ప్రతి ఉద్యోగినికీ నలుగురు శత్రువులు

4 May, 2018 00:48 IST|Sakshi

తనకు తను ఒక శత్రువు... కుటుంబమొక శత్రువు సూపర్‌వైజర్లొక శత్రువు... సమాజం ఒక శత్రువు

ఏ పరిస్థితినైనా మెరుగుపరచడానికి ముందసలు అది ఎలాంటి పరిస్థితితో  తెలుసుకోవాలి. రిపోర్టులు అందుకే తయారు చేస్తారు. అశోకా యూనివర్సిటీ (హరియాణా) లోని ‘జెన్‌పాక్ట్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ లీడర్‌షిప్‌’ విభాగం.. భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న మహిళలపై తాజాగా ఒక రిపోర్టు విడుదల చేసింది. అందులో మరీ కొత్త విషయాలు ఏమీ లేవు కానీ, ఉద్యోగినులపై కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధ తీసుకోవాలని, ఉద్యోగినులకు ప్రభుత్వాలు మరిన్ని వెసులుబాట్లు ఇవ్వవలసిన అవసరం ఉందని నివేదికలోని వివరాలను బట్టి తెలుస్తోంది.

యూనివర్సిటీ సర్వే నివేదిక ప్రకారం ఏటా 73 శాతం మంది భారతీయ మహిళలు ప్రసవం తర్వాత తమ ఉద్యోగాలను వదిలిపెట్టేస్తున్నారు! పిల్లల సంరక్షణ కోసం ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న తల్లులలో 50 శాతం మంది 30 ఏళ్ల లోపువారే! వీళ్లలో కొందరు తిరిగి ఉద్యోగాలకు వచ్చినప్పటికీ, ఉద్యోగంలో చేరిన నాలుగో నెలలోనే మళ్లీ ఉద్యోగం మానేస్తున్నారు. ఉద్యోగం చేస్తుండగా తల్లులు అయినవాళ్లలో 27 శాతం మంది మాత్రమే నిలకడగా ఉండి తమ ఉద్యోగాలలో ఎదుగుతున్నారు. ప్రసవం తర్వాత ఉద్యోగం మాని, తిరిగి చేరినవారిలో ఇది కేవలం 16 శాతమే!

కార్పొరేట్, మీడియా, అభివృద్ధి రంగాలు.. ఈ మూడు సెక్టార్లలో యూనివర్సిటీ ఈ సర్వేను నిర్వహించింది. సర్వే నివేదికకు ‘ ప్రిడికమెంట్‌ ఆఫ్‌ రిటర్నింగ్‌ మదర్స్‌’ అనే పేరు పెట్టింది. (ఉద్యోగాలకు తిరిగొస్తున్న తల్లుల సంకటస్థితి). ‘‘పురుషులకు మాత్రమే అన్నివిధాలా అనుకూలతలు ఉన్న ఉద్యోగ రంగాలలో మహిళా ఉద్యోగినులుల నష్టపోతున్నారన్నది నిజం.

లోపలికి వచ్చేందుకు వారికి ‘ప్రతిభ’ అనే ఒక ద్వారం ఉంటే.. బయటికి పంపించే ద్వారాలు.. గర్భధారణ, ప్రసవం, శిశు సంరక్షణ, పెద్దలను కనిపెట్టుకుని ఉండాల్సి రావడం, కుటుంబ మద్దతు లేకపోవడం, ఉద్యోగం చేసే చోట ప్రతికూలతలు.. అనే ద్వారాలు అనేకం ఉంటాయి. ప్రతిభ, సామర్థ్యం ఉండి కూడా ఈ ద్వారాల కారణంగానే మహిళలు ఉద్యోగాల్లో నిలదొక్కుకోలేకపోతున్నారు.

పైస్థాయిలను అందుకోలేక మధ్యలోనే పక్కకు తప్పుకుంటున్నారు’’ అని నివేదిక వ్యాఖ్యానించింది. బయటికి పంపే ఈ ద్వారాలన్నీ ఇలాగే ఉంటే కనుక 2030 నాటికి స్త్రీ, పురుష ఉద్యోగాల్లో 50:50 నిష్పత్తిని సాధించాలన్న అంతర్జాతీయ లక్ష్యం నెరవేరడం కష్టమేనని కూడా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

నివేదికను బట్టి చూస్తే మహిళలు ఉద్యోగాల్లో రాణించలేకపోవడానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. ఇంటికి న్యాయం చెయ్యలేకపోతున్నామనే అపరాధ భావన. కుటుంబం కోసం రాజీ పడిపోవడం. పనిచేసే చోట పర్యవేక్షకులకు మహిళల శక్తియుక్తులపై విశ్వాసం లేకపోవడం. ఆడది ఇంట్లోనే ఉండాలి, మగాడే బయటికి వెళ్లాలి అనే సామాజిక ధోరణి.

ఈ నాలుగూ స్త్రీ ఉద్యోగానికి నాలుగు శత్రువుల్లా ఎప్పుడూ పొంచి ఉంటాయి. అంటే ఉద్యోగానికి వెళ్తున్న ప్రతి మహిళా అనుక్షణం ఒకేసారి నలుగురు ప్రత్యర్థులతో తలపడాలి. వ్యక్తిగా కుటుంబం కోసం, శ్రమలో భాగస్వామిగా దేశ అభివృద్ధి కోసం ఆమె తలపడుతున్నప్పుడు కుటుంబం, ప్రభుత్వం ఆమెకు సహాయ సహకారాలు అందించడం తమ కనీస బాధ్యతగా భావించాలి.

మరిన్ని వార్తలు