భుజం జాగ్రత్త!

20 Feb, 2020 10:39 IST|Sakshi

ఈ ప్రపంచంలో ఏపని జరగాలన్నా భుజం కదిలించడం ద్వారానే అది సాధ్యం. మనకు ఎవరైనా బాగా దగ్గరివారైతే... ‘అతడు నా కుడిభుజం’ అంటూ కితాబిస్తాం. ఎవరికైనా బాధ్యతను అప్పగిస్తే... ‘నీ భుజాల మీద పెడుతున్నా’నంటాం. కష్టసాధ్యమైన బాధ్యతను నెరవేరుస్తున్న వారిని... ‘భారాన్నంతా తన భుజ స్కంధాల మీద మోస్తున్నాడ’ంటాం. పనుల బాధ్యతలను పంచుకునే వాడు దూరమైతే నా కుడిభుజం విరిగినట్టయిందని సామెత చెబుతాం. ఇదీ భుజానికి ఉన్న ప్రాధాన్యత. దానికి ఏవైనా వైద్యపరమైన సమస్యలు వస్తే... మన పనులు మనం చేసుకోవడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితే రాకూడదని అందరూ భావిస్తారు. మన రోజువారీ పనులన్నింటికీ భుజం కాసే... ఆ అవయవం ప్రాధాన్యతనూ, దానికివచ్చే సమస్యలనూ, వాటి నివారణను తెలుసుకుందాం. 

భుజంలో అత్యంత సంక్లిష్టమైన నాలుగు కీళ్లు, ముప్ఫయికి పైగా కండరాలు, ఆరు ప్రధానమైన లిగమెంట్లు ఉండి, అవన్నీ సమన్వయంతో కొనసాగుతూ మన రోజువారీ పనులన్నీ సక్రమంగా జరిగేలా చూస్తాయి. అయితే మన బరువంతా కాళ్లమీద పడుతుంది. కాబట్టి కాళ్ల అరుగుదలతో పోలిస్తే... భుజాలకు వచ్చే అరుగుదల సమస్యలు కాళ్ల అంతకాకపోయినా... కాస్తంత తరచుగా వీటికీ సమస్యలు రావడం చాలామందిలో కనిపించేదే. పైగా ఇటీవల క్రికెట్‌ వంటి ఆటల మూలంగా చేతిని గుండ్రంగా తిప్పుతూ బంతి విసరడం వల్ల భుజం పైన చాలా భారమే పడుతుండటం చాలా తరచూ కనిపించే విషయం. దాంతో ఫ్రోజెన్‌ షోల్డర్, భుజం కీలు అరగడం వల్ల వచ్చే రొటేటర్‌ కఫ్‌ వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. భుజానికి వచ్చే అనేక సమస్యలు, వాటి పరిష్కారాలపై అవగాహన పెంచుకుందాం.

షోల్డర్‌ ఆర్థరైటిస్‌
భుజం నిర్మాణంలో చేతి ఎముక బంతి అంత పరిమాణంలో ఉండి, భుజంలోని ‘గోల్ఫ్‌టీ’తో పోల్చదగ్గ ఒక సాకెట్‌లో ఇమిడి ఉంటుంది. భుజాన్ని చాలా ఎక్కువగా ఎక్కువగా ఉపయోగించి పనిచేసేవారిలో చాలా ఏళ్ల తర్వాత ఈ ఎముక చివరన ఉండే బంతి వంటి భాగంలోని కార్టిలేజ్‌ (ఎముక చివరన మృదువుగా ఉండే మృదులాస్థి) అరిగిపోతుంది. కొన్నిసార్లు ఏదైనా గాయమైనప్పుడు లేదా భుజం ‘గూడ’ తప్పినప్పుడు లేదా భుజం విరిగినప్పుడు కూడా ఎముక చివరన ఉండే కార్టిలేజ్‌ దెబ్బతింటుంది. ఈ కారణం వల్ల కూడా షోల్డర్‌ ఆర్థరైటిస్‌ రావచ్చు. ఇలాంటప్పుడు భుజంలో నొప్పి వస్తుంది.
లక్షణాలు: భుజంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కదలించినప్పుడు కీళ్ల మధ్య రాపిడి జరుగుతున్నట్లుగా ఉంటుంది. భుజం కదిలించడంలో ఇబ్బంది.
నిర్ధారణ: సాధారణ ఎక్స్‌–రేతో భుజం ఆర్థరైటిస్‌ను స్పష్టంగా నిర్ధారణ చేయవచ్చు.
చికిత్స: సమస్య తొలి దశలో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ, ఇంజెక్షన్స్‌తో దీనికి చికిత్స చేయవచ్చు. అయితే భుజం నొప్పి తీవ్రంగా ఉండి, అనంతర దశల్లోకి ప్రవేశిస్తే... షోల్డర్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ లేదా రివర్స్‌ షోల్డర్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ అవసరం కావచ్చు. సర్జరీ అవసరం ఎప్పుడన్నది ఆర్థరైటిస్‌ తీవ్రత మీద ఆధారపడుతుంది.

