ఈ గైడ్‌ ఫీజ్‌ అడగడు

3 Apr, 2019 02:31 IST|Sakshi

ఆన్‌లైన్‌ అన్వేషి 

ఈ రోజుల్లో కుర్రాళ్లు సెల్‌ఫోన్లలో కూరుకుపోయి చాటింగ్‌లలో చతికిలపడుతుంటే పకిడే అరవింద్‌ మాత్రం తెలంగాణా అంతా చారిత్రక ప్రాంతాలను గాలిస్తూ, వాటి గొప్పతనాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. పురావస్తు శాఖకు తెలియని విశేషాలు కూడా అరవింద్‌కు తెలుసు అంటే అతిశయోక్తి లేదు. 

తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంzచనపల్లికి చెందిన పకిడే అరవింద్‌ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న అరవింద్‌ హన్మకొండలోని ఏకశిల జూనియర్‌ కాలేజిలో ఇంటర్‌ మీడియట్, డిగ్రీ సుబేదారి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో జర్నలిజం పూర్తి చేశాడు.అరవింద్‌కు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అందులోనూ చరిత్ర పుస్తకాలంటే ప్రాణం. పుస్తకంలో చదివిన ప్రదేశాలకు వెళ్లి, అక్కడి చరిత్రను స్వయంగా తెలుసుకోవాలని కోరిక. తలిదండ్రులు, ఉపాధ్యాయులు ఇతని కోరికలోని నిజాయితీని గుర్తించి ప్రోత్సహించడం మొదలు పెట్టారు.

గూగుల్‌ మ్యాప్‌ ద్వారా వివిధ చారిత్రక ప్రదేశాలను గుర్తించి దానిని ఆఫ్‌లైన్‌లో సేవ్‌ చేసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఆరంభించాడు. అంతవరకే అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర లేదేమో, తన పరిశోధనల్లో భాగంగా అరవింద్‌ ఇటీవల దట్టమైన అడవుల్లో ముళ్లపొదల మధ్య కనుమరుగవుతున్న పురాతన విగ్రహాలను వెలికి తీశాడు. పురావస్తు శాఖ శోధించని అనేక ప్రాంతాలను గుర్తించి వెలుగులోకి తీసుకు వచ్చాడు. అంతేకాదు, వివిధ ప్రదేశాల చారిత్రక అంశాలను డాక్యుమెంటేషన్‌ చేయడంలో ప్రావీణ్యం సాధించాడు. దాంతో తాను కనుగొన్న వాటిని సోషల్‌ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు.

కాకతీయుల కట్టడాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాడు!
పరిశోధనలో భాగంగా అరవింద్‌ అనేక ప్రాచీన దేవాలయాలు, చెరువులను సందర్శించాడు. విలువైన సమాచారాన్ని సేకరించాడు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంద్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చరిత్రను తెలుసుకున్నాడు. చరిత్రను సోషల్‌మీడియా ద్వారా తెలియ చెబుతుండటంతో ఇతర దేశాలకు చెందిన చరిత్ర పరిశోధకులు కూడా రావడం మొదలు పెట్టారు. ఇలా దాదాపు 10 దేశాల నుంచి చరిత్ర పరిశోధకులు వచ్చారు. ఈ క్రమంలో అరవింద్‌కు పలువురు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తన పరిశోధనలో భాగంగా అరవింద్‌ సుమారు 750 పురాతనకట్టడాలు, చారిత్రక ప్రదేశాలను గుర్తించాడు.  వాటిలో కాకతీయుల కట్టడలు అధికం. వీటిపై గతంలో వెలువడిన పుస్తకాలను సేకరించాడు. 

వ్యాసాల ద్వారా వచ్చే డబ్బుతో...
తనకు తెలిసిన చరిత్రను అందరికి చాటి చెప్పేందుకు ప్రైవేట్‌ వెబ్‌సైట్లు, పత్రికలు, సోషల్‌ మీడియాను వినియోగించుకున్నాడు. ప్రైవేట్‌ వెబ్‌సైట్‌లకు వ్యాసాలు రాయడం ద్వారా వచ్చే డబ్బును కూడా పురాతన కట్టడాలకు వెళ్ళి పరిశీలించడానికి వెచ్చిస్తున్నాడు. 

ఫోటో ఎగ్జిబిషన్‌
అరవింద్‌ సందర్శించిన పురాతన కట్టడాలు, ఆలయాలను ఫోటోల రూపంలో బంధించారు. ఇప్పటివరకు 30 వేల ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలలో ఎవరికీ తెలియని కట్టడాలు, దేవాలయాల ఫోటోలను ఎంపిక చేసుకున్నాడు. వాటిని ఇటీవల హైదారాబాద్‌లోని రవీంద్ర భారతిలో అన్‌టోల్డ్‌ తెలంగాణ పేరుతో ఫోటో ఎగ్జిబిషన్‌ను ఐదు రోజులపాటు నిర్వహించారు. ఏప్రిల్‌ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఫోటోలతో పాటు దాని చరిత్రను రాసి బుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
– గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, వరంగల్‌ రూరల్‌
ఫోటోలు: పెద్దపెల్లి వరప్రసాద్‌

పురాతన కట్టడాలు, దేవాలయాలు ఎక్కడ ఉన్నా వెళ్ళి దాని చరిత్ర తెలుసుకోవడం ఇష్టం. పుస్తకాలలో ఉన్నవే చరిత్ర కాదు, అంతకు మించిన చరిత్ర తెలంగాణ గడ్డపైన  ఉంది. ఒక్క కొత్త విషయం తెలుసుకుని ప్రపంచానికి చాటి చెబితే ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. 32 కిలో మీటర్ల గుట్టను సైతం ఎక్కి అక్కడికి వెళ్ళి చరిత్రను తెలుసుకుని వచ్చాను. రెండు సంవత్సరాలు కష్టపడి కాకతీయుల వంశీయులను సైతం కలిశాను. ప్రభుత్వం సాయం చేస్తే నేను మరింత లోతుగా పరిశోధిస్తాను.

– అరవింద్, యువ చరిత్రకారుడు

మరిన్ని వార్తలు