ఇంగువ అంటే?

19 May, 2018 00:32 IST|Sakshi

నివాళి కథ 

ప్రాణ స్నేహితుడు చివరి రోజుల్లో ఉన్నాడట.ఎన్ని రోజులు? ఆరా తీశాడు.మహా అయితే వారం.చూసి రావాలి. చూసి రావాలా? చూడగలడా?చిన్నప్పుడు రోజులు బాగా గడిచాయి. ఇద్దరూ కలిసి పెరిగారు. వాన వస్తే చొక్కాలు విప్పి నెత్తి మీద గొడుగు పట్టారు. ఎండ కాస్తే కొమ్మలు తెంపి వొంటి మీద ఛత్రీ పట్టారు. ఎవరి ఇంట్లోనో కాసిన జామకాయల మీద పెత్తనం చేశారు. ఏదో గోడ మీద ఇష్టం లేని హీరోను పేడతో తడిపారు. కాలానికి కూడా బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఉంటుంది.ఇప్పుడు వృద్ధాప్యం.ఈ వృద్ధాప్యంలో ఆకు రాలినా కళవళపడేలా మనసు సున్నితమైన క్షణాల్లో వాణ్ణి చూసి రావాలా? చూసి రావాలి. చూడకపోతే ఎలా?ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే ఎవరో పలకరించి వెళుతున్నారు. భార్యా పిల్లలూ... ఇంటి పెద్దమనిషికి సుఖవంతమైన వీడ్కోలు ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుంటున్నారా?
మంచం దగ్గర శబ్దం రాకుండా స్టూల్‌ను లాక్కుని కూచున్నాడు.చేయి పట్టుకున్నాడు.ఎన్నిసార్లు పట్టుకున్న చేయి. వేలసార్లు పట్టుకున్న చేయి. చిన్న కదలిక వచ్చింది. గట్టిగా నొక్కాడు. ఆ కదలికకు కారణమైన మనిషి ఎవరో కనిపెట్టినట్టుగా ఇంకొంచెం కదిలింది. 

‘ఎలా ఉన్నావురా?’ అడిగాడు.చేతిలో ఉన్న చేయి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తోంది. కళ్లు ఏవో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి.ఏం చెప్పాలనుకుంటున్నాడు?నోటి దగ్గరగా మెడను వొంచి చెవి దగ్గర చేశాడు.ఆ మిత్రుడు, మృత్యువు గడప దగ్గర నిలుచుని సుసమయం కోసం ఎదురు చూస్తున్న మిత్రుడు, ప్రాణమిత్రుడు, చిరకాల మిత్రుడు... ప్రశ్న వేశాడు.ఏమని?‘ఇంగువ అంటే ఏమిటిరా?’అదిరిపోయాడు. ఒక్క క్షణం ఉలిక్కిపడి చేయి విడిచేశాడు. స్టూలు నుంచి లేచి నిలబడి, ఏం చేయాలో తోచనట్టుగా నిలబడి, ఇప్పుడే వస్తాను అన్నట్టుగా మొదలు నెమ్మదిగా ఆ తర్వాత వడివడిగా అడుగులు వేసి ఇంట్లో నుంచి బయటపడ్డాడు.ఏమిటి వీడు... ఇంకా మర్చిపోలేదా అది?ఒకసారి ఇద్దరూ పెళ్లిలో కలిశారు. అప్పుడా స్నేహితుడు అన్నాడు–‘ఏమిటో రోజులు.. ఎలాగో గడచిపోతున్నాయి. చిన్నచిన్నవి ఏవో అనుకుంటామా తీరవు. రేపు చేద్దాం అనుకుంటాం. ఆ రేపు రాదు. మాపు చేద్దాం అనుకుంటాం ఆ మాపు రాదు. బతుకు బాదరబందీలో పడీ.... అంతెందుకు? ఇంగువ అంటే ఏమిటో తెలుసుకోవాలని నాకెప్పటి నుంచో కోరిక. అదేమైనా చెట్టా కాయా పండా ఫలమా విత్తనమా లవణమా రసాయనమా... ఏమిటా ఇంగువా. రోజూ వంటలో తింటాను కదా. ఈ ఇంగువంటే ఏమిటో కూడా తెలుసుకోకుండానే చచ్చిపోతానా అని బెంగ. ఇంతకీ ఇంగువంటే ఏమిట్రా’ ఏమో. ఎవరికి తెలుసు. తనకూ తెలియదు.

ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయాడు. వీడు మర్చిపోలేదే. అది కూడా తెలుసుకోకుండా పోతాడా? అది కూడా తెలపకుండా పంపుతాడా తను?ఏమీ తోచనట్టుగా బజార్లలో తిరిగాడు. ఏమీ తోచనట్టుగా ఏదో సినిమా చూశాడు. మనసుకు శాంతిగా అనిపించలేదు. ఈ ఊళ్లోనే తెలిసిన లెక్చరర్‌ ఒకడు ఉన్నాడు. వెళ్లి అతణ్ణి అడిగితే?వేళాపాళా లేకుండా ఊడిపడిన అతణ్ణి లెక్చరర్‌ వింతగా చూశాడు.‘ఇంగువంటే ఏమిటండీ’ సమయం సందర్భం లేకుండా అడిగిన ప్రశ్నకు ఇంకా వింత పడ్డాడు.కాని వాలకం అర్థమైంది. ఏదో అర్జెన్సీలో ఉన్నాడు.అందుకని ఇంగువంటే ఏమిటో అది ఎలా వస్తుందో వివరంగా చెప్పి పంపించాడు.ఇప్పుడు సంతోషంగా ఉంది. సంతృప్తిగా ఉంది. స్నేహితుడి వెలితిని తొలగించగలనన్న నమ్మకం ఉంది. ఇప్పుడు తనకు ఇంగువ అంటే ఏమిటో తెలుసు. అది పండో ఫలమో కాయో బెరడో వేరో లవణమో తనకు తెలుసు. ఇది వెంటనే స్నేహితుడికి చెప్పాలి. కచ్చితంగా చెప్పాలి. చెప్పి తీరాలి.అడుగులు వేగంగా వేశాడు. ఇంత పెద్ద వయసు కదా. అయితే ఏమిటి? పరిగెత్తినట్టు వేశాడు. పరిగెత్తాడా? అదిగో అల్లంత దూరంలో ఇల్లు. ఒరే స్నేహితుడా... ఇంగువ అంటే ఏమిటో చెప్తాను ఉండు ప్రాణం ఉగ్గబట్టుకో... నడుస్తున్నాడు.

కాని– ఏడుపు. అవును. ఏడుపు. బాబోయ్‌ ఏడుపే.పోయాడు. పోయాడే. ఇంగువ అంటే ఏమిటో తెలుసుకోకుండానే పోయాడే.చిన్న కోరిక. చాలా చిన్నది.తీరకుండా పోయాడా?ఎవరికి చెప్పాలి ఇది. ఈ జవాబు ఎవరికి చెప్పాలి.ఇంగువ అంటే... ఇంగువ అంటే... పెద్దగా అరవబోయాడు. అరవనున్నాడు. అరిచి చెప్పనున్నాడు.కథ ముగిసింది.పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ, ఆయనకు విశేషమైన పేరు తెచ్చిపెట్టిన కథ ‘ఇంగువ’ ఇది.పెళ్లయ్యాక తొలిరోజుల్లో భార్య సిగలో మల్లెలు తురుముతూ ‘మనం తాజ్‌మహల్‌ వెళ్దాంలే’ అంటాడొకడు. ఎప్పటికీ జరగదు. సొంత ఇల్లు, నాదంటూ ఒక గది, అందులో అల్మారా నిండా పుస్తకాలు అనుకుంటాడొకడు. జరగదు. చిన్నప్పుడు ‘ఒరే శీనయ్యా’ అని ప్రేమగా పిలిచి ఇంకు పెన్ను బహూకరించిన అమ్మాయి ఫలానా ఊళ్లో స్థిరపడి ఉందని తెలిసి వెళ్లి చూడాలి అనుకుంటాడొకడు. కుదరదు. కొండ సానువుల్లో వేపచెట్టు నీడన చల్లటి అమ్మోరితల్లికి దండం పెట్టుకొద్దామనుకుంటాడొకడు. కుదరనే కుదరదు. మంచి బట్టలూ కుదరవు. కళ్లకు నదురైన ఫ్రేమ్‌తో ఉన్న అద్దాలూ కుదరవు.

చిన్న చిన్న కోరికలే అన్ని.మనుషులు కోరుకోదగ్గవే.బరువులు, బాధ్యతలు, ఉద్యోగాలు, సద్యోగాలు, చావులు, పుటకలు... వీటిలోనే రోజులన్నీ గడిచిపోతాయి. తీరా తేరుకుని ఇది నా జీవితం దీనిని నేను అనుభవిస్తాను అని అనుకునేలోపు మృత్యువు మంచం కోడు దగ్గర పాశం పట్టుకు నిలబడి ముగింపు సమయాన్ని ప్రకటిస్తుంది.జీవితాన్ని ప్రతిక్షణం ఒక సమాధానంలా జీవించడం అదృష్టం.జీవితాన్ని ప్రతి నిమిషం ఒక సందేహంలా జీవించడం దురదృష్టం.రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య రవంత ఇంగువను జోడించి ఈ కథలో చెప్పిన రహస్యం ఇదే.ఇప్పుడు అర్థమైందా ఇంగువ అంటే ఏమిటో.
– మూలకథకు పునఃకథనం:  మహమ్మద్‌ ఖదీర్‌బాబు (రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య  శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు)
- పెద్దిభొట్ల సుబ్బరామయ్య 

మరిన్ని వార్తలు