ఫ్రోజెన్‌ షోల్డర్‌
ఈ సమస్య ప్రధానంగా పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. సాధారణంగా 40 – 60 ఏళ్ల వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది ఎందువల్ల వస్తుందో నిర్దిష్టంగా తెలియదు. కానీ... డయాబెటిస్‌ ఉన్నవారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. భుజానికి గాయమైన వారిలో, గతంలో ఏ కారణం వల్లనైనా భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో మరింత ఎక్కువ. చేతి ఎముక, భుజంతో కలిసే చోట గుండ్రంగా ఉండి, అది అక్కడి సాకెట్‌లో ఇమిడి ఉండే భాగం చాలా సంక్లిష్టమైన నిర్మాణం. ఇందులో భుజం కీలు చుట్టూ కవచంలా ఉండే భాగాన్ని క్యాప్సూల్‌ అంటారు. ఈ సమస్య వచ్చినవారిలో కీలు అంతా బాగానే ఉన్నప్పటికీ క్యాప్సూల్‌ భాగం బాగా మందంగా మారుతుంది. ఇది ఎక్స్‌రేలో, ఎమ్మారైలో పెద్దగా కనిపించదు. ఈ సమస్య ఉన్నవారిలో భుజం కదలికలు చాలా పరిమితంగా మారతాయి. గతంలోలా భుజం సులువుగానూ, తేలిగ్గానూ కదిలించలేరు. విపరీతమైన భుజం నొప్పి ఉంటుంది. డయాబెటిస్‌ వచ్చినవారిలో ఈ నొప్పి ఎక్కువ. అందుకే ఈ నొప్పిని డయాబెటిస్‌కు ఒక సూచికగా కూడా డాక్టర్లు తీసుకుంటూ ఉంటారు.
చికిత్స: సాధారణంగా చాలామందిలో  ఫ్రోజెన్‌ షోల్డర్‌ వల్ల వచ్చే నొప్పి కొన్నాళ్ల తర్వాత దానంతట అదే తగ్గిపోతుంటుంది. అయితే ఫ్రోజెన్‌షోల్డర్‌ని  ఫిజియోథెరపీ, స్ట్రెచ్చింగ్‌ వ్యాయామాల ద్వారా తగ్గించవచ్చు. నొప్పి మరీ తీవ్రంగా ఉంటే పెయిన్‌ కిల్లర్స్‌తో కొద్దిమేర ప్రయోజనం ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా నొప్పినివారణ మందుల్ని అదేపనిగా వడటం మాత్రం చాలా ప్రమాదం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పరిమితంగా... అందునా డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే పెయిన్‌కిల్లర్స్‌ వాడాలి.పాశ్చాత్యదేశాల్లో ఉపయోగించే ‘హైడ్రోడయలటేషన్‌’ వంటి ప్రక్రియలు ఇప్పుడు మనవద్ద కూడా లభ్యమవుతున్నాయి. అరుదుగా ఆర్థోస్కోపీ వంటి ప్రక్రియలు అవసరం కావచ్చు.

