మీ కడుపు చల్లగుండ

30 Mar, 2019 00:16 IST|Sakshi

‘పలుచన కావడమ’టే విలువ తగ్గడమని తెలుగు వాడుక. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుం’దనీ  తెలుగులో సామెత.అవును... మజ్జిగ నైజమే అంత.  తాను పలుచనైనప్పటికీ భోజనానికి నలుగురెక్కువొచ్చినా, పదిమంది అదనంగా వేంచేసినా అందరి కడుపూ నిండాలనేదే, అందరికీ పోషకాలు అందాలనేదే మజ్జిగ సుగుణం. కడుపును చల్లగా చేసేంత మంచితనం ...కడుపులో చల్ల కదలకుండా ఉంచేంత గొప్పదనం మజ్జిగది... రండి... ఈ వేసవిలో రకరకాల మజ్జిగ రుచులు ఆస్వాదించండి. 

సోర్‌ అండ్‌ స్పయిసీ బటర్‌ మిల్క్‌
కావలసినవి: తాజా పెరుగు – ఒక కప్పు; ఉప్పు – తగినంత ; కరివేపాకు – 2 రెమ్మలు; నిమ్మ రసం – 
5 టీ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని; ఐస్‌ క్యూబ్స్‌ – తగినన్ని.

తయారీ:
ఒక పాత్రలో పెరుగు వేసి, చిక్కగా గిలకొట్టాలి
ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు జత చేయాలి 
నిమ్మ రసం, నీళ్లు జత చేసి బాగా కలిపి గ్లాసులలో పోసుకోవాలి
ఐస్‌ క్యూబ్స్‌ వేసి చల్లగా అందించాలి.

స్మోక్‌డ్‌ మసాలా చాస్‌
కావలసినవి: పెరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – అర కప్పు; కొత్తిమీర – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఉప్పు – తగినంత; అల్లం తురుము – అర టీ స్పూను; బొగ్గు ముక్కలు – 2; కరివేపాకు – 5 ఆకులు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి – 4 (సన్నగా తరగాలి); నూనె – ఒక టీ స్పూను.

తయారీ:
మిక్సీలో పెరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, అల్లం తురుము, ఉప్పు వేసి తిప్పాలి
​​​​​​​►కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పాలి
​​​​​​​►మజ్జిగను ఒక పాత్రలోకి తీసుకోవాలి
​​​​​​​► ఒక పాత్రలో కరివేపాకు, పచ్చి మిర్చి, జీలకర్ర ఉంచాలి
​​​​​​​► బొగ్గును స్టౌ మీద కాల్చి, ఆ బొగ్గును చిన్న పాత్రలోకి తీసి, వెంటనే ఆ పాత్రను మజ్జిగ మీద ఉంచాలి
​​​​​​​► నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్రలను మండుతున్న బొగ్గు మీద వేసి సిల్వర్‌ ఫాయిల్‌తో వెంటనే మూసేయాలి
​​​​​​​► బొగ్గు మీద నుంచి వచ్చే పొగ మజ్జిగలోకి చేరి, కొత్త రుచి వస్తుంది
​​​​​​​► ఐదు నిమిషాల తరవాత సిల్వర్‌ ఫాయిల్‌ తీసేయాలి
​​​​​​​► బొగ్గును తీసి పడేయాలి
​​​​​​​►మజ్జిగను గ్లాసులలోకి పోసి, పుదీనా ఆకులతో అలంకరించి అందించాలి.

మసాలా బటర్‌ మిల్క్‌
కావలసినవి: తాజా పెరుగు – 2 కప్పులు; నీళ్లు – 3 కప్పులు; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; అల్లం తురుము – అర టీ స్పూను; ఐస్‌ క్యూబ్స్‌ – తగినన్ని.
తయారీ:
​​​​​​​►ఒక పాత్రలో పెరుగు, ఉప్పు వేసి గిలకొట్టాలి
​​​​​​​►మూడు కప్పుల నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
​​​​​​​►జీలకర్ర పొడి, ధనియాల పొడి జత చేసి బాగా కలపాలి
​​​​​​​►అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు కలపాలి
​​​​​​​►ఐస్‌క్యూబ్స్‌ జత చేయాలి  మిక్సీ జార్‌లో వేసి రెండు నిమిషాల పాటు మిక్సీ తిప్పి, గ్లాసులలోకి తీసుకుని, కొత్తిమీర ఆకులతో అలంకరించి, చల్లగా అందించాలి

