దురలవాట్లకు దూరంగా...

8 Jan, 2014 23:54 IST|Sakshi
దురలవాట్లకు దూరంగా...

చేతి నిండా డబ్బు...
 ఏం చేయాలో తెలియక... విచ్చలవిడిగా ఖర్చుచేయడం...
 తప్పుదోవ పట్టడం...  దురలవాట్లకు వృథా చేయడం...
 కొన్ని రోజులు గడిచాక...
 జీవితంలో అనుకోని సంఘటన ఎదురుకావడంతో...
 పరివర్తన కలగడం...
 ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని మణికంఠ తీసిన లఘుచిత్రం ‘అహల్య’

 
 డెరైక్టర్స్ వాయిస్:


 మాది కడప జిల్లా, చిన్నమండెం గ్రామం. నేను బి.టెక్ పూర్తి చేసి, ప్రస్తుతం నిజాం గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎం.టెక్ చేస్తున్నాను. ఈ సినిమాకి మా స్నేహితులు బాగా సపోర్ట్ చేశారనడం కంటె, నా వెనుకే ఉంటూ, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ , ఏ విషయంలోనూ నేను డిజప్పాయింట్ కాకుండా చూసుకుంటూ వచ్చారు. ప్రస్తుత కాలంలో అమ్మానాన్నలు... బాగా డబ్బు సంపాదించేసి, తమ పిల్లలు బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో పిల్లలు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక పిల్లలు అడ్డదారుల్లోకి వెళ్లి చెడిపోతున్నారు. అలాంటివి కాస్త తగ్గాలి. తల్లిదండ్రులు  ఆలోచించి పిల్లల మీద కొంత శ్రద్ధ తీసుకుంటేనే మంచిదని కోరుకుంటున్నాను. ఎవరికీ సూక్తులు, సందేశాలు నచ్చవు. ఇప్పుడుండే జనరేషన్ సందేశం ఇచ్చేవారిని పనిలేనివాళ్లలా జమ కట్టేస్తున్నారు. అందువల్ల నేను ఎవరికీ సందేశం ఇవ్వదల్చుకోలేదు. ‘మనలో ముందు మార్పు రావాలి, తర్వాత పక్కన వాళ్లకి చెప్పాలి’ అన్నది నా ఉద్దేశ్యం.
 
 షార్ట్ స్టోరీ:


 ఇద్దరు స్నేహితులు ఉంటారు. వారిద్దరికీ కొన్ని దురలవాట్లు ఉంటాయి. ఒకసారి ఒక మిత్రుడు బాగా మద్యం సేవించి, ‘అమ్మాయి కావాలి’ అని మిత్రుడిని అడుగుతాడు. వెంటనే ఒక అమ్మాయిని తీసుకువస్తాడు. వచ్చిన అమ్మాయికి ఆకలిగా ఉండటంతో గబగబ వంటగదిలోకి వెళ్లి అన్నం తింటూ ఉంటుంది. అది చూసిన వెంటనే అతడిలో పశ్చాత్తాపం కలుగుతుంది. తనకు కావలసినంత డబ్బు ఉండటంతో, మంచిచెడుల విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నానని బాధ పడతాడు. వెంటనే ఆ అమ్మాయికి కొంత డబ్బు ఇచ్చి, పిల్లలకు ఏదైనా కొనిపెట్టమని చెప్పి పంపేస్తాడు. స్థూలంగా ఇదీ కథ.


 కామెంట్:
 

లఘుచిత్రాలలో ఇటువంటి అంశం మీద చిత్రాలు నిర్మించినవారు తక్కువే అని చెప్పవచ్చు. ఇంత చిన్న వయసు (23 సంవత్సరాలు) లో ఇంత మంచి ఆశయంతో లఘుచిత్రం నిర్మించినందుకు మణికంఠను అభినందించాలి. నటీనటులు మరికాస్త బాగా నటించాలి. చిత్రంలో మరింత పర్‌ఫెక్షన్ ఉంటే ఇంకా బాగుంటుంది. సినిమా టేకింగ్, ఎడిటింగ్, ఎక్స్‌ప్రెషన్స్, కెమెరా... వంటివన్నీ బాగున్నాయి. డైలాగులు అంత ఎక్కువ లేవు. ఒక సామాజిక అంశాన్ని ప్రధానంగా తీసుకుని తీసిన లఘుచిత్రం కనుక, అంశం మీదే ఎక్కువ కాన్సన్‌ట్రేషన్ ఉంది.
 
 - డా.వైజయంతి

 

మరిన్ని వార్తలు