ప్రేక్షకురాలిపైనే సినిమా!

17 Oct, 2019 02:04 IST|Sakshi

కమింగ్‌ సూన్‌

సొంతిల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌.. ఈ మూడూ ఉంటే చాలు లైఫ్‌ హ్యాపీగా గడిచిపోతుంది అంటారు ‘ఇన్ఫోసిస్‌’ కంపెనీ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి. సొంతిల్లు అన్నారు కానీ బంగళా అనలేదు. కారు అన్నారు కానీ ఆడీనో, బిఎండబ్ల్యూనో అనలేదు. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ అన్నారు కానీ కోట్లు, లక్షల కోట్లు అనలేదు. నెల నెలా అద్దె కట్టే అవసరం లేకుండా సొంత ఇల్లు, ఏ వేళనైనా ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా చిన్న కారు, ఊహించని ఆర్థిక అవసరాలకు ఎవరి దగ్గరా చెయ్యి చాచే అవసరం లేకుండా కొంత బ్యాంకు బ్యాలెన్స్‌ ఉండాలని సుధామూర్తి మాటల్లోని అంతరార్థం.

ఇంట్లో మొక్కల్ని పెంచడం; కారులో భర్త పిల్లల్తో కలిసి ప్రకృతి అందాలను వీక్షించడానికి వెళ్లడం ఆమెకు ఇష్టమైన విషయాలు. ఇక సినిమాలంటే ఎంతిష్టమో చెప్పేపనే లేదు. రోజుకో సినిమానైనా చూడందే ఆమెకు నిద్రపట్టదు. ఏడాదికి కనీసం 365 సినిమాలు చూస్తారు సుధామూర్తి. ఈ 69 ఏళ్ల వయసులోనూ ఆమె సినిమాలను వదిలిపెట్టనే లేదు. ఇంతగా సినిమాలను ఇష్టపడే, ప్రేమించే సుధామూర్తి పైనే ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది! సుధామూర్తి దంపతుల జీవితకథను అశ్వినీ అయ్యర్‌ తివారి ఒక స్ఫూర్తివంతమైన సినిమాగా తియ్యబోతున్నారు.

‘బరేలీ కీ బర్ఫీ’, ‘నీల్‌ బత్తి సనాటా’ చిత్రాల దర్శకురాలే అశ్వనీ అయ్యర్‌. 2017లో వచ్చిన ‘బరేలీ కీ బర్ఫీ’ రొమాంటిక్‌ కామెడీ. అంతకుముందు ఏడాది వచ్చిన ‘నీల్‌ బత్తి సనాటా’ కామెడీ డ్రామా. సుధామూర్తితో కలిసి దిగిన ఫొటోను అశ్వినీ అయ్యర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘‘నిజాయితీతో కూడి ఈ ఆలూమగల జీవితం నాకు పెద్ద ఇన్‌స్పిరేషన్‌’’ అని రాశారు. అశ్వినీ అయ్యర్‌ తీయబోయే ఈ సినిమా బహుశా.. సుధామూర్తి దంపతులకు సొంతిల్లు, కారు, బ్యాంకు బ్యాలెన్సు లేని కాలం నుంచి మొదలవొచ్చు.

►సినిమాలను ఎంతగానో ఇష్టపడే, ప్రేమించే సుధామూర్తి పైనే ఇప్పుడొక సినిమా రాబోతోంది. కేవలం రెండు చిత్రాలతో ప్రసిద్ధురాలైన అశ్వినీ అయ్యర్‌ తివారీ ఆ సినిమాను తీయబోతున్నారు.

మరిన్ని వార్తలు