దృఢమైన మనసు

24 Apr, 2018 00:07 IST|Sakshi

చెట్టు నీడ 

ఓ భగవంతుడా! కష్టాలకు భయపడి పారిపోకుండా వాటిని ఎదుర్కొనగలిగే ధైర్యాన్ని నాకు ప్రసాదించు. ఆపదలు వచ్చినప్పుడు నన్ను రక్షించమని నేను ప్రార్థించడం లేదు. కానీ వాటిని ఎదుర్కొనటానికి కావలసిన శక్తిని ప్రసాదించమని మాత్రం నిన్ను వేడుకుంటున్నాను. కష్టాలలో నేను కొట్టుకుపోతున్నప్పుడు నాకు సాంత్వన చేకూర్చమని నేను నిన్ను వేడుకోవడం లేదు. నా కష్టాలనే కుసుమాలుగా మార్చి, వాటిని నీ పాదాల చెంత ఉంచి, కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని తగిన విజయం సాధించగలిగే శక్తిని నాకు ప్రసాదించు అని వేడుకొంటున్నాను. ఈ విధంగా ఎవరైనా ప్రార్థిస్తారా అసలు? అలాంటి వారు ఉంటారా? ఉంటే భగవంతుడు వారి కోరికను తీరుస్తాడా? ఇదంతా ఏదో వ్యక్తిత్వ వికాస పాఠంలా కనిపిస్తోంది కానీ, ప్రార్థనలా ఉందా? ఉన్నట్టే ఉంది.

ఎందుకంటే, కొన్ని వేల ఏళ్ల కిందటే ‘‘నేను నిన్ను మరచిపోకుండా ఉండాలంటే, నాకు కావలసింది సుఖాలు, సంపదలు కాదు, కష్టాలు, కడగండ్లే. కాబట్టి ఓ కృష్ణా! నీవు నాకు అనుక్షణం గుర్తుకు వచ్చేలా నాకు ఎప్పుడూ ఏదో ఒక కష్టాన్ని ఇస్తూ ఉండు’’ అని కుంతీదేవి తన మేనల్లుడైన శ్రీ కృష్ణుని ప్రార్థించిందట.  నిజంగా ఎంత గొప్ప ప్రార్థనో కదా! ప్రార్థన అనేకంటే, ఎంత దృఢమైన మనసో కదా! అనుకోవాలి. ఎందుకంటే, భగవంతుడి మీద మనకు ఉన్న విశ్వాసం ఆయన్ని ‘అవి కావాలి, ఇవి కావాలి’ అని కోరుకునే యాచనగా కాదు, శక్తిగా మారాలి. మనస్సు బలహీనతకు గురి కాకుండా ఉండేంత శక్తిమంతంగా ఉండాలి. 
– డి.వి.ఆర్‌.

మరిన్ని వార్తలు