కాలేయ వ్యాధులు... చికిత్స

16 Oct, 2013 23:44 IST|Sakshi
కాలేయ వ్యాధులు... చికిత్స

ప్రస్తుత కాలంలో మానవ జీవన విధానంలో అనేక మార్పుల వలన, అలాగే ఆహారపు అలవాట్లలో మార్పులవలన ఈ కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మన ఆహారంలో తీసుకున్న కొవ్వు పరిమాణం పెరుగుతోంది. అలాగే శరీరం కదలికలు తగ్గుతున్నాయి, శ్రమ చేసే తత్వం తగ్గిపోతుంది. మద్యపానం దిన చర్యలో భాగం అయిపోయింది. ఇవి అన్నీ నాగరికత పేరుతో ఆరోగ్యానికి చెరుపు చేస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.
 
 ఈ ఆధునిక కాలంలో మధుమేహం, స్థూలకాయం, థైరాయిడ్, సంతానలేమి అనే సమస్యలు ఎలా సాధారణం అయిపోయాయో, అలాగే కాలేయ సంబంధ సమస్యలూ ఎక్కువ అయ్యాయి.
 
 దానికి కారణాలు: ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి, చక్కెర సంబంధిత ఆహార పదార్థాలసేవన, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం. ఇటీవల ఫ్యాటీలివర్ అనే సమస్యతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
 
 ఫ్యాటీలివర్... ఉదరంలో కాలేయగ్రంథి అనేది ముఖ్యమైన అవయవం, కుడివైపున ఉంటుంది. ఇది అన్నింటి కంటే చాలా పెద్దగ్రంథి. అలాగే జీర్ణప్రక్రియలో అతి ప్రాధాన్యతను సంతరించుకున్నది. మానవులు తీసుకున్న ఆహారంలో చక్కెర శాతం పెరుగుతున్న కొలది కాలేయంలో నిల్వ అవుతూపోతుంది. తర్వాత అది శక్తిగా మారుతుంది. శక్తిగా మారుతున్న చెక్కెరను మినహాయిస్తే మిగిలినది కొవ్వుగా మారుతుంది. ఈ ప్రక్రియలో కాలేయంలో ఉండే కణాలు తమ గుణాన్ని కోల్పోయి, అక్కడ కొవ్వు పేరుకుపోతుంది. దీనినే వైద్య పరిభాషలో ఫ్యాటీలివర్‌గా వ్యవహరిస్తారు. దీనిలో  అనేక దశలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి 3 దశలు.
 
 మొదటి దశ: కాలేయ కణాల మధ్య కొంచెం కొవ్వు పేరుకుంటుంది.
 
 రెండవ దశ: నాష్ అంటారు. ఇందులో కాలేయం గాయపడటం (డామేజ్)తో పాటు, కొన్ని కాలేయ కణాలు నశించిపోతాయి.
 
 మూడవ దశ: సిర్రోసిన్ వస్తుంది. అంటే కాలేయంలోని కణాలు తమ కార్యనిర్వహణ శక్తిని పూర్తిగా కోల్పోతుంది. స్వరూపం కూడా మారిపోతుంది. ఇది  ప్రమాదకరమైన కండిషన్. ముఖ్యంగా ఇక్కడ కాలేయ మార్పిడి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
 
 సాధారణ కారణాలు: ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తినటం, మద్యపానం ఎక్కువగా చెయ్యటం, ప్రమేహం, స్థూలకాయం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు.
 
 సాధారణ లక్షణాలు: సాధారణంగా ఫ్యాటీలివర్ వ్యాధితో బాధపడే వారికి ఈ లక్షణాలు ఉండవు. కాని ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలో ఇది ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది  
 
 కొందరికి కుడివైపు పొట్ట పైభాగంలో (రిబ్‌కేజ్ పక్కటెముకల కింద) పొడిచినట్లుగా నొప్పి వస్తుంది. ఇది కాలేయం కొంచెం కొంచెం పెరుగుతున్నట్లు (లివర్ ఎన్‌లార్జ్‌మెంట్) ఉండటం వల్ల వస్తుంది  
 
 కొందరిలో మాంసాహారం, నూనె పదార్థాలు, తిన్నప్పుడు అలాంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది.
 
 కాలక్రమేణా కాలేయంలో వచ్చే మార్పులు
 కాలేయవ్యాధి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని సిర్రోసిస్ లేదా లివర్‌క్యాన్సర్‌గా మారవచ్చు.
     
 ఫ్యాటీలివర్ మొదటిదశ నుండి రెండవ దశ అయిన ఎన్.ఏఎస్.హెచ్‌కు. అక్కడి నుండి 3వ దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుంది అనుకోకూడదు. చాలా సందర్భాలలో 1 నుండి నేరుగా 3 కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ కన్పించగానే తగు జాగ్రత్త తీసుకోవాలి.
 
 స్థూలకాయం వలన అనర్థాలు: బరువు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి నష్టం వాటిల్లుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి  
 
 స్థూలకాయం ఉన్న 90% వ్యక్తులలో ఫ్యాటీలివర్, ఫ్యాటీలివర్ మొదటిదశ కనిపిస్తుంది  
 
 స్థూలకాయం ఉన్న 20% వ్యక్తుల్లో మనం రెండవ దశగా పేర్కొన్న ఎన్.ఏ.ఎస్.హెచ్. దశ ఉంటుంది  
 
 ఫ్యాటీలివర్ వచ్చిన వ్యక్తులను పరిశీలిస్తే వారిలో దాదాపు 50% మందికి డయాబెటిస్ ఉన్నట్లు తెలుస్తుంది. సిర్రోసిస్ వచ్చిన వారిలో 50% మంది డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారే.
 
 నిర్ధారణ పరీక్షలు:
 అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కానింగ్‌లో చాలావరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది.
     
 లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించాలి. దానిలో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బ తిన్నడం అనే విషయం తెలుస్తుంది.
     
 డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయిలు, టైగ్లిసరైడ్స్ స్థాయులు ఏమైనా పెరిగాయా అని చూడాలి.
     
 కొందరిలో లివర్ బయాప్సీ అవసరం.
 
 కామెల: ఆయుర్వేదశాస్త్రంలో కాలేయ వ్యాధులలో అతిసాధారణ వ్యాధి కామెల. దీనినే సాధారణంగా జాండీస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో ఒళ్లంతా పచ్చగా మారుతుంది. ముఖ్యంగా కళ్లు, మూత్రం, గోళ్లు, పసుపురంగుగా మారతాయి. ఇంకా తీవ్రమైతే శరీరంలోని చర్మం అంతా పసుపురంగుగా మారుతుంది. జ్వరం, ఆకలి మందగించడం, వ మనం అవుతుందనే భ్రాంతి లక్షణాలు ఉంటాయి. ఇది ఒక రకమైన వైరస్ ద్వారా వస్తుంది. తద్వారా కాలేయం సామాన్య కర్మ దెబ్బ తింటుంది. ఈ వైరస్ అనేది తీసుకొనే తినుబండారాలు, పానీయాలు ముఖ్యంగా చెరుకురసం, ఐస్ కలిసిన పండ్ల రసం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఎక్కువ అయితే రోగి మెదడు దెబ్బతిని కోమాలోకి కూడా వెళ్లవచ్చును.
 
 నివారణ: ఇది వేసవిలో ఎక్కువగా వస్తుంది కనుక, ఇంట్లో తయారు చేసిన పదార్థాలు తీసుకొనుట వలన, కామెర్ల వ్యాధిని నివారించవచ్చు. కలుషిత నీరు తాగకుండా నీరు కాచి, చల్లార్చి త్రాగటం మంచిది.
 
 చికిత్స: ఈ వ్యాధి సోకినవారు మసాలాలు, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. పెరుగు లేక మజ్జిగ అన్నం తినటం మంచిది. ద్రవపదార్థాల సేవన అంటే కొబ్బరినీళ్లు, బార్లీ, గ్లూకోజ్ నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
 
 ఔషధ చికిత్స
 ఆయర్వేదంలో చక్కటి ఔషద పరిష్కార మార్గాలు ఉన్నాయి. అలాగే అవసరాన్ని బట్టి విరేచనం, తక్రధార అనే పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉంటాయి. ఇవి వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి.
 
 డాక్టర్ హనుమంతరావు
 ఎం.డి (ఆయుర్వేద),
 స్టార్ ఆయుర్వేద,
 సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్,
 విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక
 ph: 99089 11199 / 99599 11466

 
 వ్యాధి నివారణ - తీసుకోవలసిన జాగ్రత్తలు
 బరువు తగ్గటం, ఆరోగ్యకరమైన ఆహారం, విధిగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. నెయ్యివంటి కొవ్వు పదార్థాలు వాడరాదు. ఆలివ్ ఆయిల్ వాడాలి. తృణధాన్యాలు, పొట్టుతీయని బియ్యం, గోధుమలు ఎక్కువగా వాడాలి.
 
 వ్యాయామం చేయాలి, డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించుకోవాలి. దురలవాట్లు లేకుండా ఉండాలి. ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలను తీసుకొనే అలవాటు ఉంటే వాటికి దూరంగా ఉండాలి.
 

మరిన్ని వార్తలు