‘బైపాస్’ తర్వాత జాగ్రత్తలు...

5 Nov, 2015 13:48 IST|Sakshi
‘బైపాస్’ తర్వాత జాగ్రత్తలు...

ఆయుర్వేదం  కౌన్సెలింగ్
 
మా పాపకు ఏడేళ్లు. నాలుగు నెలల నుండి పొడి దగ్గుతో బాధపడుతోంది. అప్పుడప్పుడు కొంచెం కళ్లె పడుతోంది. డాక్టర్లు ఎక్స్‌రే, రక్తపరీక్షలు చేసి ‘బ్రాంకైటిస్’ అని చెప్పారు. ఇది పూర్తిగా నయమవడానికి ఆయుర్వేద మందులు సూచించండి.  - వరలక్ష్మి, రాజమండ్రి

ఆయుర్వేద వైద్య పరిభాషలో దగ్గుని ‘కాస’ అంటారు. ఈ వయసు పిల్లల్లో ఇది తరచుగా కన్పిస్తుంది. మీరు రాసిన లక్షణాలను బట్టి దీన్ని పిత్త ప్రధానమైన, కఫానుబంధ కాసగా పరిగణించవచ్చు. ఈ కింద వివరించిన సూచనలు పాటించి మందులు వాడండి. ఒక నెలలో పూర్తిగా తగ్గిపోతుంది.
 
ఆహారం: బయటి ఆహారం ఏ రూపంలోనూ సేవించకూడదు. ముఖ్యంగా చాక్‌లేట్లు, బిళ్లలు, లాలీపాప్‌లు, ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలను దూరంగా ఉంచాలి. వాటి తయారీలో వాడే రంగులు, తీపి కల్గించే పదార్థాలు, నిల్వ చేయడం కోసం వాడే ద్రవ్యాలు చాలా హానికరం. అలర్జీలు కల్గించే అవకాశం హెచ్చు. ఇక కల్తీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటికి తోడు రోగ నిరోధక శక్తిని తగ్గించడం, ఇన్‌ఫెక్షన్లకు గురికావడం సర్వసాధారణం. ఈ విషయాలను సమగ్రంగా అవగాహన చేసుకొని తల్లిదండ్రులు జాగ్రత్త వహించక పోతే, మందుల ప్రయోజనం నామమాత్రమే అవుతుంది. దగ్గు మాటిమాటికీ తిరగబెడుతూనే ఉంటుంది.

క్షయ వ్యాధులు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. మనం నివసించే ప్రాంతంలోని వాతావరణ కాలుష్యం కూడా ఇలాంటి దగ్గులను కల్గించగలదు. కాబట్టి ఇక్కడ మందులతో బాటు ‘నిదానపరివర్జనం’ కూడా చాలా ముఖ్యమైన అంశం. అంటే వ్యాధి కారణాన్ని దూరం చేయటం, లేదా, ఆకారణాలకు మనం దూరమవటం.  పాలు, పండ్లు, పెరుగు, పప్పులు, ఆకుకూరలు, ఇతర కూరగాయలు, ఎండు ఫలాలు, ఇతర మాంసకృత్తులు మిన్నగా లభించే ఆహారాన్ని, సమతుల్యంగా సేవించవలసి ఉంటుంది. ఆవు నెయ్యి, ఆవుపాలు, ఆవు పెరుగు పుష్టికరమని గుర్తుంచుకోండి. ఉప్పు, పులుపు, మసాలాలను ఎంత తక్కువ తింటే అంత మంచిది.

విహారం: వయసుని బట్టి తగు రీతిలో శారీరక శ్రమ, అంటే ఆటల రూపంలో వ్యాయామం చాలా అవసరం. ప్రాణాయామం చేస్తే, ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది మానసిక ఒత్తిడి. కేవలం దగ్గే కాదు; కడుపునొప్పి; మలబద్దకం, విరేచనాలు, తలనొప్పి వంటి రుగ్మతలు కూడా ఆ ‘ఒత్తిడి’ వల్ల సంభవిస్తాయి.
 
మందులు: 1) అభ్రకభస్మ 100 మి.గ్రా. + ప్రవాళపిష్ఠి 100 మి.గ్రా. కలిపి తేనెతో రోజూ రెండు పూటలా నాకించాలి.
 2) వాసా కంట కారీ లేహ్యం: ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా చప్పరించాలి.
 3) వ్యోషాదివటి మాత్రలు: ఉదయం 1, రాత్రి 1
 ఈ మందులు ఒక నెల రోజులు వాడి పరిస్థితిని సమీక్షించుకోవలసి ఉంటుంది.
 
కార్డియాలజీ కౌన్సెలింగ్
 
మా అమ్మకు బైపాస్ సర్జరీ అయ్యింది. ఆమె విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.  - రవికుమార్, శ్రీకాకుళం

అన్ని కండరాలకు అందినట్టే గుండెకండరానికి కూడా రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ అందాలి. కానీ గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడిన వాళ్ల గుండె కండరానికి తగినంత రక్తం అందదు. దాంతో క్రమంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. గుండెకు తగినంత రక్తం అందేలా చేయడం కోసం చేసే ఈ శస్త్రచికిత్సలో కాలినుంచి రక్తనాళాన్ని  తీసుకుని, దాని ద్వారా గుండెకండరానికి రక్తం అందేలా బైపాస్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఈ సర్జరీ వాళ్లు మొదటి ఆరు వారాల్లో పాటించాల్సిన జాగ్రత్తలివి.

