అశ్విని అక్క

9 Feb, 2015 22:32 IST|Sakshi
అశ్విని అక్క

షహనాజ్ కడియం, సాక్షి, బెంగళూరు
 
బెంగళూరులోని కోనన్‌కుంటె ప్రాంతంలో ఉన్న ఆ బడిలోకి అడుగుపెట్టగానే విరబూసిన పువ్వుల్లాంటి చిన్నారుల నవ్వులు మనల్ని పలకరిస్తాయి. ఇక వారంతా ఎంతో ప్రేమగా పిలుచుకునే ‘అశ్విని అక్క’ అక్కడికి వచ్చిందంటే ఒకరు చేసిన అల్లరి గురించి మరొకరు చెప్పే ఫిర్యాదులూ వినవచ్చు. అయితే వారిని కంటి పాపల్లా చూసుకుంటున్న ఆ అశ్విని అక్క (25) కూడా అంధురాలే కావడం విశేషం. అంతేకాదు, అంధులైన బాలబాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో శ్రమించినందుకు గాను ఐక్యరాజ్య సమితి నుండి ఆమె ‘యూత్ కరేజ్ అవార్డ్ ఫర్ ఎడ్యుకేషన్’ ను అందుకున్నారు. అయితే ఆమె అక్కడితో ఆగిపోలేదు. అంధులైన చిన్నారులకు అసరా అవ్వాలన్న పట్టుదలతో తన ఇంటినే ఓ పాఠశాలగా మార్చేశారు. ఆ పాఠశాలకు ‘బెళకు’(వెలుగు) అకాడమీగా నామకరణం చేసి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.

ప్రకాష్, వేదవతిల ముగ్గురు పిల్లల్లో రెండవ సంతానం అశ్విని. అశ్వినికి చూపు లేదని తెలిసిన క్షణంలో ఆమె తల్లిదండ్రులు కుంగిపోయారు. ఆ తరువాత తేరుకొని ఆమెకు కూడా ఉన్నత చదువులను చేరువ చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. పదో తరగతి వరకు బెంగళూరులోని రమణ మహర్షి ఆశ్రమంలో చదివించారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు మాత్రం ఆమె అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చింది. బ్రెయిలీకి సంబంధించిన విద్యా విధానాలు కళాశాలల్లో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు అశ్విని. అయినా ఏ మాత్రం పట్టు వదలకుండా డిగ్రీ పూర్తి చేశారు అశ్విని. ఆ తరువాత కంప్యూటర్ కోర్సులు చేశారు. ఆమె ప్రతిభకు ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు అశ్విని. తన చదువు పూర్తయిన తరువాత తనలాంటి వారికోసం ఏదైనా చేయాలనే లక్ష్యంతోనే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. తర్వాత, ప్రత్యేక సామర్థ్యం గల వారి హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న ‘లియోనార్డ్ ఛెసైర్ డిసెబిలిటీ’(ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది) సంస్థలో 2011 జూలైలో ఒక సాధారణ వాలంటీర్‌గా చే రారు. కొద్ది కాలంలోనే వాలంటీర్ స్థాయి నుండి నేషనల్ ఫెసిలిటేటర్‌గా ఎదిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడున్న విభిన్న ప్రతిభావంతులను పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేశారు. ఫలితమే 2013లో ‘యూత్ కరేజ్ అవార్డ్ ఫర్ ఎడ్యుకేషన్’.
 
స్వయంగా తెలుసుకొని...

