వానల్లో ఆరోగ్యం కోసం...

24 Sep, 2016 00:06 IST|Sakshi
వానల్లో ఆరోగ్యం కోసం...

ఆయుర్వేద కౌన్సెలింగ్
వానాకాలంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. అంతా తేమ, జలమయం. సూర్యకాంతి కనబడటం లేదు. ఇలాంటప్పుడు పెద్దలుగానీ, పిల్లలుగానీ రోగాల బారిన పడకుండా ఉండటంతో తీసుకోవాల్సిన నివారణలతో పాటు... అవి తగ్గడానికి ఆయుర్వేద చికిత్స సూచించప్రార్థన.
- అయలసోమయాజుల మీనాక్షి, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్
 
శ్రావణ భాద్రపద మాసాలు వర్షరుతువులోకి వస్తాయి. దీన్నే మనం వానాకాలం అంటాం. వర్షాలు అధికంగా కురుస్తున్నప్పుడు వాతావరణంలో తేమ ఎక్కువవుతంది. ఇంటాబయటా తడితడిగా ఉంటుంది. వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో కూడిన వ్యాధులు ప్రబలుతుంటాయి. వీటికి కారణం అసాత్మ్యత (అలర్జీ), సూక్ష్మజీవులు (ఇన్ఫెక్షన్లు). వీటి నివారణ, చికిత్స కోసం ఈ కింది జాగ్రత్తలు పాటించండి.
 
శుచి, శుద్ధి : ఇంటిలోపల, ఇంటిముందు రోజుకు రెండుసార్లు గుగ్గిలం ధూపం వేయండి. బయట అమ్మే ఆహార పదార్థాలు, ఇతర తినుబండారాలు తినవద్దు. ఇంట్లో తయారు చేసుకున్న తాజా ఆహారపదార్థాలను వేడివేడిగా తినండి. నూనె వంటకాలు, కారం ఎక్కువగా ఉండే టిఫిన్లు తినవద్దు. మరిగించి చల్లార్చిన నీటిని తాగండి. అల్లం, కరివేపాకు వేసిన పలుచని మజ్జిగ, శొంఠితో తయారు చేసిన ‘టీ’ తాగండి. బాగా ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి. అంతటా పరిశుభ్రత ముఖ్యం. బయట వర్షంతో తడిసిన బట్టల్ని వేరే పెట్టి, ఇంటికి రాగానే వేడినీటితో స్నానం చేయడం అవసరం.
 
అల్లం, వెల్లుల్లి ఐదేసి గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం ఒక చెంచా (5 గ్రాములు), పసుపు ఐదు చిటికెలు వేసి పావు లీటరు నీళ్లు కలిపి ‘కషాయం’ కాచుకోండి. మూడువంతులు ఇగరగొట్టి, ఒక వంతు మిగలాలి. రెండుపూటలా ఈ కషాయం... గోరువెచ్చగా తాగండి. మోతాదు : పెద్దలకు 5 చెంచాలు; పిల్లలకు రెండు చెంచాలు (అవసరమైతే తేనె కలుపుకోవచ్చు). ఇది ప్రతిరోజూ రెండు వారాలపాటు సేవించినా పరవాలేదు. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసాల నివారణకూ పనికి వస్తుంది. చికిత్సగానూ పని చేస్తుంది. జీర్ణక్రియను సక్రమం చేస్తుంది. రోగనిరోధకశక్తిని ఉత్తేజపరుస్తుంది.
 
వామును నూనె లేకుండా పొడిగా కొద్దిగా వేయించి, నీళ్లు పోసి మరిగిస్తే దాన్ని ‘వాము’ కషాయం అంటారు. మోతాదు : 5 చెంచాలు... రెండుపూటలా సేవిస్తే అజీర్ణం దూరమవుతుంది. నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి.
  శొంఠి చూర్ణం రెండు గ్రాములు, మిరియాల చూర్ణం ఒక గ్రాము కలిపి తేనెతో రెండుపూటలా సేవిస్తే కఫంతో కూడిన దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
  పేలాలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఐదేసి చెంచాల చొప్పున మూడుపూటలా తాగితే వాంతి, వికారం తగ్గుతాయి. ఏలకుల పొడి (మూడు చిటికెలు) ప్లస్ జీలకర్రపొడి (ఒకగ్రాము) కలిపి తేనెతో రెండు పూటలా సేవిస్తే వాంతులు తగ్గుతాయి.
  శొంఠి, ఇంగువ, జీలకర్ర వేసిన పలుచని మజ్జిగను రెండుపూటలా సేవిస్తే కడుపునొప్పి దూరమవుతుంది. అజీర్ణం ఉండదు. పొట్టలో వాయువు తగ్గి, రోజూ అయ్యే విరేచనం సాఫీగా అవుతుంది.
 
వ్యాయామం : ఇంటిపట్టున ఉన్నప్పటికీ, అన్ని వయసుల వారూ ఇంట్లోనే ఒక అరగంట తేలికపాటి వ్యాయామం విధిగా చేస్తే, శరీరం తేలిక పడి, కీళ్లు-కండరాల నొప్పులు దరిచేరవు.
 
బజారులో లభించే ఔషధం : అరవిందాసవతోపాటు పిప్పల్యాసవ ద్రావకాలను, వానాకాలంలో ఇంట్లో ఉంచుకోవాలి. ఒక్కొక్కటి రెండేసి చెంచాలు, కొద్దిగా నీళ్లలో కలుపుకొని రెండుపూటలా వానాకాలమంతా సేవిస్తే చాలా వ్యాధులు దరిచేరవు.
 
వంటింట్లో ఉండే ఈ పదార్థాలతోనే వానల వల్ల వచ్చే ఆరోగ్య సంబంధిత అనర్థాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు
- డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్

మరిన్ని వార్తలు