డాక్టర్లు సూచించిన ఆరోగ్యకరమైన వ్యాయామాలను రోజుకు రెండుసార్లు...  పదినిమిషాల పాటు చేయాలి      ఏమాత్రం భారం పడకుండా పది పదిహేను నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు నడక (వాకింగ్)కు ఉపక్రమించాలి  అకస్మాత్తుగా ముందుకు, వెనక్కు, పక్కలకు ఒంగడం వంటివి చేయకూడదు  మూడు కిలోలకు మించిన బరువు కనీసం నెలరోజుల పాటు ఎత్తవద్దు  నేల మీద కూర్చోవడం, కాలుమీద కాలేసుకోవడం వంటివి చేయకండి  శస్త్రచికిత్స కోసం శరీరంపై గాటు పెట్టిన చోట ఎలాంటి ఒత్తిడీ పడకుండా చూసుకోండి  భారమైన పనులు చేయకండి  డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా చేయండి.

శస్త్రచికిత్స అయిన ఆరు వారాల తర్వాత : దీర్ఘకాలంలో గుండెపై కలిగే దుష్ర్పభాలను నివారించడానికి ఈ జాగ్రత్తలు తోడ్పడతాయి. అవి...  కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోండి. అందుకు తగినట్లుగా డాక్టర్ల సూచన మేరకు ఆహార, వ్యాయామ నియమాలను పాటించండి  రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే... రిలాక్సేషన్ ప్రక్రియలైన ధ్యానం, యోగా వంటివి చేయండి.  రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకునే పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ, మీ డాక్టర్‌కు తెలియజేస్తూ ఉండండి.

అందులో వచ్చిన మార్పులను బట్టి వైద్యులు మీ మందులను మార్చడం వంటివి చేస్తారు  సిగరెట్ పొగకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్‌పోజ్ కావద్దు. అది రక్తనాళాల మృదుత్వాన్ని దెబ్బతీయడంతో పాటు అవి రక్తనాళాలు సన్నబారేలా చేయవచ్చు. పైగా ఆ పొగ గుండె వేగాన్ని పెంచుతుంది. కాబట్టి పొగాకు ఏరూపంలోనైనా తగదు      మద్యంకూడా గుండెకు హానిచేసేదే  ఒత్తిడికి గురికావడం రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీసేలా చేసే అంశం. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి  ఒకే చోట కూర్చొని ఉండకండి. చురుగ్గా ఉండే జీవనశైలి మార్పుతోనూ గుండెజబ్బును నివారించుకోండి.
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

నా వయసు 33 ఏళ్లు. ఆఫీసులో కంప్యూటర్‌పై ఎక్కువగా పనిచేస్తుంటాను. నా కుడిభుజంలో గత మూడు నెలలుగా నొప్పి వస్తోంది. ఇది చాలా ఇబ్బంది కలిగించేలా  డల్ పెయిన్ మాదిరి వచ్చినా ఒక్కోసారి తీవ్రంగా లోపల గుచ్చుతున్నట్లుగా నొప్పి (షార్ప్ పెయిన్)గా మారిపోతోంది. ముఖ్యంగా నా చేతిని తల కంటే పైకి ఎత్తినప్పుడు ఈ నొప్పి వస్తోంది. మధ్యమధ్యన నొప్పి తెలియడం లేదు. కానీ ఇది తరచూ తిరగబెడుతోంది. నేను బాడ్మింటన్ ఎక్కువగా ఆడుతుంటాను. దీని వల్ల నొప్పి పెరుగుతోందా అన్న విషయం నాకు తెలియడం లేదు. నేను వ్యాయామం చేస్తే నొప్పి తగ్గుతుందని అంటున్నారు. కానీ నిజానికి నా నొప్పి వ్యాయామం తర్వాత మరింత పెరుగుతోంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పగలరు. 
- చంద్రశేఖర్, రాజేంద్రనగర్

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీకు భుజంలోని రొటేటర్ కఫ్ అని పేరుండే కొన్ని కండరాల సమూహంలో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. ఇవి ఏదైనా ఎత్తడానికి ఉపయోగపడతాయి. భుజానికి సంబంధించిన రెండు ఎముకల మధ్యలోంచి వెళ్తాయి. ఆ కండరాలకు ఏదైనా సమస్య వస్తే వాటిలో వాపు వస్తుంది. అప్పుడు మనం భుజం ఎత్తడానికి ప్రయత్నిస్తుంటే ఈ కండరాలు రెండు ఎముకల మధ్య నలిగిపోతుంటాయి. ఒక్కోసారి ఈ కండరాలు కొద్దిగా చిట్లిపోవచ్చు కూడా.

ఇది అక్కడ గాయం అయ్యేలా చేస్తుంది. మీరు భుజంతో చేసే పనుల వల్ల  ఈ గాయం మరింత రేగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఇది తగ్గడం కోసమే ఉద్దేశించిన ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. ఇలా రొటేటర్ కఫ్ సమస్య వచ్చినప్పుడు క్రికెట్, బాడ్మింటన్ వంటి ఆటలు ఆడటం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. మీరు ఒకసారి మీ భుజం ఎక్స్‌రే, ఎమ్మారై స్కాన్ వంటివి పరీక్షలు చేయించుకొని, ఆర్థోపెడిక్ సర్జన్‌ను చూడాలి.

మరిన్ని వార్తలు