మందులు వాడినప్పుడే పీరియడ్స్‌... గర్భం వస్తుందా?

18 Mar, 2020 08:03 IST|Sakshi

నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. మందులు వాడినప్పుడు మాత్రమే నాకు పీరియడ్స్‌ వస్తోంది. లేడీడాక్టర్‌ కొన్ని పరీక్షలు చేయించారు. నా ఎఫ్‌ఎస్‌హెచ్‌ పాళ్లు 50 ఐయూ/ఎమ్‌ఎల్‌ అన్నారు. అలాగే నాలో ఏఎమ్‌హెచ్‌ కూడా చాలా తక్కువగా ఉందట. నా అండాశయ సామర్థ్యం (ఒవేరియన్‌ కెపాసిటీ) చాలా తక్కువగా ఉందన్నారు. నా భర్త స్పెర్మ్‌కౌంట్‌ నార్మల్‌గానే ఉంది. నాకు గర్భం వచ్చే అవకాశం ఉందా? మా దంపతులకు తగిన సలహా ఇవ్వగలరు.– ఓ సోదరి, శ్రీకాకుళం

మీ కండిషన్‌ను ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ అంటారు. సాధారణంగా ఇది శాశ్వతమైన సమస్య. అయితే కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా గర్భం రావచ్చు కూడా. ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌కు కారణాలూ పెద్దగా తెలియదు. కొన్నిసార్లు క్రోమోజోముల్లోని లోపాలు, తమ వ్యాధి నిరోధక శక్తి తమనే దెబ్బతీసే ఆటో ఇమ్యూన్‌ సమస్యలు, గాలాక్టోసీమియా వంటివి కారణమవుతాయి. ఫ్యామిలీ హిస్టరీగా ఈ కండిషన్‌ ఉన్నవారి కుటుంబాలలో ఇది తరచూ కనిపిస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారికి ఆటో ఇమ్యూన్‌ పరీక్షలూ, ఫ్రాజైల్‌ ఎక్స్‌ క్రోమోజోమ్‌ పరీక్షలూ, డెక్సాస్కాన్‌ వంటివి అవసరమవుతాయి. సాధారణంగా ఈ కండిషన్‌ ఉన్నవారిలో గర్భధారణ అవకాశాలు తక్కువ కాబట్టి ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) చేయించుకోవాల్సిందిగా సలహా ఇస్తుంటాం. ఉన్న కొద్దిపాటి అండాలను సేకరించడం కష్టమైతే, అప్పుడు దాతల నుంచి సేకరించి, వాటితో మీ భర్త శుక్రకణాలతో ఫలదీకరణ చేయించి, పిండాన్ని రూపొందించి, దాన్ని మీ గర్భసంచిలోకి ప్రవేశపెట్టవచ్చు. ఈ సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా తమ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాల్సి ఉంటుంది. మీరు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్యాల్షియమ్, విటమిన్‌–డి ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం అవసరం. మీకు ప్రిమెచ్యుర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ ఉన్నందుకు మీ డాక్టర్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీని సూచిస్తారు. ఆ హార్మోన్లను సుమారు యాభై, యాభైఒక్క ఏళ్లు వరకు వాడాల్సి ఉంటుంది. వేర్వేరు వైద్యవిభాగాలకు చెందిన మల్టీడిసిప్లనరీ టీమ్‌తో మీరు సత్ఫలితాలను పొందవచ్చు.

ఎక్టోపిక్‌ప్రెగ్నెన్సీలోబిడ్డ గుండెచప్పుడు వినిపిస్తుందా?
నా భార్యకు గర్భం వచ్చాక ఇటీవల ఏడో వారంలో అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్షలు చేయించాం. ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వచ్చిందనీ, అది గర్భసంచిలో కాకుండా... కుడివైపున ట్యూబ్‌లో పెరుగుతోందని డాక్టర్‌ చెప్పారు. అయితే గుండెచప్పుళ్ళు వినిపిస్తున్నాయని అన్నారు. ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీలోనూ గుండెస్పందనల శబ్దాలు వినిపిస్తాయా? ఇప్పుడు శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాలని డాక్టర్లు చెబుతున్నారు. మందులతో తగ్గే అవకాశం లేదా? గతంలోనూ ఆమెకోసారి గర్భం వచ్చినప్పుడు ఎడమవైపు ఇలాగే జరిగి, ఆ వైపు ఉన్న ట్యూబును తొలగించారు. ఇప్పుడు ఇలాగే జరిగితే భవిష్యత్తులో గర్భధారణ జరిగే అవకాశాలు ఎలా ఉంటాయి? – ఎస్‌బీఆర్‌., కాకినాడ

గర్భసంచిలో కాకుండా ట్యూబ్‌లోనే గర్భం ఉండే పరిస్థితిని ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ కండిషన్‌లోనూ గుండెచప్పుళ్లు వినిపిస్తుంటాయి. ఈ పరిస్థితిని ఒక దశ వరకు మందులతో తగ్గించవచ్చు. అయితే పిండంలో హార్ట్‌బీట్‌ మొదలయ్యాక మాత్రం మందులతో తగ్గించలేం.ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి అది అకస్మాత్తుగా కడుపులో రక్తస్రావానికి (ఇంటర్నల్‌ బ్లీడింగ్‌కు) దారితీయవచ్చు. అందుకే పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోడానికి శస్త్రచికిత్సను డాక్టర్లు సూచిస్తుంటారు. ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని తొలగించడానికి లాపరోస్కోపిక్‌ సర్జరీ అనేది మంచి ప్రత్యామ్నాయం. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ట్యూబ్‌ ఉంచాలా లేదా అనే నిర్ణయాన్ని అప్పటి పరిస్థితిని బట్టి డాకర్లు తీసుకుంటారు. ఇక ఆమెకు అకస్మాత్తుగా రక్తస్రావం అయితే మాత్రం ఓపెన్‌ సర్జరీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ భార్య రక్తం గ్రూప్‌ నెగెటివ్‌ అయితే ఆమెకు ‘యాంటీ–డీ’ అనే ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్‌ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమెకు రెండు ట్యూబులు తొలగించినా మీరు ఆందోళన చెందకండి. ఆమె సురక్షితంగా ఉండే ఆ తర్వాత టెస్ట్‌ట్యూబ్‌ బేబీ అని పిలిచే ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) మార్గాన్ని అనుసరించవచ్చు.డాక్టర్‌ రత్న దూర్వాసులసీనియర్‌ ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో,హైదరాబాద్‌

మరిన్ని వార్తలు