అప్పట్లో ఆవిరి బైకులు

1 Nov, 2015 03:53 IST|Sakshi
అప్పట్లో ఆవిరి బైకులు

మోటార్‌బైకులు ఇప్పుడు కామన్‌గా మారాయి గానీ, శతాబ్దం కిందట చాలా అరుదుగా ఉండేవి. అయితే, మోటార్‌బైక్ ఆవిర్భావం వెనుక చాలా చరిత్రే ఉంది. ఆవిరి యంత్రం కనిపెట్టిన తర్వాత రవాణారంగం వేగం పుంజుకుంది. వాహనాలను నడపడానికి ఆవిరి శక్తిని ఉపయోగించడం మొదలైంది. తొలినాళ్లలో పెద్ద వాహనాలను నడపడానికే ఆవిరిశక్తిని ఉపయోగించేవాళ్లు. ఇదే శక్తితో రెండు చక్రాల సైకిల్‌ను కూడా నడపవచ్చని 1860లలో ఇద్దరు ఇంజనీర్లు ఆలోచించారు. ఫ్రెంచి ఇంజనీర్ పియర్రె మిషాక్స్, అమెరికన్ ఇంజనీర్ సిల్వెస్టర్ హోవర్డ్ రోపర్ వేర్వేరుగా తమ ప్రయత్నాలు చేశారు.

మిషాక్స్ సింగిల్ సిలిండర్ ఆవిరి యంత్రాన్ని సైకిల్‌కు అమర్చాడు. రోపర్ డబుల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చాడు. ఈ రెండు ఇంజన్లూ సైకిళ్లకు మించిన భారం కావడంతో వారిద్దరివీ విఫలయత్నాలుగానే మిగిలాయి. అయితే, 1885లో జర్మన్ ఇంజనీర్ గాట్లియెబ్ డైమ్లర్ పెట్రోలుతో నడిచే ఇంజన్‌ను విజయవంతంగా రూపొందించాడు.

దీనికి పేటెంట్ కూడా సాధించాడు. డైమ్లర్ రూపొందించిన మోటార్‌సైకిళ్లు 1890 నాటికల్లా యూరోప్ వీధుల్లో విహరించడం ప్రారంభించాయి. అప్పట్లో జనాలు వాటిని అబ్బురంగా చూసేవాళ్లు. దాదాపు యాభయ్యేళ్ల పాటు మోటార్‌సైకిళ్ల నమూనాల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, 1940-50 మధ్య కాలంలో గణనీయమైన మార్పులే వచ్చాయి. వాటి ఆధారంగానే పలు కంపెనీలు అధునాతనమైన మోటార్ సైకిళ్లకు రూపకల్పన చేయడం ప్రారంభించాయి.

>
మరిన్ని వార్తలు