‘కుండీ పందిరి కూరగాయల’కు అవార్డుల పంట!

14 Jan, 2020 06:51 IST|Sakshi

ఇంటి పంట

కుండీల్లోనే బుల్లి పందిళ్లు వేసి ఎంచక్కా తీగజాతి కూరగాయలను మేడ మీద/పెరట్లో కూడా ఇట్టే పండించుకోవచ్చని ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది. కన్నుల పండువగా ఉన్న చిట్టి పందిరి కూరగాయల సాగుదారులు ఇటీవల కోల్‌కత్తాలో జరిగిన అవార్డులు పంట పండించుకున్నారు.

అగ్రి–హార్టికల్చరల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (డా. విలియం కారీ 1820లో స్థాపించారు) కోల్‌కత్తాలో ఏర్పడి 200 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా 200వ వార్షిక పుష్ప ప్రదర్శనతోపాటు మధ్య ఆసియా దేశాల గులాబీ మహాసభ ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి 300 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొన్నారు. రోజ్‌ షోలో 136 సెక్షన్లు ఉండగా.. కూరగాయలు, పండ్లు, బోన్సాయ్, పామ్స్, ఫెర్న్స్, ఆర్నమెంటల్‌ ప్లాంట్స్‌ తదితర 50 విభాగాల్లో ఉత్తమ సాగుదారులకు బహుమతులు అందజేశారు.

కుండీల్లోనే చిన్న పందిళ్లు వేసి తీగజాతి కూరగాయలు పండించే నమూనాలు, కుండీల్లో పండ్ల సాగు నమూనాలు ఈ షోలో హైలైట్‌గా నిలిచాయి. ఒక కుండీలో కట్టె పుల్లలతో పందిరి వేసి సొర తీగను పాకించి నాలుగు సొరకాయలు కాయించిన నమూనాకు కంటెయినర్‌ కిచెన్‌ గార్డెనింగ్‌ విభాగంలో ప్రథమ బహుమతి దక్కింది. వంగ కుండీకి ద్వితీయ బహుమతి దక్కింది. కుండీల్లో సైతం తీగజాతి కూరగాయలను నిశ్చింతగా సాగు చేయడమే కాకుండా మంచి దిగుబడి కూడా తీయొచ్చని ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్‌ అగ్రి–హార్టీకల్చర్‌ సొసైటీ నేతలు కొందరు కోల్‌కత్తా పూలు, కూరగాయలు, పండ్ల ప్రదర్శనలో పాల్గొని స్ఫూర్తిని పొందటం విశేషం. 

మరిన్ని వార్తలు