ఉబ్బసానికి  చేప విరుగుడు!

9 Nov, 2018 01:10 IST|Sakshi

ఏడాదికి ఒకసారి ఉబ్బసం రోగులకు హైదరాబాద్‌లో ఇచ్చే చేపమందుపై ఎన్నో వివాదాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. వీటి మాటెలా ఉన్నా ఉబ్బసంతో బాధపడుతున్న వారు మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు చేపలు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు లా ట్రోబ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ అధ్యయనంలో భాగంగా కొవ్వులు ఎక్కువగా ఉన్న చేప రకాలను ఆహారంగా తీసుకున్న ఉబ్బసం రోగుల ఊపిరితిత్తుల పనితీరు ఆరునెలల్లో మెరుగైనట్లు గుర్తించారు. చిన్నతనంలో వచ్చే ఉబ్బసానికి చేపలతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం మెరుగైన చికిత్స అనేందుకు ఇదో తార్కాణమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మారియా పాపామైకేల్‌ అంటున్నారు.

ఉప్పు, చక్కెర, సాధారణ కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారంతో ఉబ్బసం లక్షణాలు తీవ్రమవుతాయని ఇప్పటికే గుర్తించగా చేపల్లో ఉండే ఒమేగా –2 ఫ్యాటీ యాసిడ్లు దీనికి మినహాయింపు అని తమ అధ్యయనం చెబుతోందని అన్నారు వారానికి కేవలం రెండు సార్లు మాత్రమే చేపలు ఆహారంగా తీసుకున్నా ఊపిరితిత్తుల్లోని మంట/వాపు తగ్గే అవకాశముందని చెప్పారు. గ్రీస్, ఆస్ట్రేలియాల్లోని 5 – 12 మధ్య వయసు పిల్లలపై తాము ఈ అధ్యయనం చేసినట్లు చెప్పారు. కొంతమందికి సాధారణ ఆహారం, ఇంకొంతమందికి దాదాపు 150 గ్రాముల కొవ్వులున్న చేపలు ఆహారంగా ఇచ్చామని, ఆరు నెలల తరువాత పరిశీలించగా ఊపిరితిత్తుల మంట/వాపు 14 యూనిట్ల వరకూ తగ్గిందని వివరించారు.  

మరిన్ని వార్తలు