ఈ  మూడూ ప్రశ్నించుకుని  ముందుకు కదలండి

5 Aug, 2018 00:24 IST|Sakshi

కలాం కలలు

అబ్దుల్‌ కలాం విద్యార్థులచేత చేయించిన రెండో ప్రతిజ్ఞ – సమగ్రతతో పనిచేసి సమగ్రతతో విజయాన్ని సాధిస్తాను–అని. ఆయన మాట వెనుక గంభీరమైన ఉద్దేశం ఏమిటంటే... నేను ఈ పని చేస్తే మా అమ్మగారు సంతోషిస్తారా ? నేను ఈ పని చేస్తే వృద్ధిలోకి వస్తానా? నేను ఈ పని చేస్తే నేనొక్కడినే కాకుండా నా చుట్టూ ఉన్న సమాజం సంతోషిస్తుందా? అని నిష్పక్షపాతంగా మీరు వేసుకునే ప్రశ్నలకు ఔననేదే సమాధానం అయితే మీరు నిరభ్యంతరంగా ముందడుగు వేయాలని మీకు స్పష్టత ఇవ్వడం. మీ సంకల్పం ఎంత పవిత్రమయితే మీ వెంట నడిచే వాళ్ళ సంఖ్య అంత బలంగా ఉంటుంది. దానికి మీరు ప్రయత్న పూర్వకంగా ఎవరినీ కూడగట్టుకోనక్కరలేదు. స్వార్థంతో ఉన్నవాళ్ళు కూడా దాన్ని వదిలి మీతో కలిసి అడుగులేస్తారు. అన్నివేళలా మీ అధికారబలం చూసో లేక మీ స్థాయి చూసో మీ వెంట రారు, మంచి బుద్ది, మంచిసంకల్పం ఉంటే మీ వెనుక అశేషంగా జనం తరలి వస్తారు. దానికి ఒక ఉదాహరణ...

అబ్దుల్‌ కలాం నిర్వహించినది భారత రాష్ట్రపతి పదవి. తరువాత ఆయన మరేపదవీ అధిష్టించలేదు. దానికి ముందు ఆయన ఒక శాస్త్రవేత్త. జీవిత పర్యంతం ఆయన శాస్త్రవేత్తే. అంతే. ఆయన శరీరం విడిచి పెట్టేసిన రోజున ఆశ్చర్యం.. చిన్నచిన్నపిల్లలు దీపాలు చేతిలో పెట్టుకుని కాగితాలమీద అబ్దుల్‌ కలాంగురించిన కొన్ని మాటలేవో రాసుకుని, దీనవదనాలతో నడిచి వెళ్ళారు. యావద్భారతం, ప్రపంచం అంతా ఒక మహాపురుషుడు వెళ్ళిపోయాడని చెప్పి ఎంత బాధపడిందో...!! దానికి కారణం... జీవితకాలంలో ఆయన సంకల్పాలు, ఆయన నడవడిక.. పదిమంది మంచికోరి ఆయన పడిన తపన, దేశంలోని విద్యార్థులందరి అభ్యున్నతి కోరి ఆయన పడిన ఆవేదన. అందుకే ఆయన శరీరం విడిచిపెట్టినా కీర్తి శరీరంతో నిలబడ్డాడు. ఒక మనిషి జీవితంలో ఉండాల్సిన లక్షణం అది.దేనివల్ల మీరు ప్రేరణ పొందుతున్నారన్న విషయంలో మీకు స్పష్టత, ఒక అవగాహన ఉండాలి. అది లేకపోతే చేయకూడని పనివైపుకి, చేయకూడని ఆలోచన వైపుకి మీ మనసు మళ్ళిందనుకోండి. అక్కరలేని వ్యసనాలకు మనిషి అలవాటుపడతాడు. జీవితాలు భ్రష్టత్వం పడతాయి.

మీరు చేసే పని ఇతరులను బాధపెట్టేది కాకూడదు. అది జీవితంలో అలవాటయిందా అంతకన్నా మంచిపని మరొకటి ఉండదు. అలాకాక ఇతరులు బాధపడినా, ఏడ్చినా, నాశనమయిపోయినా నా కేమీ సంబంధంలేదు, నేను ఒక్కడినీ సంతోషపడితే చాలు, నా మనసులో కోరిక తీరితే చాలు..అన్న సంకల్పం మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది. నేనెంత కష్టపడినా ఫరవాలేదు, పదిమంది సంతోషిస్తారు, కష్టపడడం అంటే తప్పుమార్గంలోకాదు, సంకల్పం పవిత్రమై, చాలామందికి మేలు కలుగుతుందంటే తప్పకుండా మీరు కష్టపడి అటువంటి పనిచేయండి. దీపం తాను హరించుకుపోతూ వెలుగును వెదజల్లినట్లుగా మహాత్ములయిన వాళ్ళందరూ వాళ్ళ జీవితకాలంలో పదిమంది సుఖం ఆశించి నానా బాధలు పడినవారే. బతికున్నంతకాలం కేవలం తన గురించే కాకుండా తన చుట్టూ ఉన్న వారి గురించి కూడా ఆలోచించిన వాడెవడో అటువంటి వాడిని సమాజం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుని ఆయన చెప్పిన మాటలు స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడిచి వెడుతుంది. ఆయన శరీరంలో ఉన్నాడా లేడా అన్న దానితో సంబంధంలేదు. ఆయన కీర్తి శరీరుడౌతాడు. సమగ్రత అన్నది మనిషికి ప్రాణంతో సమానం. అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు