దగ్గు... తుమ్ము గురించి ఆందోళన ఎందుకంటే...

23 Mar, 2020 08:55 IST|Sakshi

కరోనా సీజన్‌ కొనసాగుతున్న ఈ తరుణంలో ఎవరైనా కాస్తంత దగ్గినా... ఏమాత్రం తుమ్మినా ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. సమీపంలో ఉన్నవారు దూరంగా తొలగిపోతుంటారు. మనం దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాల్లోకి వ్యాపించే తుంపర్లతో కరోనా వస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా వ్యాపించడం అన్నది ఎంత వేగంగా జరుగుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఎవరైనా దగ్గగానే వారి నోటి నుంచి వచ్చే తుంపర్లు ప్రయాణం చేసే వేగం... గంటకు దాదాపు 60 మైళ్లు. (దాదాపు 96 కిలోమీటర్లు/గంటకు)
ఇక తుమ్మువల్లనైతే ఈ తుంపర్లు  ప్రయాణం చేసే వేగం... గంటకు 100 మైళ్లు  (దాదాపు 160 కి.మీ./గంటకు) ఉంటుంది.
జలుబు సమయంలో తుమ్మినప్పుడు సమీపంలోని గాల్లోకి వెలువడే తుంపర్ల సంఖ్య దాదాపు 40,000 వరకు ఉంటుంది.
ఈ తుంపర్లు గరిష్టంగా 200 అడుగులు (60 మీటర్ల) వరకు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.
తుమ్మినప్పుడు 30 సెకండ్లపాటు కర్చిఫ్‌ అడ్డుగా పెట్టుకున్నప్పుడు ఆ కర్చిఫ్‌పై ఒక చదరపు సెం.మీ. భాగంలో చేరే సూక్ష్మజీవుల సంఖ్య దాదాపు లక్ష వరకు ఉంటుంది.
ఒకవేళ అప్పటికే ఆ తుమ్మిన వ్యక్తికి కరోనా సోకి ఉందనుకుంటే... సూదిమోపినంత స్థలంలోనే మిలియన్ల కొద్దీ వైరస్‌లు ఉండి... అవి కళ్లు, ముక్కు, నోటికి తగలగానే వెంటనే జబ్బును వ్యాప్తి చేయగలుగుతాయి.
అందుకే దగ్గు వచ్చినా లేదా తుమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడ్డా పొడవు చేతుల చొక్కా (లాంగ్‌స్లీవ్స్‌) దగ్గర మోచేతి మడతలో దగ్గడం, తుమ్మడం చేయాలి. అక్కడే ఎందుకంటే... మనం ఆ ప్రదేశాన్ని దాదాపుగా ముట్టుకోం. అలాగే ఒకవేళ చేతులతో షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినా... వాటి మీద వైరస్‌ ఉండదు. ఈ కారణం చేతనే దగ్గడం లేదా తమ్ముడం వంటివి చేసినప్పుడు చేతులు ఎంతమాత్రమూ అడ్డుపెట్టుకోకూడదు.

మరిన్ని వార్తలు