మా ఇంటి ఆవకాయ... చెప్పుకుంది ముచ్చట్లెన్నో!

4 May, 2019 00:08 IST|Sakshi

జ్ఞాపకాయ

ఎండలు మండుతున్నాయి. పచ్చడి మామిడి కాయలు మార్కెట్‌లోకి రావడం ఇప్పటికే మొదౖలñ  పోయింది. రెండున్నర నెలల క్రితం గృహప్రవేశానికని మాతోబాటు చిన్నక్కా వాళ్ల ఇంటికి వచ్చి, నేను మళ్లీ ఇంత తొందరగా ప్రయాణం చేయలేనంటూ అక్కడే దిగబడిపోయింది అమ్మ. ఎప్పుడొస్తున్నావమ్మా అనడిగితే ‘ఇక్కడే ఉండి పచ్చళ్లు పెట్టుకొని వస్తాలే, అయినా, నేను వచ్చి మాత్రం చేసేదేముంది ఇప్పుడక్కడ?’ అంటూ అక్కడే ఉండిపోయింది.  పచ్చళ్లు అంటే ఆవకాయ, మాగాయే. అదీ మహా అయితే ఓ పాతిక కాయలతో మాగాయ, ఓ డజనో, డజనున్నర కాయలతో ఆవకాయ పెట్టుకొస్తుందేమో!  ఈలోగా నేను ఊరుకోలేక పప్పులోకని కొనుక్కొచ్చిన కాయల్లో కాస్త పెద్దవి చూసి వాటితో ఆవకాయ, కొంచెం పీచుపట్టిన కాయలతోనేమో మాగాయ మా శ్రీమతితో పెట్టిస్తూ జిహ్వ చాపల్యాన్ని
తీర్చుకుంటున్నాన నుకోండి... 

ఆవకాయ, మాగాయ ... కాదు కాదు.. ఎండాకాలం అంటే నాకు గుర్తొచ్చేది మా చిన్నప్పుడు మా తాతయ్య చేసిన హడావుడి... దాదాపు రెండు వందల చిన్నరసాల కాయలతో మాగాయ, నూటయాభైకి తక్కువ కాకుండా పెద్దరసాలు లేదా జలాలతో ఆవకాయ పెట్టించేవాడు. ముందుగా తోటనుంచి బస్తాలతో కాయలు దిగేవి. అమ్మ, పిన్నులు వాటికి ముచికలు తీసి నీళ్ల తొట్లు, బకెట్లలో పడేసేవాళ్లు. మధ్యాన్నం అన్నాలు తిన్నాక వాటిని తీసి శుభ్రంగా తుడిచి పాత చీర మీద గుట్టలుగా పోసేవాళ్లు. రెండు మూడు కత్తిపీటలు తీసుకుని ఇంట్లో ఆడవాళ్లందరూ తరిగేవాళ్లు వాటిని. మధ్యలో కాయలు కాస్త రంగు మారినట్టు అనుమానం వస్తే రుచి చూడమని నాకిచ్చేవాళ్లు. నేనేదో మేధావిలా పోజు కొడుతూ ‘ఈ ముక్క అంత పుల్లగా ఉన్నట్టు లేదు మామ్మా’ అని చెప్పేవాణ్ణి ఒక పక్క పులుపుతో కన్ను మూసుకుపోతున్నా కూడా! వెంటనే ఆ ముక్కకి కాస్త ఉప్పూ కారం అద్ది ప్లేటులో పెట్టి ఇచ్చేసేవాళ్లు. అట్లాంటి బేరాలు ఇంకొన్ని తగిలాయంటే ఇంక నాకు పండగే పండగ. కొన్నింటిని తరగబోతుండగానే తీసేయించేవాణ్ణి. వాటిని మెల్లగా తీసుకెళ్లి వడ్లపురిలోనో, బియ్యం రమ్ములోనో (డ్రమ్మునే మా మామ్మ, ఇంకా పెద్దవాళ్లు అలా అనేవాళ్లు) దాచేవాణ్ణి. రెండు రోజుల తర్వాత సగం పండిన మామిడికాయను బయటికి తీసి రుచి చూస్తూ పుల్లగా ఉన్నట్టు ట్ట ట్ట ట్ట అంటూ లొట్టలు వేస్తూ ఊరించుకుంటూ తినేవాణ్ణి. 

ఇంట్లో ఆడవాళ్లెంత మంది ఉన్నా, మాగాయ కలిపేది మాత్రం మా మామ్మే. బేసిన్‌లోకి తీసి పైనుంచి కిందికి బాగా కలిపి జాడీలో పెట్టేసేది మా మామ్మ. ఇక మాగాయ తిరగమోత వేసేటప్పుడు ఇంగువ వాసనతో ఇల్లంతా ఘుమ ఘుమలాడిపోయేది. అందుకోసం బెజవాడలోని నంబూరు సాంబశివరావు కొట్టునుంచి తాతయ్య ప్రత్యేకమైన పచ్చళ్ల ఇంగువ తెప్పిస్తే ఘుమఘుమలాడక ఏం చేస్తుంది మరి! మాగాయ కలిపిన బేసిన్‌లో అన్నం కలిపి ముద్దలు పెట్టేది మామ్మ. తినేటప్పుడు తాతయ్య అందరికేసీ చూసి కళ్లెగరేసేవాడు... ఎట్లా ఉంది అన్నట్టు. అందరూ ఆహా అనే అనేవాళ్లు. మా మామ్మ పెట్టిన మాగాయ రుచికి వంక పెట్టగలరా ఎవరైనా... అయిపోయిన తర్వాత ఆవకాయ పని పట్టేవాళ్లు. ఆవకాయకి మాత్రం మా నాన్న, బాబాయిలు, పెద్దమ్మమ్మతో సహా అందరూ రంగంలోకి దిగిపోయేవాళ్లు. మా నాన్న చేతికి దెబ్బ తగలకుండా ముందుగానే ఒక చిన్న టవల్‌ను కట్టుకునేవాడు. కడిగి తుడిచి పెట్టిన కాయలను తీసుకుని కత్తిపీటతో టకాటకా కొట్టేసేవాడు. ‘‘జాగర్త రా కిష్టీ... ముక్కలు పెద్దవవుతున్నాయనో, నీ హడావుడి చూస్తుంటే వేళ్లు కూడా తరుక్కునేట్టున్నావురా...’’ అంటుండేవాడు తాతయ్య. ఈ లోగానే నాన్న చిన్నగా అరిచి వేలును ఉఫ్ఫూ ఉఫ్పూ అని విదిలించడం, అట్లా విదిలించిన వేలినుంచి రక్తం ధారలుగా కారడం... ‘‘అదిగో చూశావా, వేలు కూడా తరుక్కున్నావురా, ముందు కట్టుకట్టుకో ఆ వేలికి, ఇంక నువ్వు తప్పుకోరా కిష్టీ... అందుకే నిన్ను సాంబక్కాయి కాళిదాసూ అనేది’’ అంటూ కంగారుగానే అరిచేవాడు తాతయ్య. నాగన్నాయి బాబాయి ముందే అరిచేవాడు. శేషాద్రి బాబాయి తర్వాత ఆదిత్య బాబాయి కొన్ని కాయలు ముక్కలు కొట్టేవాడు. గోపీ బాబాయి, శీను బాబాయి ముందుగా తోటకెళ్లి కాయలు, వాటికి కావలసిన ఉప్పులూ, కారాలూ, ఆవాలూ, మిరపకాయలూ నూనె డబ్బాలూ మోసుకొచ్చి పడేసేది వాళ్లే కాబట్టి, ముక్కలు కొట్టడంలో పెద్ద పనుండేది కాదు వాళ్లకి. కొట్టిన ముక్కలమీద ఉండే పై పొరను పెద్దమ్మమ్మ, అమ్మ, పిన్నులు చెంచాలతో జీడిని వేరు చేసి, ముక్క మీద ఉండే పొరను గీరి తీసేసేవాళ్లు. మామ్మ వాటిని మరోసారి శుభ్రంగా తుడిచి నూనెలో ముంచి ఆవ పిండి, ఉప్పు కలిపిన పెద్ద బేసిన్లకు ఎత్తేది. 

ఒక జాడీడు పచ్చడిలో వెల్లుల్లి గర్భాలు కలిపితే, ఇంకో చిన్నజాడీలో మెంతిపిండి, మరో జాడీలో పెసరపిండి కలిపి మెంతికాయ, పెసరావకాయ కూడా పెట్టేసేది పనిలో పనిగా.  షరామామూలుగా ఆవకాయ కలిపిన బేసిన్లను అలాగే ఉంచి అన్నం కలిపి, అందరికీ తలా ఓ ముద్ద పెట్టి ఉప్పుకారాలు సరిపోయాయో లేదో చూడమనేది మామ్మ. ఒకళ్లు ఉప్పు తక్కువైందంటే, ఇంకోళ్లు కారంఎక్కువైందంటే.. మరొకళ్లేమో ఆవఘాటు ఎక్కువైందనో, తక్కువైందనో... ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసేవాళ్లు. ఇంక నాలుగైదు రోజులు గడిచాక ఎన్ని కూరలు చేసినా సరే, ఇంటిల్లిపాదీ ఆవకాయ మాగాయ, పెసరావకాయ, మెంతికాయలతోనే లాగించేవాళ్లు. మా నాన్న, తాతయ్య, బాబాయిలు అయితే వేడి వేడి అన్నంలో ఎర్రటి ఆవకాయ కలిపేవాళ్లు. నాన్నేమో వెన్నపూస ఉందామ్మా అని అడిగేవాడు. తాతయ్య, బాబాయిలు నూనె వేయించుకునేవాళ్లు. పిల్ల బ్యాచి మాత్రం లైటు లైటుగా ఆవకాయ కలుపుకుని అందులోకి రెండు మూడు మిల్లు గరిటల వేడి వేడి నెయ్యి వేయించుకుని తినేవాళ్లం. 

ఇప్పుడు ఆ రోజులు రమ్మన్నా రావు... కిరాణా షాపులకో బిగ్‌ బజార్ల వంటి మాల్స్‌కో వెళ్లి ప్యాకెట్లలో తెచ్చిన ఆవపిండి, మెంతిపిండి, టాటా సాల్టు, ఇదయం నువ్వుల నూనె తెచ్చి పెట్టుకుని, డజను మామిడికాయలు ముక్కలు కొట్టించుకుని తెచ్చి, మరో పదిహేను కాయలు మాగాయకని తెచ్చుకుని, దానితోపాటు ఎవరెస్టో, ఎల్జీనో, జీడీనో, పతంజలి ఇంగువ డబ్బానో తెచ్చుకుని మేమూ ఆవకాయ మాగాయ పెట్టుకున్నామనిపించుకుంటున్నాం. కష్టపడి పెట్టుకున్న వాటిని కడుపునిండా తినాలన్నా భయమే. ఒక్కొక్కళ్లకీ మూడున్నర పదులకే బీపీలూ, షుగర్లూ, కొలెస్ట్రాళ్లూ... అయినా సరే, పచ్చడి పెట్టుకున్న కొత్తల్లో నాలుగురోజులపాటు వరసగా వేసుకుని, తర్వాత అప్పుడప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మాత్రమే తింటున్నారందరూ. ఏం చేస్తాం... కాల మహిమ!
– బాచి 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు