అదే ప్రశంసాపత్రం

20 Apr, 2020 01:29 IST|Sakshi

రచయిత మాట

షణ్ముఖరావు అనువాద కథలు ‘కథాప్రపంచం’ ద్వారా ప్రచురితమైనాయి. ‘ఆర్థిక వ్యత్యాసాల నేపథ్యం నచ్చినవీ, కథలో అనూహ్యమైన మలుపులు మెచ్చినవీ, కథనంలో సంక్లిష్టతనూ, సంక్షిప్తతనూ యిష్టపడినవీ, మానవత్వం మెరిసినవీ, కల్లోలిత ప్రాంతాల ప్రజాజీవనాన్ని ప్రతిబింబించినవీ’ ఇలా 23 కథల్ని ఆయన ఎన్నుకున్నారు. అనువాదంలో ఉండే సవాళ్లు  ఏమిటో ఇలా చెబుతున్నారు:

అనువాదకుడికి అవరోధాలూ సవాళ్లూ ఎక్కువ. స్వతంత్రత తక్కువ. మూలభాషలోని సాంఘిక సాంస్కృతిక జీవన చిత్రణ గుండెకు హత్తుకోవాలి. వేదన గానీ వినోదం గానీ మనస్సును కదిలించాలి. కొన్ని సందర్భాలలో పచ్చిగా వుండే భావాలుంటాయి. వాటికి కాస్త చక్కెర పూస్తూగానీ మన భాషీయులు హర్షించరు. ఒక సమాజానికి పట్టింపే లేని అంశం మరో సమాజానికి తీవ్రమైన నేరంగా ఉండొచ్చు. ఉదా: ఆఫ్రికాలో వివాహేతర దాంపత్యం. ఇటువంటి వాటి గూర్చి మెలుకువతో మాటలు పేర్చాలి. కొన్ని భాషల కథలు యింకా ప్రాథమిక దశలోనే వున్నట్లుంటాయి. నిజానికి వాటిని ఆయా భౌగోళిక ప్రాంతం, ఆ రచనాకాలం పరిగణించి తూకం వేసుకోవాలి.

అనువాదంలో వాక్య నిర్మాణం సరళంగానూ సూటిగానూ వుండాలి. ఆయా భాషల సామెతలకూ, నుడికారాలకూ, పారిభాషిక పదాలకూ అన్వయం చెడకుండా చూడాలి. యించిమించూ మూల రచయితలో పరకాయ ప్రవేశం చెయ్యాలి. పాత్రల పేర్లూ స్థలకాలాలూ మారినా తన భాషా కథనే చదువుతున్నట్లు పాఠకుడు అనుభూతి చెందితే, అనువాదానికి అదే ప్రశంసాపత్రం.
ఏది ఏమైనా అనువాదం మూలానికి సర్వ సమానం కాదు.

టి.షణ్ముఖ రావు అనువాద కథలు; పేజీలు: 154; 
వెల: 200; ప్రచురణ: కథాప్రపంచం, కె.టి.రోడ్, 
తిరుపతి. ఫోన్‌: 9553518568 

మరిన్ని వార్తలు