అనుకోలేదని ఆగవు కొన్ని...

4 May, 2015 23:36 IST|Sakshi
అనుకోలేదని ఆగవు కొన్ని...

మే 7 ఆత్రేయ జయంతి
 
ఆత్రేయకు నివాళి అంటే ఆయన పాటను తలచుకోవడమే! జీవితాన్ని అర్థం చేసుకోవడమే... ఆ వైభవాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే!!
 
తెలుగు సులువుగా లేకపోతే ఆత్రేయ సులువైన కవి అయి ఉండేవాడు కాదు.
సుకవీ అయి ఉండేవాడు కాదు.
తెలుగు- ఆత్రేయను గొప్ప కవిని చేసింది.
ఆత్రేయ- తెలుగును గొప్ప పాట చేశాడు
.
       
ఒక చిన్నపిల్లవాడు ఇంటి నుంచి తప్పిపోయాడు. తల్లిదండ్రుల కనిపించక నిర్మానుష్యమైన ఎడారిలో, ఎండలో, కన్నీళ్లను తాగుతూ, వెక్కిళ్లు పెడుతూ తిరుగుతున్నాడు. ఆ పిల్లవాడు తన వేదనను పాటలో చెప్పాలి. ఏం పాడతాడు? కవిత్వం చెబుతాడా? ప్రాసతో కనికట్టు ప్రదర్శిస్తాడా? స్వచ్ఛమైన పసి దుఃఖం అది. మాటలు కూడా అంతే స్వచ్చంగా ఉండాలి.

అమ్మా చూడాలి
నిన్నూ నాన్నను చూడాలి
నాన్నకు ముద్దులు ఇవ్వాలి
నీ ఒడిలో నిద్దుర పోవాలి...

ఏ పిల్లాడైనా ఇంతకు మించి ఏం మాటలు కూడగట్టుకోగలడు ఆ కష్టంలో? ఈ పాట రాసేటప్పటికి ఆత్రేయ వయసు 50 ఏళ్లు. కాని రాస్తున్న క్షణాన తొమ్మిదేళ్లు.
       
ఆత్రేయ మాటల మనిషి. ఉత్త మాటల మనిషి కాదు. నెల్లూరు జిల్లాలోని చిన్న పల్లెటూళ్లో పుట్టి, పెరిగి, ప్రజల జీవనాడిగా ఉండే భాషలోని మాటలను పట్టి కలంలో నింపుకున్న మనిషి. వాటిని ఆయన మొదటగా ఉపయోగించింది నాటకాల్లోనే. ‘ఎన్.జి.వో’ నాటకం చాలా పెద్ద హిట్. ‘కప్పలు’ ఇంకా పెద్ద హిట్. నేరుగా, సులభంగా, సూటిగా ఉన్న మాట శక్తి ఆత్రేయకు బాగా తెలుసు. మాటను నాటడం, పర్మినెంట్ మెమరీ చిప్‌గా చేసి మనసులోకి ఎక్కించడం బాగా తెలుసు. పొడుగు పొడుగు సంభాషణలతో కాదు, చిన్న చిన్న పదాలతోనే.
 ప్రేమ్‌నగర్‌లో హీరో గురించి చెప్పాలి. కాని అతడి గౌరవం పోకుండా చెప్పాలి. అందుకే ఆత్రేయ రాస్తాడు: ‘చినబాబు చెడిపోయాడేమోగాని చెడ్డవాడు మాత్రం కాదమ్మా’. సన్నివేశాన్ని మాత్రమే కాదు, సినిమా సోల్‌ని కూడా నాలుగడుగులు పైకి లేపడం ఆత్రేయకు తెలుసు. అందుకే మూగమనసులు సినిమాలో రాస్తాడు: ‘చావు ఎంతమందినో విడదీస్తుంది. కాని కొంతమందిని కలుపుతుంది’. కేరెక్టర్‌ని, కేరెక్టర్ డెప్త్‌ని చెప్పే డైలాగ్స్ ఆత్రేయ పాళీ చివర ఉంటాయి. అడిగితే చాలు కాగితం మీద కదులుతాయి. ‘వెలుగు నీడలు’ సినిమాలో ఆ ఫేమస్ డైలాగ్ గుర్తు లేదా? ‘కన్నీరే మనిషిని బతికించగలిగితే అమృతంలాగే అదీ కరవైపోయేది’. ఆత్రేయకు ముందు ‘ఆచార్య’ అనే అలంకారం ఉంది. నిజంగా ఆయన ఆచార్యుడే. మాటల యూనివర్సిటీకి రిటైర్మెంట్ లేని వైస్ చాన్సలర్.
       
ఆత్రేయకు మాటలు తెలుసు. మాటల వల్ల వచ్చే కష్టం తెలుసు. ‘ఇవాళ కాదు. రేపు’, ‘ఇప్పుడేం అవకాశాలు లేవు పో’, ‘నీ ముఖానికి సినిమాలా’... ఇలాంటి మాటలన్నీ పడ్డాడు. ఇంట్లో వెండి చెంబు అమ్మి మద్రాసు చేరుకొని కటిక నేల మీద ఆకలి కడుపుతో నిదురించాడు. తన ప్రాంతం వాడే అయిన హాస్యనటుడు రమణారెడ్డి ‘రావయ్యా రా’ అని పిలిచి నాలుగిడ్లీలు పెట్టిస్తే కారం వల్లో, కృతజ్ఞత వల్లో కళ్లల్లో నీళ్లు కారిపోయేవి. తెల్లవారితే ఎలా అని భయం. రాత్రయితే ఏమిటి దారి అని భీతి. కాని మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నెల్లూరు నుంచి వచ్చిన పంతులుగారు బాగా రాస్తారు అని వచ్చింది. సినిమాలు వచ్చాయి. మాటకు మాటా ఇచ్చేవాడు నెగ్గుకు వస్తాడు. అప్పుడైనా ఎప్పుడైనా ఆత్రేయ పాటించింది ఒకటే సూత్రం. జయభేరి సినిమాలో ఆయనే డైలాగ్ రాసినట్టు ‘సామాన్యుడికి అందుబాటులో లేని కళ సంకుచితమై సమసిపోతుంది’ అనేదే ఆ సూత్రం. మాటైనా, పాటైనా సులువుగా ఉండాలి. సామాన్యుడికి అందాలి.
 ‘మనసు గతి ఇంతే’... రిక్షావాడూ పాడాడు. పండితుడూ గౌరవించాడు.
       
సేయింగ్స్ అనండీ, సామెతలు అనండి, జాతీయాలు అనండి... అలాంటివి వింటే మనిషి వాటిని టక్కున పట్టుకుంటాడు. కంఠోపాఠం చేసుకుంటాడు. ఆత్రేయ తన ప్రతి పాటనూ అలా ఒక సేయింగ్‌లాగానో, సామెతలాగానో మలిచాడు. పల్లవిలోనో చరణంలోనో ఎక్కడో ఒకచోట ఒక జాతీయంలాంటి మాట రాస్తాడు. మన ఆత్రేయ ఏం చెప్పాడురా అని ప్రేక్షకుడు పట్టుకుంటాడు. గతంలో వేమనకు ఈ గౌరవం దక్కింది. ఆ తర్వాత ఆత్రేయకు.

‘మనసే మనిషికి తీరని శిక్ష’ అనో ‘మమతే మనిషికి బందిఖానా’ అనో ఆత్రేయ అంటే ఒక ఓదార్పు. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్నీ’ అనంటే తెరిపినపడ్డ భావన. ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అనో ‘ఏ కన్నీళ్లైనా వెచ్చగానే ఉంటాయి’ అనో అనంటే ఈ కష్టం మనకే కాదు అందరూ పడుతున్నారు అందరూ అనుభవిస్తున్నారు దీనిని భరించొచ్చు అనే ధైర్యం. అందుకే ఆత్రేయ ‘నవ్వుతూ బతకాలిరా’ అన్నాడు. ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ అని కూడా అన్నాడు.
       
తమిళంలో కణ్ణదాసన్ గొప్ప కవి. తెలుగులో ఆత్రేయ అంతకు ఏమాత్రం తక్కువ కాదు. తమిళంలో హిట్ అయిన తన సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు పాటల కోసం బాలచందర్‌కు ఆత్రేయ తప్ప వేరెవరూ కనిపించలేదు. ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’, ‘కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు’, ‘అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం’, ‘తాళికట్టు శుభవేళ’... అన్నీ ఎమ్.ఎస్. విశ్వనాథన్ బాణీలతో ఆత్రేయ మాటలతో తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఒకెత్తు ‘గుప్పెడు మనసు’ కోసం ఆత్రేయ రాసిన ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’ పాట ఒకెత్తు. బాలమురళీకృష్ణ గంభీరంగా గానం చేసిన ఈ పాటలో మనసు చేసే మాయలన్నింటినీ ఆత్రేయ చాలా సులభమైన మాటల్లో చూపిస్తాడు.
‘లేనిది కోరేవు... ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’....
ఈ రెండు వాక్యాలతో ఆత్రేయ ఫ్రాయిడ్ సరసన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.
       
ఆత్రేయ చాలా పాప్యులర్ నంబర్స్ రాశాడు.
‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’...
చాలా కోమలమైన గీతాలు రాశాడు
‘నీవు లేక వీణ పలకలేనన్నది’...
చాలా ప్రబోధాత్మక గీతాలు రాశాడు
‘భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు’..
 
శ్రీశ్రీ మనందరికీ ఇష్టమే. కాని ఆత్రేయ ఆయనను తలపించేలా ‘చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా’ అంటూ ‘కారులో షికారుకెళ్లే’.. పాట రాశాడు. శ్రీశ్రీ మాత్రం తక్కువ తిన్నాడా. ఆత్రేయను గౌరవిస్తూ ఆత్రేయ పేటెంట్‌గా భావించే ‘మనసు’ను మకుటంగా తీసుకుంటూ ‘మనసున మనసై బతుకున బతుకై’ పాట రాసి శ్రోతల తోడుండిపోయాడు.
       
కాలం మారింది. వేటూరి కొండగాలి వచ్చి హీరోయిన్ కోకెత్తుకెళ్లింది. చక్రవర్తి విజృంభించాడు. సినారె స్థిరంగా తన పల్లవులను సారించాడు. ఆత్రేయ కొంచెం వెనుకబడ్డాడు. కాని ఆయన పాట కాదు. ‘సీతారామ కల్యాణం’, ‘అభినందన’ సినిమాలు ఆత్రేయ సిరా పలుచబడలేదనడానికి ఉదాహరణలు.
ఆత్రేయ సంపాదించుకున్నాడా పోగొట్టుకున్నాడా ఎవరికి కావాలి?
ఆత్రేయ తన పాటలను తెలుగువారికి ఎంత సంపదగా ఇచ్చి వెళ్లాడా కావాలి.
ఆత్రేయ గాలిలో తేలే పాత్రల్ని, ఊతం లేని సన్నివేశాలను ఇచ్చి పాట రాయమన్నవారిని రాయక ఏడిపించాడు.
తనను కదిలించే చిన్న సన్నివేశానికి కూడా ఆకాశమంత ఎత్తున్న అర్థమున్న రాసి ప్రేక్షకులను ఏడిపించాడు.
       
ఆత్రేయ పాట ద్విముఖి.
అది ఒకరికి కన్నీటి చుక్క. మరొకరి ఆనందబాష్పం.
ఆ మనసున్న మాటకు మల్లెపూల దోసిలి.
 - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి
 
‘‘ఆత్రేయ తన పాండిత్యాన్ని పాటల్లో ప్రదర్శించలేదు. సినిమా పాటను పామరులకు సన్నిహితం చేసిన ఘనత ఆయనదే. ఆయన రాసిన పాటల్లో నాకు బాగా ఇష్టమైనది ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదానా’. రొమాన్స్‌లో కమ్యూనిజాన్ని ఈ పాటలో చూపించారు. ఆయన జీవిత చరమాంకంలో బాగా సన్నిహితంగా మసిలే అవకాశం నాకు దక్కింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఆయన స్వీయ చరిత్ర రాయడం మొదలుపెట్టి, పూర్తి చేయకుండానే కన్నుమూశారు. అది వచ్చి ఉంటే మనకు ఎన్నో విలువైన విషయాలు తెలిసుండేవి. ఆ విషయంలో మనం దురదృష్టవంతులం.’’
 - కోన వెంకట్, రచయిత
 
అసలు పేరు : కిళాంబి వేంకట నరసింహాచార్యులు
జననం: 07-05-1921
జన్మస్థలం: నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలుకా మంగళంపాడు
స్వస్థలం: సూళ్లూరుపేట తాలుకా ఉచ్చూరు
తల్లిదండ్రులు: సీతమ్మ, కృష్ణమాచార్యులు
చదువు: ఎస్.ఎస్.ఎల్.సి.
వివాహం - భార్య: 1940 - పద్మావతి
తొలిచిత్రం - పాట: దీక్ష (1951) -  
పోరా బాబూ పో పోయి చూడు లోకం పోకడ
ఆఖరిచిత్రం - పాట: ప్రేమయుద్ధం (1990) - ఈ మువ్వలగానం మన ప్రేమకు ప్రాణం
పాటలు: సుమారు 1400
దర్శకునిగా: వాగ్దానం (1961)
నటించిన సినిమా: కోడెనాగు (1974)
గౌరవ పురస్కారాలు: వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ మీద 12 మంది పరిశోధనలు చేశారు. ‘మనస్విని’ సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని7 సంపుటులుగా 1990లో ప్రచురించింది, ఆయన ‘మనసుకవి’గా ప్రజల మన్ననలు పొందారు.
మరణం : 13-09-1989
 
 

మరిన్ని వార్తలు