అశ్వగంధకు ఇదే అదను!

24 Jul, 2018 04:47 IST|Sakshi

రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే ఔషధ పంటల్లో అశ్వగంధ ముఖ్యమైనది. తెలుగురాష్ట్రాలతోపాటు మరో 4 రాష్ట్రాల్లో అశ్వగంధ సాగులో ఉంది. పంటకాలం 150–180 రోజులు. ఆగస్టు మొదటి వారం వరకు దీన్ని విత్తుకోవచ్చు. అశ్వగంధ వేర్లు, కాండం, ఆకుల్లో ఔషధ గుణాలుంటాయి. అయితే వాణిజ్యపరంగా వేర్లకే గిరాకీ ఉంటుంది. మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది. వేర్లు లేత పసుపుతో కూడిన తెలుపు రంగులో చిరుచేదుగా ఉంటాయి. నరాల బలహీనతను నివారించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, అల్సర్ల నివారణకు ఉపయోగిస్తారు. అశ్వగంధ వేర్ల చూర్ణం నిద్రలేమిని నివారిస్తుంది.

నీరు నిల్వ ఉండని నేలలు, పొడి వాతావరణం అనుకూలం.  ఉదజని సూచిక 7.5–8.0 మధ్య ఉండాలి. వర్షాధార పంటగా సాగుకు తేలికపాటి నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉంటే ఇసుక నేలలు లేదా తేలికపాటి ఎర్రనేలలు అనుకూలం. జవహర్‌–20, రక్షిత, నాగరి రకాలు విత్తుకోవచ్చు. తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్‌ బోడుప్పల్‌లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ(సీమాప్‌) అందించే పోషిత రకం వంగడం అనుకూలం. ఎకరాకు నారు పద్ధతిలో 2 కిలోలు, వెదజల్లే పద్ధతిలో 7–8 కిలోలు అవసరం. 5 రెట్లు ఇసుకతో కలిపి వెదజల్లాలి. నారును వరుసల మధ్య 25–30 సెం.మీ., మొక్కల మధ్య 8–10 సెం.మీ. ఉండేలా నాటుకోవాలి. అశ్వగంధకు తీవ్రమైన తెగుళ్లేవీ రావు.

కాయలు ఎరుపు రంగులోకి మారినప్పుడు లేదా ఆకులు పూర్తిగా ఎండిపోయినప్పుడు మొక్కలను పీకి వేర్లను సేకరించాలి.  వేర్లను 7–10 సెం.మీ. ముక్కలు చేసి నీడన ఆరబెట్టుకోవాలి. ఎండిన వేర్లను గ్రేడింగ్‌ చేసుకొని నిలువ ఉంచుకుంటే రైతులకు మంచి ధర లభిస్తుంది. ఎకరాకు 250–300 కిలోల ఎండు వేర్లు, 80 కిలోల విత్తనం వస్తుంది. ఎకరాకు ఖర్చు రూ. 15 వేల వరకు ఉంటుంది. జాతీయ ఔషధమొక్కల బోర్డు, తెలంగాణ ఔషధ మొక్కల బోర్డు(94910 37554) ఎకరా సాగుకు రూ. 4,392 వరకు సబ్సిడీ అందిస్తున్నాయి. మార్కెట్‌ ధరను బట్టి రూ. 35,000–45,000 వరకు నికరాదాయం రావచ్చు. మధ్యప్రదేశ్‌లోని నీమచ్, మాండ్‌సర్‌ మార్కెట్లు అశ్వగంధ కొనుగోలుకు ప్రసిద్ధి. స్థానికంగా కూడా మార్కెటింగ్‌ అవకాశాలున్నాయి.
(రాజేంద్రనగర్‌లోని శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలోని ఉద్యాన కళాశాల పరిశోధక విద్యార్థులు ఎస్‌. వేణుగోపాల్, బి. అనిత అందించిన సమాచారం)
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు