రక్తంతో కథ రాయండి

24 May, 2018 00:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘నైన్‌.. ఎ మూవ్‌మెంట్‌’ పేరుతో మే 25న ఒక వెబ్‌సైట్‌ ప్రారంభం కాబోతోంది. గర్ల్స్‌.. ఇందులో మీరూ భాగస్వాములు కావచ్చు. మీ మెన్‌స్ట్రువల్‌ స్టోరీలను షేర్‌ చేసుకోవచ్చు

రుతుక్రమం ప్రారంభం అయ్యేనాటికి భోలీ వయసు పన్నెండేళ్లు. తొలిసారి తన ఒంట్లోంచి వచ్చిన రక్తపు చారికను చూడగానే భయపడిపోయి తల్లి దగ్గరకు పరుగు తీసింది. ‘నువ్వు పెద్దమనిషివి అయ్యావు. ఇక నుంచీ కుదురుగా ఉండాలి’ అని తల్లి చెప్పింది. భోలీ ‘హా!’ అంది. తల్లి ఆమెను గుండెలకు హత్తుకుంది. మెత్తటి ఎండు గడ్డిని తెచ్చి, పలుచటి గుడ్డలో చుట్టి ‘ఇదిగో.. దీనిని అదిమి ఉంచు. రక్తాన్ని పీల్చుకుంటుంది’ అని చెప్పింది. ‘‘ఐదు రోజులు నువ్వు ఇంట్లోకి రాకూడదు. ఆ గొడ్ల చావిడిలోనే ఉండాలి’’ అని చెప్పింది. ఇదంతా భోలీకి వింతగా తోచింది. 

గడ్డి.. గొడ్ల చావిడి
ఆ తర్వాత మూడు నెలలు భోలీ ఇలాగే చేసింది. నెలసరి రాగానే గుడ్డలో చుట్టిన గడ్డిని అదిమి ఉంచడం, గొడ్లచావిడిలో ఉండటం! అయితే ఆ గడ్డిలోంచి ఒక పురుగు ఆమె జననాంగంలోకి వెళ్లిన సంగతి  ఆమెకు తెలీదు. చివరికి ఇన్ఫెక్షన్‌ అయి, ఆమె గర్భసంచిని తొలగించవలసి వచ్చింది. భోలీ ఇక ఎప్పటికీ తల్లి కాలేదన్న చేదు నిజం తెలిసి, తల్లి కుదేలైపోయింది. ‘నెలసరి వయసు’లో ఉన్న బాలికలు, మహిళల సంఖ్య ఇండియాలో 35 కోట్ల 50 లక్షల మంది వరకు ఉంది. వీరిలో దాదాపు 82 శాతం మంది రుతుస్రావాన్ని ఆపడానికి పాత గుడ్డపేలికల్ని, ఇసుకను వాడుతున్నారు! చదువు లేకపోవడం, చెప్పేవాళ్లు లేకపోవడం, పేదరికం.. ఇలాంటి అనేక కారణాల వల్ల రుతుక్రమాన్ని ఆరోగ్యవంతంగా దాటడం అనే హక్కును వీళ్లు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇప్పుడు ‘నైన్‌’ అనే ఉద్యమం మొదలైంది. 

నూటికి ఎనభై మంది ఇంతే!
రుతుక్రమ పరిశుద్ధత కోసం ‘18 టు 82 బ్రిడ్జ్‌ ది గ్యాప్‌’ అనే నినాదంతో ‘నైన్‌’ ముందుకు వస్తోంది. పైన మీరు చదివిన భోలీ అనే బాలిక కథ నైన్‌ విడుదల చేసిన వీడియోలోనిదే. 18 అన్నది శానిటరీ నేప్‌కిన్‌లు వాడుతున్న మహిళల శాతం. 82 అన్నది.. భోలీలా అనారోగ్యకరమైన విధానాలు పాటిస్తున్న మహిళల శాతం. దేశంలోని  మహిళలందరికీ మెరుగైన రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన కల్పించి.. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ప్యాడ్‌లను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో అమర్‌ తులసియన్‌ అనే సోషల్‌ ఆంట్రప్రెన్యూర్‌ ‘నైన్‌’ అనే ఈ ఉద్యమానికి రూపకల్పన చేశారు. ‘నైన్‌.. ఎ మూవ్‌మెంట్‌’ పేరుతో మే 25న ఒక వెబ్‌సైట్‌ ప్రారంభం కాబోతోంది. సైట్‌ హోమ్‌ పేజీలో కనిపిస్తున్న రెండు అందమైన కళ్లను బట్టి నైన్‌ అనే పేరును ‘నయన’అనే అర్థంలో వాడారని తెలుస్తోంది. గర్ల్స్‌.. ఇందులో మీరూ భాగస్వాములు కావచ్చు. మీ మెన్‌స్ట్రువల్‌ స్టోరీలను షేర్‌ చేసుకోవచ్చు.

రుతుక్రమ పరిశుభ్రతపై సదస్సు
 మే 28 ‘మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ అవేర్‌నెస్‌ డే’. వచ్చే ఐదేళ్లలో రుతుక్రమ పారిశుద్ధ్యంపై అవగాహన కోసం తను ఏం చేయబోతున్నది ‘నైన్‌’ ఆ రోజున వెల్లడిస్తుంది. ‘ప్యాడ్‌మ్యాన్‌’ చిత్రంతో ఇదే అంశంపై అనేక ప్రచార ఉద్యమాల్లో పాల్గొన్న అక్షయ్‌ కుమార్‌తో పాటు ఇతర బాలీవుడ్‌ ప్రముఖులు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, ప్రభుత్వ అధికారులు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు, ఎన్జీవోలు, థాట్‌ లీడర్లు.. అంతా ఆరోజు జరిగే భారీ సదస్సులో మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ పై మాట్లాడతారు. ‘పైకి మాట్లాడదాం. పాత అలవాటును మాన్పిద్దాం’ అనే థీమ్‌తో ముంబైలో ఈ సదస్సు జరగబోతోంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఇల్లు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మహిళను ఆరోగ్యంగా ఉంచే బాధ్యత ఇంటిదీ, సమాజానిదే. 

మరిన్ని వార్తలు