నిమ్మ ఆకులు కరివేపాకు మజ్జిగ
కావలసినవి: పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; నిమ్మ ఆకుల తరుగు – పావు కప్పు; కరివేపాకు తరుగు – ఒక టేబుల్‌ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – ఒక టీ స్పూను.

తయారీ:  
​​​​​​​►
పెరుగును ఒక కుండలో పోసి కవ్వంతో బాగా చిలకాలి
​​​​​​​►తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మరోమారు చిలకాలి
​​​​​​​►ధనియాల పొడి, అల్లం తురుము, నిమ్మ రసం జత చేసి రెండు నిమిషాలు చిలకాలి
​​​​​​​►నిమ్మ ఆకులు, కరివేపాకు తరుగు జత చేసి, గరిటెతో కలిపి మూత ఉంచాలి
అర గంట తరవాత గ్లాసులలో పోసి చల్లగా అందించాలి.

కుకుంబర్‌అండ్‌ మింట్‌ లీవ్స్‌బటర్‌ మిల్క్‌
కావలసినవి: తాజా పెరుగు – 2 కప్పులు; ఉప్పు – తగినంత; ఐస్‌ క్యూబ్స్‌ – 4; కీర దోస తురుము – అర కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; చాట్‌ మసాలా – అర టీ స్పూను; మిరియాల పొడి – కొద్దిగా; కీర దోస చక్రాలు – 3 (అలంకరించడం కోసం); చల్లటి నీళ్లు – 3 కప్పులు; కొత్తిమీర – గుప్పెడు; పుదీనా – అర కప్పు.

తయారీ:
​​​​​​​►
ఒక పాత్రలో పెరుగు, ఉప్పు వేసి గిలకొట్టాలి
​​​​​​​►కీరదోస తురుము, అల్లం తురుము, ఐస్‌ క్యూబ్స్‌ జతచేసి, మిక్సీలో వేసి రెండు నిమిషాలు తిప్పాలి
​​​​​​​►చాట్‌ మసాలా, మిరియాల పొడి, చల్లటి నీళ్లు జత చేసి మరోమారు తిప్పాలి
​​​​​​​►గ్లాసులలోకి తీసుకుని పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు జత చేసి, కీరదోస చక్రాలతో అలంకరించి చల్లగా అందించాలి.

స్పైసీ బటర్‌ మిల్క్‌
కావలసినవి: పుదీనా ఆకులు – 10; తరిగిన పచ్చి మిర్చి – 1; కొత్తిమీర – కొద్దిగా; అల్లం ముక్క – చిన్నది; గడ్డ పెరుగు – ఒక కప్పు; ఇంగువ – చిటికెడు; వేయించిన జీలకర్ర పొడి – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మరసం – ఒక టేబుల్‌ స్పూను; నీళ్లు – ఒక కప్పు; ఐస్‌ క్యూబ్స్‌ – 10.
పోపు కోసం... నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ.

తయారీ:
​​​​​​​►
మిక్సీ జార్‌లో పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చి మిర్చి, అల్లం వేసి మెత్తగా చేయాలి
​​​​​​​►పెరుగు, ఇంగువ, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి
​​​​​​​►నిమ్మ రసం, ఒక కప్పు నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
​​​​​​​►గ్లాసులలోకి తీసుకుని ఐస్‌ క్యూబ్స్‌ జత చేయాలి
​​​​​​​►స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి తీసేయాలి
​​​​​​​►మజ్జిగ గ్లాసులలో వేసి అందించాలి.

దబ్బ ఆకులు మిరియాల పొడి మజ్జిగ
కావలసినవి: పెరుగు – 2 కప్పులు; దబ్బ ఆకుల తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; మిరియాల పొడి – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను ; ఉప్పు – తగినంత.

తయారీ:
​​​​​​​►పెరుగును కుండలో వేసి కవ్వంతో చిలకాలి
​​​​​​​►ఉప్పు, నీళ్లు జత చేసి రెండు నిమిషాల పాటు చిలకాలి
​​​​​​​►నిమ్మ రసం, మిరియాల పొడి జత చేసి మరోమారు చిలకాలి
​​​​​​​►దబ్బ ఆకుల తరుగు, కొత్తిమీర తరుగు వేసి గరిటెతో కలిపి సుమారు గంట సేపు మూత ఉంచాలి
 ​​​​​​​►గ్లాసులలో పోసి చల్లగా అందించాలి.

మింట్‌ జీరా బటర్‌ మిల్క్‌
కావలసినవి: పెరుగు – రెండు కప్పులు; జీలకర్ర పొడి – ఒక టేబుల్‌ స్పూను; అల్లం తురుము – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; చాట్‌ మసాలా – పావు టీ స్పూను; ఐస్‌ క్యూబ్స్‌ – కొద్దిగా; పుదీనా తరుగు – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – రెండు టీ స్పూన్లు.

తయారీ:
​​​​​​​►
పెరుగును ఒక కుండలో వేసి కవ్వంతో బాగా చిలకాలి
​​​​​​​►తగినన్ని నీళ్లు జత చేసి మరోమారు చిలకాలి
​​​​​​​►అల్లం తురుము, చాట్‌ మసాలా, ఉప్పు, నిమ్మ రసం జత చేసి మరోమారు చిలకాలి
​​​​​​​►జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు జత చేసి గరిటెతో బాగా కలపాలి
​​​​​​​►ఐస్‌ క్యూబ్స్‌ జత చేసి గ్లాసులో పోసి చల్లగా అందించాలి.

చిట్కాలు
​​​​​​​►మజ్జిగలో ఒక టీ స్పూను తేనె కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా రెండు నెలలు తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది
​​​​​​​►వెన్ను నొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు
​​​​​​​►గ్లాసుడు మజ్జిగలో అర టీ స్పూను శొంఠి పొడి వేసి క్రమం తప్పకుండా కనీసం నెల రోజులు వాడితే, పైల్స్‌ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.

మజ్జిగ ఉపయోగాలు 
మజ్జిగ ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. మానవులలో ఉండే త్రిదోషాలనూ మజ్జిగ అదుపులో ఉంచుతుంది. ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల వారికి మజ్జిగ మంచిది కాదు.
​​​​​​​►పథ్యంగా పని చేస్తుంది
​​​​​​​►ఆకలిని పెంచుతుంది
​​​​​​​►బుద్ధిని పెంచేందుకు తోడ్పడుతుంది
​​​​​​​►మజ్జిగలో ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణం కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది
​​​​​​​►మజ్జిగను ఎక్కువగా వాడేవారికి పైల్స్‌ వ్యాధి వచ్చే అవకాశం తక్కువ
​​​​​​​►మజ్జిగ శరీర తాపాన్ని తగ్గించి, చల్లగా ఉంచుతుంది ∙
​​​​​​​►రోజులో ఎక్కువసార్లు మజ్జిగ తీసుకోవడం వలన దాహార్తి తీరుతుంది
​​​​​​​►శరీరానికి అవసరమయ్యే సోడియం, క్యాల్షియమ్‌లను అందిస్తుంది
​​​​​​​►గుండె సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది
​​​​​​​►బిపి, కొలస్ట్రాల్‌లను నివారిస్తుంది 
​​​​​​​►శరీరానికి హాని చేసే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది
​​​​​​​►శరీరంలో ఏర్పడే వేడిని తగ్గిస్తుంది
​​​​​​​►ఎముకలను బలంగా చేస్తుంది
​​​​​​​►ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు సాయపడుతుంది
​​​​​​​►బరువు తగ్గేందుకు దోహద పడుతుంది 
​​​​​​​►అజీర్తి, ఎసిడిటీ సమస్యలను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా