రిటైరయ్యే వయసులో రియల్ హీరో అయ్యాడు

24 Jan, 2014 23:16 IST|Sakshi

పేరు చెప్పక్కర్లేదు. బిగ్ బి అంటే చాలు!. ఆయన నటన గురించి ఎందరు చెప్పినా... ఏం చెప్పినా... తక్కువే!. అలాంటి అమితాబ్‌కు రిటైర్మెంటు వయసులో వచ్చాయి కష్టాలు. అందరూ హాయిగా విశ్రాంత జీవితం గడపటానికి రెడీ అయ్యే సమయంలో ఆయన తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. నష్టాల్లో కూరుకుపోయిన సొంత కంపెనీ ఏబీసీఎల్... ఆయన్నూ కష్టాల్లోకి నెట్టేసింది. ఇల్లు కూడా అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. మళ్లీ జీరో దగ్గర జీవితాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది.
 
 సినిమాల్లో మాదిరే జీవితంలో కూడా అమితాబ్ హీరోలానే నిలబడ్డారు. కష్టాలకు ధైర్యంగా ఎదురొడ్డారు. కష్టాలనుంచి బైటపడ్డారు. కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోతో నిజంగానే మళ్లీ కరోడ్‌పతి అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్‌నూ సక్సెస్ చేసి చూపించారు. ఒకప్పుడు దివాలా పరిస్థితి ఎదుర్కొన్న అమితాబ్ బచ్చన్ వ్యక్తిగత సంపద ప్రస్తుతం రూ.500 కోట్లపైనే ఉంటుందని అంచనా. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. 2013లో ఆయన ఆదాయం సుమారు రూ.147 కోట్లు. 70 ఏళ్లు దాటినా అదే ఉత్సాహంతో ఎడాపెడా సిని మాలు, ప్రకటనలు, టీవీ షోలూ చేస్తూనే ఉన్నారు బిగ్ బి.
 
పెట్టుబడుల్లో వైవిధ్యం...
 
అమితాబ్ తన పెట్టుబడుల్ని ఏ ఒక్క రంగానికో, ఏ ఒక్క సాధనానికో పరిమితం చేయలేదు. వైవిధ్యాన్ని పాటించారు. కొన్నాళ్ల కిందట వెల్లడించిన వివరాల ప్రకారం... బ్యాంకుల్లో ఆయన ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ సుమారు రూ.92 కోట్లు. సేకరించిన కళాకృతుల విలువ సుమారు రూ.3 కోట్లు, బంగారం.. ఆభరణాలు మొదలైన వాటి విలువ దాదాపు రూ.25 కోట్లు. వ్యవసాయ.. వ్యవసాయేతర భూముల విలువ సుమారు రూ.30 కోట్లు. ఇక రియల్టీలో పెట్టుబడుల విలువ దాదాపు డెభ్బై కోట్ల పైనే ఉంటుంది. ఒకప్పుడు తనను నిలువునా ముంచిన ఏబీసీఎల్ కంపెనీని పునరుద్ధరించి ఏబీ కార్ప్‌గా మార్చారు అమితాబ్. పా లాంటి విజయవంతమైన సినిమాలూ తీశారు. అంతేకాక స్టాక్‌మార్కెట్లలోనూ ఇబ్బడిముబ్బడిగా ఇన్వెస్ట్ చేశారు. జస్ట్ డయల్ వంటి కంపెనీల షేర్లలో రూ.6 లక్షలు పెడితే.. ఆ విలువ ప్రస్తుతం రూ.10 కోట్లకు చేరింది.
 
ఏతావాతా అమితాబ్ స్టోరీ చెప్పేదేంటంటే.. సంపాదించడమే కాదు. దాన్ని భద్రంగా చూసుకోవటమూ ముఖ్యమే. ఆ విషయాన్ని లేటుగా గుర్తించినా.. తగిన ప్రణాళికతో ముందుకెళ్లారు అమితాబ్. అందర్నీ గుడ్డిగా నమ్మకూడదని గుర్తించారు. డబ్బంతా ఒకేచోట ఇన్వెస్ట్ చేయకుండా రియల్టీ, ఎఫ్‌డీలు, బంగారం, కళాకృతులు ఇలా వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా తీర్చిదిద్దుకున్నారు.
 

మరిన్ని వార్తలు