బాబుకు తరచూ తలనొప్పి... ఏం చేయాలి?

3 Oct, 2013 00:52 IST|Sakshi
బాబుకు తరచూ తలనొప్పి... ఏం చేయాలి?

మా బాబు వయసు ఎనిమిదేళ్లు. తరచూ తలనొప్పితో బాధపడుతున్నాడు. ఇంతకుముందు అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కొంతకాలం బాగానే ఉంటోంది. మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తోంది. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి.
 - ప్రభాకర్ నాయుడు, చిత్తూరు

 
 మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు.
 
 మైగ్రేన్‌తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల తలనొప్పి అని  భావించవచ్చు.
 
 ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి... వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమంది లో దీనివల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు.
 
 చికిత్స
 చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం  
 
 నుదుటిపై చల్లటి నీటితో అద్దడం  
 
 నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు  ఆస్పిరిన్ లేదా ఎన్‌ఎస్‌ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం  
 
 నీళ్లు ఎక్కువగా తాగించడం
 
 ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం
 
 పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఇది తరచూ వస్తుంటే మాత్రం  ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోవడం ప్రధానం.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు