వాత యుకె లోని స్ట్రాత్‌క్లైడ్‌ యూనివర్శిటీ గడచిన గురువారం నాడు గ్లాస్‌గోలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ సెరిమనీలో అరుణిమకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ‘ఈ పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు యువతకు మంచి సందేశాన్నిస్తాయి. సంకల్పశుద్ధితో చేసిన పనిని ప్రపంచం గుర్తిస్తుందనే సంకేతాన్ని జారీ చేస్తాయి’ అంది అరుణిమ.

ఆమె స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న అరుణిమ ఫౌండేషన్‌ సేవలను కూడా స్ట్రాత్‌క్లైడ్‌ యూనివర్సిటీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆమె స్పెషల్లీ ఏబుల్డ్‌ పీపుల్‌కి మానసిక, శారీరక ఆరోగ్య సేవలతోపాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహం, మహిళల సాధికారత అవగాహన వంటి కార్యక్రమాలను తన చారిటీ ద్వారా నిర్వహిస్తోంది. అరుణిమ ఇప్పటి వరకు ఆరు శిఖరాలు అధిరోహించింది. అన్ని ఖండాల్లోని ప్రముఖ శిఖరాలను అధిరోహించాలని, ప్రతి శిఖరం మీదా భారత పతాకాన్ని ఆవిష్కరించాలనీ ఆమె ఆశయం.


– మంజీర

మరిన్ని వార్తలు