ఏ వయసు మహిళ అయినా... రొమ్ముక్యాన్సర్‌కు అతీతం కాదు

20 Feb, 2020 10:33 IST|Sakshi

వయసు, ఎత్తు, బరువు, పేద, ధనిక... ఇలాంటి ఏ అంశమూ క్యాన్సర్‌ను అడ్డుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు రొమ్ముక్యాన్సర్‌కు గురవుతున్నారు. మన దేశంలో ప్రతి 22 మంది మహిళల్లో ఒకరు దీనిబారిన పడుతున్నారు. పట్టణమహిళల్లో ఇది చాలా ఎక్కువ. అధిక బరువు ఉండేవారిలో, వయసు పైబడిన స్త్రీలలో, లేటు వయసులో పిల్లలు పుట్టినవారిలో, పాలివ్వని స్త్రీలలో, రజస్వల త్వరగా అయినవారిలో, 55 ఏళ్లు పైబడ్డా మెనోపాజ్‌ రానివారిలో, దీర్ఘకాలికంగా హార్మోన్‌ చికిత్స తీసుకున్నవారిలో ఈ క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువ. అయితే కేవలం వారికి మాత్రమే గాక ఎవరిలోనైనా ఇది వచ్చే ప్రమాదం ఉంది. తొలిదశలోనే కనుగొని, చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది.

ఎత్తుకు తగిన బరువు, ఆరోగ్యకరమైన జీవనశైలి, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి అంశాలు ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా కొంతవరకు దూరంగా ఉంచుతాయి. కానీ దురదృష్టవశాత్తు క్యాన్సర్‌ అన్నది ఆరోగ్యకరమైన జీవనశైలికి కూడా సవాల్‌ విసురుతోందనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అయితే అనేక మంది ప్రముఖులు క్యాన్సర్‌ను జయించి మరెంతోమందికి స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు. వారి అనుభవాలను ఇతరులతో పంచుకొని ధైర్యం నింపడమే కాకుండా, కొందరు పుస్తకరూపంలో తమ అనుభవాలను ఇతరులకు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో ముందుకు దూసుకెళ్లిన స్త్రీలు, అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని మనో«ధైర్యంతో క్యాన్సర్‌ను జయించడం మహిళలందరికీ ఓ పాఠం లాంటిది. మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ అనగానే జీవితం అయిపోయిందని కుంగిపోయి, కొందరు చికిత్స కూడా తీసుకోకుండా జీవితాన్ని త్వరగా ముగించుకోవాలనుకునేవారు తప్పకుండా క్యాన్సర్‌ జయించిన వారి గురించి తెలుసుకోవాలి.

గౌతమి మనందరికీ తెలిసిన ప్రముఖ నటి. దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలలో ప్రముఖ నటుల సరసన అనేక సినిమాల్లో నటించారు. 2004లో 35 ఏళ్ల వయసులో ఆమె రొమ్ములో క్యాన్సర్‌ గడ్డ ఉందని తెలిసినప్పుడు మొదట్లో కొంత ఆందోళన చెందినా ఆ తర్వాత ధైర్యంగా దాన్ని జయించగలిగాననీ, ఇప్పుడు వైద్యం ఎంతో అభివృద్ధి చెందిందనీ, వైద్యుల సలహాలు, సూచనలు పాటించగలిగితే పూర్తిగా నయమవుతుందని నమ్మకంగా చెబుతారామె. అలాగే ఒకప్పటి అమెరికా ప్రథమమహిళ లేడీ నాన్సీరీగన్, ఆస్ట్రేలియా నటి, గాయని కైలిమీనాగ్, 2010లో 53 వయసులో డక్టల్‌ కార్సినోమాను జయించిన మార్టినా నవ్రతిలోవా, బాలివుడ్‌ నటి ముంతాజ్‌ ఇలా క్యాన్సర్‌ను జయించిన వారెందరో ఉన్నారు. వీరంతా క్యాన్సర్‌ అనగానే భయాందోళనలకు గురయ్యే వారికి స్ఫూర్తిప్రదాతలు.

ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందిన హాలివుడ్‌ నటి ఏంజిలినా జోలీ గురించి మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె తల్లి 56 ఏళ్ల వయసులో రొమ్ముక్యాన్సర్‌కు గురయి మరణించారు. దాంతో తనకు కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఏదైనా ఉందా అని తెలుసుకునేందుకు ముందుగానే బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే జీన్‌ మ్యూటేషన్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో తనకు క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉందని తెలియడంతో మాసెక్టమీ అనే ప్రక్రియ ద్వారా తన రెండు రొమ్ములనూ తొలగించుకోవడమే కాకుండా మే 14, 2013న ఆ విషయాన్ని ప్రపంచానికంతా తెలిపారు. అంతేకాదు... ఈ జీన్‌ మ్యూటేషన్‌ పరీక్ష పాజిటివ్‌ వచ్చినవారిలో అండాశయాల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 50 శాతం ఉండటంతో తాను ఓవరీలు సైతం తొలగించుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇలా జీవితం గురించి అవగాహన ఉన్నవారు, జీవితం చాలా అమూల్యమైనదని గుర్తించిన వారు మొదట్లో కొంత ఆందోళను గురైనా సరైన చికిత్స తీసుకుని తాము ఎంచుకున్న రంగాలలో కొనసాగుతున్నారు. అంతేకాదు తమకు ఇష్టమైన వ్యాపకాలను చేపట్టడం ద్వారా... అంటే కొందరు వ్యాయామాలు చేయడం, ఇంకొందరు లాఫింగ్‌ థెరపీని ఆశ్రయించడం, మరికొందరు రోజుకొక సినిమా చూడటం, ఎక్కువగా పుస్తకాలు చదవడం, బయటకు వెళ్లి నలుగురితో కలిసే పనులు చేయడం, మొక్కలు నాటడం, క్లాసులు తీసుకోవడం వంటి పనులు చేయడం వల్ల త్వరగా కోలుకోగలుగుతున్నారు.

ఎంత అవగాహన ఉన్నా, మనోధైర్యం ఉన్నా, వైద్యంలో ఆధునిక పద్ధతులు ఉన్నా క్యాన్సర్‌ను జయించడానికి అందరూ చేయాల్సింది మాత్రం తొలిదశలో గుర్తించడమే. క్యాన్సర్‌ కణాలు శరీరమంతా పాకిపోయిన తర్వాత, జీవితాన్ని మరికొంత పొడిగించడం తప్ప ఎవరూ ఏమీ లేయలేరనేది అక్షరసత్యం. రొమ్ములో మార్పులు త్వరగా గుర్తించగలరు కాబట్టి రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం తేలికే.రొమ్ములో కణితిలాగా చేతికి తగలగానే క్యాన్సర్‌ అని అనుమానించి, ఆందోళన చెందాల్సిన అవసరం లేనేలేదు. నెలసరి ముందు రోజుల్లో, పాలిచ్చే స్త్రీలలో, మెనోపాజ్‌ దశలో రొమ్ములో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కొంతకాలంగా కణితి అలాగే ఉంటూ, పెరుగుతూ, రొమ్ములోపల గట్టిగా చేతికి తగులుతూ, కదలకుండా, నొప్పిలేకుండా ఉంటే మాత్రం అనుమానించాల్సిందే.

ప్రతి స్త్రీ 20 ఏళ్ల వయసు నుంచే నెలసరి అయిన ఏడో రోజు స్నానం చేసేటప్పుడు సబ్బు రాసుకున్న చేతుతో, వేళ్లతో రొమ్ములను పరీక్షించుకోవాలి. అలా స్వయంగా పరీక్షించుకోవడంతోపాటు 30 ఏళ్లు పైబడ్డాక అల్ట్రాసౌండ్, మామోగ్రామ్‌ వంటి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి. మరీ అనుమానంగా ఉంటే ఎమ్మారై, బయాప్సీ వంటివి తప్పనిసరి. ఈ స్క్రీనింగ్‌ పరీక్షలతో రొమ్ములోని కణితి చేతికి కూడా తగలనంత చిన్న సైజులో ఉన్నప్పుడే పసిగట్టగలము. దగ్గరి బంధువుల్లో, రక్తసంబంధీకుల్లో రొమ్ము క్యాన్సర్‌ ఎక్కువగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.ఎలాంటి రిస్క్‌లేనివారు 40 ఏళ్ల వయసులో ఒకసారి, ఆ తర్వాత 40 – 50 ఏళ్ల మధ్య ప్రతి రెండేళ్లకొకసారి, 50 ఏళ్లు పైబడ్డాక ప్రతి ఏడాదీ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకుంటే కణితిని మాత్రమే తీసివేయగలిగే లంపెక్టమీ సాధ్యమవుతుంది. అలా రొమ్ముక్యాన్సర్‌ నుంచి విముక్తులు కావచ్చు.
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, Kurnool 08518273001

మరిన్ని వార్తలు