లియోనార్డ్ ఛెసైర్ డిసెబిలిటీ సంస్థలో వాలంటీర్‌గా పనిచేస్తున్న సమయంలో కర్ణాటకలోని ఎన్నో మారుమూల గ్రామాలను అశ్విని సందర్శించారు. వైకల్యంతో పాటు ప్రతిభా (స్పెషల్లీ ఏబుల్డ్) ఉన్న చిన్నారులకు విద్యను చేరువ చేయడానికి ఉన్న ఇబ్బందులేమిటో ఇదే సందర్భంలో ఆమె తెలుసుకున్నారు. అలాంటి చిన్నారులకు  ఆశ్రయం ఇచ్చేందుకు తానే ఓ ఫౌండేషన్‌ను స్థాపించాలని భావించారు. తన ఆలోచనలను ఆచరణలోకి మారుస్తూ బెంగుళూరులో ‘అశ్వని అంగడి ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘బెళకు’(వెలుగు) అకాడమీ పేరిట ఓ ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ అకాడమీలో పది మంది అంధ చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు.
 
ఇల్లే అకాడమీ!

విశేషమేమిటంటే అశ్విని సొంత ఇంటినే పాఠశాలగా మార్చేసి ‘బెళకు’ అకాడమీని ఏర్పాటు చేయడం. అశ్విని తల్లిదండ్రులు అద్దె ఇంటిలో నివసిస్తుండగా అశ్విని మాత్రం పాఠశాలలోని చిన్నారులతో అక్కడే ఉంటున్నారు. ఇలా ఎందుకని ప్రశ్నిస్తే...‘పాఠశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనైతే వచ్చింది కానీ, పాఠశాల ఏర్పాటు కోసం భవనాన్ని సమకూర్చుకోవడానికి చాలా ఖర్చవుతుంది కదా! అంత మొత్తం నా దగ్గర లేదు. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో చెప్పినప్పుడు ‘ఆ పాఠశాలను మన ఇంట్లోనే ప్రారంభించు, మేమే వేరే ఇల్లు అద్దెకు తీసుకుంటాం’ అని ప్రోత్సహించారు. ఇక నా తల్లిదండ్రులతో కాకుండా ఈ చిన్నారులతోనే ఎందుకు ఉంటున్నానంటే... అభం, శుభం తెలియని ఈ చిన్నారులు నేనే వారికి అన్నీ అని భావించి తల్లిదండ్రులను వదిలి పెట్టి ఎక్కడి నుండో ఈ అకాడమీకి వచ్చారు. అలాంటి వారిని ఇక్కడ వదిలిపెట్టి ఏదో కొన్ని గంటలు మాత్రమే అకాడమీకి వచ్చి వెళ్లిపోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అందుకే నేను వీరితోనే ఉండిపోయాను’ అని చెబుతారు అశ్విని.

కేవలం అంధ బాలలకు మాత్రమే కాక విభిన్న ప్రతిభావంతులైన (స్పెషల్లీ ఏబుల్డ్) వారికి సైతం అకాడమీ ద్వారా శిక్షణ ఇప్పించాలని అశ్విని భావిస్తున్నారు. ఇందుకోసం దాతల సాయాన్ని కోరే అలోచనలో ఉన్నారు.
 
 
అశ్విని తనకు వచ్చే పెన్షన్‌ను కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన చిన్నారులకు అందజేసేది. ఉద్యోగాన్ని వద్దనుకున్న సందర్భంలో... తన కోసం తాను బతకడం కన్నా తనలాంటి నలుగురికి ఆదరువుగా నిలవడంలోనే తృప్తి ఉందని అశ్విని మాకు నచ్చజెప్పింది. భవిష్యత్తులో అశ్విని తీసుకునే ఏ నిర్ణయానికైనా మా మద్దతు, సహాయ సహకారాలు ఉంటాయి.
 - అశ్విని తల్లిదండ్రులు
 
 ‘అక్క’ దిద్దిస్తోంది


 మా అశ్విని అక్క నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఎన్నో పద్యాలు చెప్పింది. అంతేకాదు నాకు ఎంచక్కా అక్షరాలు దిద్దిస్తుంది. అంకెలు నేర్పిస్తోంది. అందుకే నాకు అక్కంటే చాలా ఇష్టం. నేను కూడా అక్కలాగే చక్కగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తా.
 - చిన్నారి తనుశ్రీ

మరిన్ని వార్తలు