రొటేటర్‌ కఫ్‌ పెయిన్‌
ఎవరైనా మన చేతిని మెలిదిప్పితే... మన భుజం వద్ద కూడా నొప్పి రావడం చూస్తుంటాం కదా... చెయి మెలిదిప్పకపోయినా అచ్చం అలాంటి నొప్పే రొటేటర్‌ కఫ్‌ సమస్య ఉన్నవారిలో కనిపిస్తుంటుంది. రొటేటర్‌ కఫ్‌ అన్న సమస్య వారిలో భుజంలోని ఏడు ప్రధాన కండరాల్లో నాలుగు కండరాలు ప్రభావితమవుతాయి. ఈ కండిషన్‌ ఉన్నవారిలో చేతి ఎముకకూ, భుజం ఎముకకూ మధ్య ఉండాల్సిన గ్యాప్‌ తగ్గుతుంది. ప్రధాన కండరమైన రొటేటర్‌ కఫ్‌కు పగుళ్లు ఏర్పడతాయి. దాంతో గతంలో తమ భుజాన్ని చాలా తేలిగ్గా పైకి లేపగలిగిన వారు కూడా ఈ సమస్య ఉన్నప్పుడు  భుజాన్ని పైకెత్తడంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. భుజాన్ని పక్కలకు కదిలించినా నొప్పి ఉంటుంది. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ లేదా ఎమ్మారై ప్రక్రియల ద్వారా కండరాల్లో ఏవైనా పగుళ్లు ఉన్నాయేమో కనుగొంటారు.
చికిత్స: ఈ సమస్య ఉన్నవారిలో ఫిజియోథెరపీ మంచి ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్స్‌తో చికిత్స అవసరమవుతుంది. ఇక కొందరిలో ఆర్థోస్కోపీ ప్రక్రియ ద్వారా చేతి ఎముకకూ, భుజంలోపల ఉండే ఎముకకూ మధ్య ఉన్న గ్యాప్‌ను సరిచేస్తారు. ఈ సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది ఆర్థరైటిస్‌కు దారితీసి, భవిష్యత్తులో అతి సంక్లిష్టమైన ‘షోల్డర్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ’ అవసరం పడవచ్చు.

ఆటల కారణంగా భుజానికి అయ్యే గాయాలతో...
భుజం ఎప్పుడూ కదులుతూ ఉండే భాగం కాబట్టి దానికి గాయమయ్యే అవకాశాలూ ఎక్కువే. ఉదాహరణకు భుజం గూడ తప్పడం (షోల్డర్‌ డిస్‌లొకేషన్‌), రొటేటర్‌ కఫ్‌ టేర్, స్లాప్‌ టేర్స్, టెండనైటిస్, టెండన్‌ రప్చర్స్‌ వంటివి జరగవచ్చు. సాధారణంగా ఆటల్లో భుజంలో గూడ తప్పడం సమస్య తరచూ కనిపిస్తుంటుంది. ఇలా జరిగినప్పుడు దాన్ని సరైన స్థానంలో అమర్చాల్సి ఉంటుంది. ఇదే సమస్య ప్రతి నిత్యం జరుగుతూ ఉంటే ఆర్థోస్కోపీ స్టెబిలైజేషన్‌ అనే శస్త్రచికిత్స ద్వారా వైద్య నిపుణులు దాన్ని సరిచేస్తారు.

భుజం సమస్యలనివారణ ఇలా...
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇందువల్ల భుజం కండరాలు బలంగా మారి భుజానికి వచ్చే అనేక సమస్యలు నివారితమవుతాయి
వ్యాయామంలో వెనకవైపు కండరాలపై కూడా దృష్టిపెట్టడం... చాలామంది శరీరానికి ముందువైపు ఉన్న కండరాలు బలంగా రూపొంది కనిపించడానికి తగిన వ్యాయామాలు చేస్తుంటారు. అయితే భుజం విషయంలో మాత్రం చేతులకు వెనకవైపున ఉండే కండరాలు కూడా అంతే బలంగా రూపొందేలా వ్యాయామాలు చేయాలి ∙డయాబెటిస్‌ రోగులు తమ రక్తంలోని చక్కెర పాళ్లను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. వారు వాకింగ్‌ వంటి వ్యాయామాలు చేయడం అవసరం ∙కంప్యూటర్‌పై పనిచేసేవారు, వీడియోగేమ్స్‌ ఆడేవారు, టీవీ చూసేవారు, డ్రైవింగ్‌ చేసేవారు సరైన భంగిమలో కూర్చోవడం అవసరం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా