ఆ నొప్పి వెన్ను నుంచి వేళ్ల వరకు

5 Sep, 2019 10:27 IST|Sakshi

సర్వికల్‌ స్పాండిలోసిస్‌

ఓ వయసు దాటాక వెన్నెముకలోని మెడ  దగ్గర ఉండే ఎముకలుఅరిగిపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంటుంది. మెడ దగ్గరనొప్పి భుజం నుంచి మోచేతి మీదుగా  వేళ్లకూ పాకుతూ చికాకు పెడుతుంటుంది. నొప్పి, తిమ్మిరులతో ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి చేయి బలహీనంగా అయినట్లుగానూ అనిపిస్తుంది. ఈ సమస్య పేరే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌. జీవనశైలి, పని ప్రదేశం  (వర్క్‌ప్లేస్‌)లో కూర్చునే భంగిమల వల్ల ఇప్పుడు చాలా త్వరగా వచ్చేస్తోంది. ఈ కారణంగా వెన్నుకు వచ్చే  కొన్ని సమస్యలపై అవగాహన పెంచుకుందాం.

అదే పనిగా సరైన తీరులో కాకుండా... ఇష్టం వచ్చినట్లు కూర్చోవడంతోపాటు వెన్నుమీద తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల డిస్కులు పక్కకు తప్పుకోవచ్చు. ఇలా వచ్చే సమస్యను సర్వైకల్‌ డిస్క్‌ ప్రొలాప్స్‌ అంటారు. అంతేకాకుండా ఈ సమస్య చాలాకాలం పాటు కొనసాగినా లేదా వయసు మీరాక మెడలోని వెన్నెముకలు అరగడం వల్ల ఆ ఎముకల మధ్య ఉన్న నాడులపై ఒత్తిడి పడి వచ్చే సమస్యను సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. ఇటీవల దాదాపు అన్ని వర్గాల్లోనూ మెడమీద ఒత్తిడి తీవ్రమయ్యేలా చేసే ఉద్యోగాలు, వృత్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్య సర్వసాధారణమయ్యింది. అందుకే ఓ వయసు దాటాక వచ్చే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌కు ముందర వచ్చే డిస్క్‌ప్రొలాప్స్‌లు పెరుగుతున్నాయి. అందుకే ఈ సమస్యల గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

మెడ దగ్గరి ఎముకలనుతెలుసుకుందాం...
మన మెడ భాగంలోని వెన్నెముకలో ఏడు ఎముకలు ఉంటాయి. వాటినే వరసగా సీ1, సీ2, సీ3, సీ4, సీ5, సీ6, సీ7గా చెబుతారు. ఈ ఎముకలు తలను నిటారుగా నిలబెట్టి ఉంచేందుకు ఉపయోగపడతాయి. మెడను అటు ఇటు తిప్పడానికి (ఫ్లెక్సిబుల్‌గా ఉంచేందుకు) ఉపయోగపడతాయి. లోపల ఉన్న వెన్నుపాము (స్పైనల్‌కార్డ్‌)ను కాపాడతాయి. ఆ ఎముకల మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్‌) నివారించేందుకు ఎముకకూ, ఎముకకూ మధ్యన డిస్క్‌ ఉంటుంది. ఈ ఎముకల మధ్యనుంచి నరాలు బయటకు వచ్చి వేర్వేరు అవయవాలను చేరి వాటిని నియంత్రిస్తుంటాయి. మెడలోని ఈ వెన్నెముకలు ఎముకలు, లేదా వాటిమధ్యన ఉండే మెత్తలాంటి డిస్క్‌ అరుగుదల వల్ల, లేదా ఒక్కోసారి డిస్క్‌లు పక్కకు జరగడం వల్ల నరాలపై ఒత్తిడి పడి ఈ తిమ్మిరి, నొప్పి వస్తుంది. ఇలా డిస్క్‌లు పక్కకు తొలగడాన్ని సర్వైకల్‌ డిస్క్‌ ప్రొలాప్స్‌ అంటారు. మెడలో ఉండే వెన్నెముకలు సీ1–సీ7 అరిగి, వాటి మధ్య ఉండే ఫేసెటల్‌ జాయింట్స్‌ కూడా అరిగి, రియాక్షన్‌గా ఆ అరిగిన మేరకు ఎముక పెరగడాన్ని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. సాధారణంగా సర్వైకల్‌ డిస్క్‌ ప్రొలాప్స్‌ కొద్దిగా యంగ్‌ ఏజ్‌లో వస్తుంది. ఇలాంటి డిస్క్‌ ప్రొలాప్స్‌ వల్ల దీర్ఘకాలికంగా అరుగుదల (డ్యామేజీ) జరిగితే అది సర్వైకల్‌ స్పాండిలోసిస్‌కు దారితీయవచ్చు.

చికిత్స ప్రక్రియలివి...
సర్వైకల్‌స్పాండిలోసిస్‌ కండిషన్‌ కనిపించిన రోగుల్లో జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా ప్రభావం చూపుతాయి. దాంతోపాటు ఫిజియోథెరపీ ప్రక్రియ వల్ల గణనీయమైన మెరుగుదల కనిపించేందుకు అవకాశం ఉంది. ఇక కొన్ని నాన్‌స్టెరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ (ఎన్‌ఎన్‌ఏఐడీ) అని చెప్పే నొప్పి నివారణ మందులు వాడటం ఈ చికిత్సల్లో ఒక భాగం. వీటితోపాటు శస్త్రచికిత్స ద్వారా ఎముకలు అరిగిన, తొలగిన ప్రాంతంలో సరిచేయడం చివరగా చేసే చికిత్స ప్రక్రియ.

జీవనశైలి మార్పులతో...
మనం పనిచేసే చోట మెడపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా చూసుకోవడం ప్రధానం. నిద్రపోయేప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు తలను సరైన భంగిమలో ఉంచడం, మెడ కండరాలపై అసమతౌల్యంగా బరువు పడుతుంటే నివారించడం వంటివి జీవనశైలిలో మార్పులు. గంటలకొద్దీ కూర్చుని పనిచేసే సాఫ్ట్‌వేర్‌ వంటి వృత్తుల్లో ఉన్నవాళ్లు తమ తల బరువు మెడపై అసహజమైన రీతిలో పడుతుంటే దాన్ని నివారించడం కూడా ముఖ్యం.

ఫిజియోథెరపీ... మెడ కండరాలకు వ్యాయామాన్ని ఇవ్వడం ద్వారా వాటిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం మంచిది. దీనివల్ల వయసు పెరగడం వల్ల వెన్నెముక అరుగుదల ప్రక్రియ వేగంగా జరగకుండా చూడవచ్చు. ఫలితంగా ఈ అరుగుదలతో వచ్చే స్పాండిలోసిస్‌ అంత త్వరగా రాదు. కాబట్టి మెడ కండరాలకు వ్యాయామం అవసరం. ఇక ఈత వల్ల వెన్నెముకతోపాటు అన్ని కండరాలకూ తగినంత వ్యాయామం లభిస్తుంది. ఇలా వెన్నెముకతో పాటు మెడ కండరాలకు వ్యాయామం అందించేందుకు ఫిజియో థెరపీ ఉపయోగిస్తుంది. ఇందులోనూ రెండు దశల్లో ఫిజియోథెరపీ చికిత్స జరుగుతుంది. మొదటిది నొప్పి నివారణకు ఐఎఫ్‌టీ, అల్ట్రాసోనిక్‌ థెరపీ లేదా షార్ట్‌వేవ్‌ డయాథెర్మీ, రెండో దశలో మెడ, చేతులు, కాళ్లకు (లింబ్‌) ఎక్సర్‌సైజ్‌లు.

ఇంటర్‌ఫెరెన్షియల్‌ థెరపీ (ఐఎఫ్‌టీ): ఈ ప్రక్రియలో ఒక రకం విద్యుత్‌తరంగాలను (వీటిని) ఉపయోగించి నొప్పి నివారణ చేస్తారు. శరీరంపై ఏదైనా గాటు లేదా గాయం ఉన్నవారికి లేదా పుండు వంటివి ఉన్నవాళ్లకు, గర్భిణులకు వీటిని ఉపయోగించరు. అల్ట్రాసోనిక్‌ థెరపీలో శబ్దతరంగాలను ఉపయోగించి చికిత్స చేస్తారు. ఇక షార్ట్‌వేవ్‌ తరంగాలను ఉపయోగించి కూడా నొప్పి నివారణ చేస్తారు.  ఇది స్వల్పకాలికంగా జరిగే చికిత్స. ఇక రెండోదశలో మెడ, చేతులు, కాళ్లకు నిత్యం వ్యాయామం చేయించడం, దీర్ఘకాలం పాటు చేయించడం ద్వారా వాటిని మరింత దృఢతరం అయ్యేలా చూసి నొప్పి నివారణ జరిగేలా చూస్తారు. సాధారణంగా సర్వైకల్‌ స్పాండిలోసిస్‌కు ఫిజియోథెరపీ ప్రధానమైన చికిత్స ప్రక్రియలా పరిగణిస్తారు.

సర్వైకల్‌ కాలర్‌: తల బరువు అరిగిన మెడ వెన్నెముకలు (సీ1 టు సీ7) వరకు పడుతుంటే ఆ బరువును వాటిపై పడకుండా చేసే ఒక ఉపకరణం ‘సర్వైకల్‌ కాలర్‌’. అయితే ఇది అంతగా ఉపయోగపడదు కూడా. పైగా ఈ ఉపశమనం చాలా తాత్కాలికం మాత్రమే కావడంతో కొందరు డాక్టర్లు దీన్ని సూచించరు కూడా. దానికి కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు సర్వైకల్‌ కాలర్‌ను కొన్ని సందర్భాల్లో నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు ఉపయోగిస్తారు. నొప్పి నుంచి ఉపశమనం కలగడం వల్ల అలా అదేపనిగా దాన్నే ఉపయోగిస్తూ ఉండటం వల్ల మెడ కండరాలు బలహీనపడి దానిపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే అది చాలాకాలం ఉపయోగించడం అంతగా సరికాదు.

సర్వైకల్‌ ట్రాక్షన్‌: నరం దెబ్బతిన్నదని తెలిసినప్పుడు సర్వైకల్‌ ట్రాక్షన్‌ను అమర్చకూడదు. కేవలం ఎలాంటి నర్వ్‌ డ్యామేజీ లేదనుకున్నప్పుడే నొప్పి ఉన్న కొందరిలో దీన్ని ఉపయోగించి, ఉపశమనం పొందవచ్చు.

శస్త్రచికిత్స...
సర్వైకల్‌ డిస్క్‌ ప్రొలాప్స్‌లో...  ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలు, సాంత్వన ప్రక్రియలు అవలంబించి కనీసం ఆరు నుంచి పన్నెండు వారాలు గడిచాక కూడా తగినంత ఉపశమనం లేకపోతే అప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సలు కంఠం ముందు భాగం నుంచీ కొన్ని, మెడ వెనక భాగం నుంచి చేసేవి... ఇలా రకరకాలుగా ఉంటాయి. డిస్క్‌ లేదా ఎముకల అరుగుదలతో నరాలమీద కలిగే ఒత్తిడి స్థానాన్ని బట్టి ఎటువైపు నుంచి శస్త్రచికిత్స చేయాలన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అయితే శస్త్రచికిత్స ఎటువైపునుంచి జరిగినా చివరిలక్ష్యం మాత్రం రోగికి నొప్పి నివారణ కలిగేలా చూడటమే.
 శస్త్రచికిత్స ముందువైపు నుంచి జరిగితే (అది చాలా చిన్న గాటుతో) డిస్కెసెక్టమీ రూపంలో చేస్తారు. ఐదు నుంచి ఎనిమిది మిల్లీమీటర్ల గాటు పెట్టి డిస్క్‌ను తొలగిస్తారు. రోగి తుంటిఎముక నుంచి తొలగించిన భాగాన్ని (మనం చేత్తో తడిమినప్పుడు తుంటి వద్ద పొడుచుకు వచ్చినట్లు కనిపించే ఎముక) ఆ డిస్క్‌ను తొలగించిన చోట అమరుస్తారు. లేదా దీనికి బదులు డిస్క్‌ తొలగించిన ఆ గ్యాప్‌లో  టైటానియం లోహంతో చేసిన ఒక డిస్క్‌ను అమర్చుతారు. దీన్ని ఎలా అమర్చాలన్న దాన్ని రోగికి అవసరమేమిటన్న అంశంపై డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. అంటే.. ఇక్కడ జరిగే ప్రక్రియ ఒక్కటే. గతంలో ఎముకల భారం పడే డిస్క్‌ భాగాన్ని తొలగించి శస్త్రచికిత్స తర్వాత మెడ కదలికలతో పడే ఒత్తిడి అక్కడి చాలా కండరాలు ఆ భారాన్ని తీసుకునేలా చూస్తారు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలివి...
సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ లక్షణాలతో పాటు స్పర్శజ్ఞానం కోల్పోయినట్లు అనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించడం తప్పనిసరి. సాధారణ ఎక్స్‌–రే వల్ల సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ గురించి తెలిసిపోతుంది. అదే సర్వైకల్‌ డిస్క్‌ ప్రొలాప్స్‌ అయితే ఎమ్మారై పరీక్షల వల్ల నిర్దిష్టంగా డిస్క్‌లు, వెన్నుపాము, నరాల పొజిషన్‌ వెన్నుపాము వ్యవస్థపై ఎముకల అరుగుదల, డిస్క్‌ల అరుగుదల వల్ల పడుతున్న ప్రభావం... ఇవన్నీ ఎమ్మారైలో స్పష్టంగా తెలుస్తుంది. సీటీ స్కాన్‌ అయితే కాస్తంత పరిమితమైన వివరాలే తెలుస్తాయి. అవి కూడా కొందరు పేషెంట్లలోనే కొంతమేరకే తెలుస్తుంది.

డాక్టర్‌నుకలవాల్సిందెప్పుడు...?
మెడ నొప్పి వచ్చినప్పుడు సాధారణంగా కొందరు పెయిన్‌కిల్లర్స్‌ వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం తప్పే అయినా... అలా పెయిన్‌కిల్లర్‌ వేసుకున్నా ఆగకుండా అదేపనిగా నొప్పి వస్తున్నప్పుడు, ఆ నొప్పి వారం రోజుల తర్వాత కూడా తగ్గకపోతే దాన్ని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ కారణంగా వచ్చే అని అనుమానించాల్సి ఉంటుంది ∙నొప్పి ఒకే చోట లేకుండా చురుక్కుమంటూ భుజానికిగాని, ఇతర అవయవాలకు గాని పాకుతూ ఉన్నట్లుగా అనిపించడం కూడా సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ లక్షణమే ∙పై లక్షణాలతో పాటు నీరసంగా ఉండి చేతులు గాని, కాళ్లు గాని తిమ్మిరి పట్టినట్లుగా ఉండవచ్చు ∙కాళ్లు లేదా చేతులు బిగదీసినట్లుగా (స్టిఫ్‌నెస్‌తో) ఉండవచ్చు ∙మెడలో ఇబ్బందిగా (టెండర్‌నెస్‌) కూడా ఉండవచ్చు ∙శరీరంలో ఎక్కడైనా స్పర్శజ్ఞానం కోల్పోయినట్లుగా అనిపిస్తే... ఈ లక్షణాలన్నీ సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ను సూచిస్తాయి.

సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ లక్షణాలివి...
మెడ నొప్పిగా ఉంటుంది. మెడను మునుపటిలా ఫ్రీగా తిప్పడం సాధ్యం కాకపోవచ్చు ∙మన దేహంలోని వివిధ అవయవాలను నియంత్రించి నరాలపై ఒత్తిడి పడటం వల్ల ఆ అవయవాలు సైతం నొప్పికి గురి కావడం, ఉదాహరణకు భుజం, మోచేయి, చేతి వేళ్లు లాంటివి ∙చేయి, వేళ్లు, కొన్ని సందర్భాల్లో కాళ్లు తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తుంటుంది ∙పరిస్థితి తీవ్రమైన కొందరిలో కాళ్లు బిగదీసుకుపోయినట్లు (స్టిఫ్‌నెస్‌) కూడా అనిపించవచ్చు ∙నడవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది ∙కొందరిలో ఈ లక్షణాలు నెమ్మది నెమ్మదిగా క్రమంగా వస్తే మరికొందరిలో ఒక్కసారిగా కనిపించవచ్చు.

డాక్టర్‌ టి.దశరథ రామారెడ్డిసీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్,యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా