కథ చెప్పిన విజేత

4 Dec, 2017 02:12 IST|Sakshi
చివురిస్తున్న బేబీ హల్దార్‌ కొత్త జీవితం! అక్షరాలతో రంగు నింపుకుంటోంది. ఆ ఆలోచనల జీవం పోసిన మాస్టారు, ప్రొఫెసర్‌ ప్రబోద్‌కుమార్‌తో కథాచర్చలో బేబీ హల్దార్‌.

కథ రాయడం కంటేకూడా కథ చెప్పడంలో నైపుణ్యం వేరు! మరి కథ చెప్పుకోవడంలో.. ఆ ధైర్యమే వేరు!! ఎవరూ తమ జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకంలా చూపించుకోరు! కాని తన పుస్తకం ఇంకొకరికి స్ఫూర్తినిస్తుంది అని నమ్మినప్పుడు తన జీవితంలా ఇంకొకరి జీవితం కాకూడదు అని నిశ్చయించుకున్నప్పుడు.. పుస్తకం తెరిచి.. మనసు విప్పి.. తన కథ తానే చెప్పుకోవడంలో గొప్పతనం ఉంది!! ‘‘ఎ లైఫ్‌ లెస్‌ ఆర్డినరీ’’ పుస్తకాన్ని బేబీ హల్దార్‌ చేతిలో పెట్టి.. ‘‘ఆటోగ్రాఫ్‌’’ ప్లీజ్‌ అన్నాడు ప్రొఫెసర్‌ ప్రబో«ద్‌ కుమార్‌. సిగ్గుపడుతూ.. ఆ పుస్తకం మొదటి పేజీలో సంతకం చేసిచ్చింది బేబీ హల్దార్‌. ఆమె ఆ ప్రొఫెసర్‌ ఇంట్లో పనిమనిషి. ఆ ప్రొఫెసర్‌.. మున్షీ ప్రేమ్‌చంద్‌ మనవడు! తన సంరక్షకురాలిగా వచ్చిన బేబీ హల్దార్‌ .. ఈ రోజు రచయిత కావడానికి ప్రోత్సాహం అందించిన మనిషి! ఆ కథే.. బేబీ హల్డార్‌ బయోగ్రఫీ..ఎ లైఫ్‌ లెస్‌ ఆర్డినరీ!!

కశ్మీర్‌ నుంచి  దుర్గాపూర్‌  వయా ముర్షిదాబాద్‌
బేబీ పుట్టింది కశ్మీర్‌లో. గుండ్రటి మొహం, సొట్ట బుగ్గలతో పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న ఆ పాపాయిని చూసుకుని ‘‘చందమామా’’ అంటూ మురిసిపోయింది బేబీ తల్లి. సారా కంపు గప్పున కొట్టడంతో ఆసంబరం క్షణంలో విషాదం అయింది. ఆ తాగుబోతు బేబీ తండ్రి. ఆయనొక  ఎక్స్‌ సర్వీస్‌మన్‌. ఆర్మీలోంచి బయటకు వచ్చాక డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. అప్పుడే తాగుడికి బానిసయ్యాడు. పని చేసి డబ్బులు తేవడం కంటే తాగొచ్చి భార్యను కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. పెళ్లయి, బిడ్డ పుట్టిన నాలుగేళ్ల వరకూ ఆ తల్లి భరించింది భర్తను. ఆపై  వల్లకాక ఆ చంటిపిల్లను తండ్రి దగ్గరే ముర్షిదాబాద్‌లో వదిలేసి ఆమె వెళ్లిపోయింది. అతను ఊరుకోలేదు. పిల్లను సాకాలనే వంకతో రెండో పెళ్లి చేసుకున్నాడు.

భర్త తాగుడుకు ఆమె విసిగిపోయి కోపమంతా బేబీ మీద తీసేది. అలా సవతి తల్లి చెడ్డది అన్న పేరును ఆమే మోసింది. చిన్నప్పటి నుంచి బేబీకి చదువంటే ఇష్టం. కాని ఆరు వరకే చదివించి మానిపించారు పెద్దవాళ్లు. ఇంటి పనుల్లో సవతి తల్లికి సాయపడుతూ.. సమయం దొరికినప్పుడు స్నేహితులతో ఆడుకుంటూ కాలంగడిపింది బేబీ. చదువు తర్వాత బేబేకి ఇష్టమైన వ్యాపకం.. ఆటలు! లేడిలా పరిగెత్తుతుంది. జంపింగ్‌లోనూ అదే మెరుపు వేగం చూపిస్తుంది. ఆ నైపుణ్యాన్ని ఎవరూ కనిపెట్టలేదు కాని పన్నెండేళ్లకు ఈడొచ్చిందని పెళ్లి చేసి అత్తారిల్లయిన దుర్గాపూర్‌ పంపారు.

కల కోసం...
 అత్తారింట్లో పని పెద్ద భారమనిపించలేదు బేబీకి. కాపురమే కష్టం అనిపించింది. చాలా సార్లు చదువు.. ఆటలు గుర్తొకొచ్చి ఏడిచేది. యేడిదికల్లా కొత్త బాధ్యత పుట్టింది ఆమెకు బిడ్డ రూపంలో.   ఆ తర్వాత మూడేళ్లలో మరో ఇద్దరు బిడ్డలతో పదహారేళ్లకే ముగ్గురు పిల్లల తల్లి అయింది.  తన తల్లికి ఎదురైన  హింసే బేబీకీ ఎదురైంది భర్త దగ్గర్నుంచి. తాగొచ్చి కొట్టేవాడు. అతని సంపాదన అతనికే సరిపోయేది కాదు. దాంతో బేబీ ఇళ్లల్లో పనిచేసి ఆర్థికభారాన్నీ మోసింది. ఆమెకు ఒకటే కల.. తన పిల్లలు చదువుకోవాలని. రోజురోజుకి పెరుగుతున్న భర్త హింస.. తమను  బతకనివ్వదని తెలిసి ఒక రోజు ఢిల్లీ రైలెక్కింది పిల్లలను (సుబోద్, తపస్, ప్రియ)తీసుకొని. అప్పటికి ఆమె వయసు పాతికేళ్లు!

పనిమనిషి..
ఢిల్లీలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇళ్లల్లో పని వెదుక్కుంది. ఇంటి యజమానుల ఆగడాలను భరించింది. ఆ తర్వాత గుర్‌గావ్‌లోని ఓ ఇంట్లో రోజంతా ఉండిపోయే  పనిమనిషి కావాలని పొరుగింటామె చెప్పింది బేబీకి. ఒక్క ఇల్లే చూసుకుంటే తన ఇల్లు గడుస్తుందా? సందేహాన్నే బయటపెట్టింది బేబీ. ‘‘ఉన్నవాళ్లే. జీతం బాగానే ఉంటుంది. అవుట్‌హౌజ్‌లో ఉండొచ్చట’’ చెప్పింది పక్కింటామె. మరో ఆలోచన చేయకుండా గుర్‌గావ్‌ వెళ్లింది బేబీ. ఆ ప్రొఫెసరే ప్రబో«ద్‌ కుమార్‌. ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది అక్కడే.

దిద్దుకున్న బాట..
ఎప్పటిలాగే ఆ రోజూ పుస్తకాల అల్మారాలు దులిపే పనిపెట్టుకుంది బేబీ. ఆ పని అంటే ఆమెకు చాలా ఇష్టం. దులిపే పేరుతో నచ్చిన పుస్తకాలను వచ్చీరాని చదువుతో అర్థంచేసుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు ప్రొఫెసర్‌ ఇంటికి వచ్చాక ఆమె సంతోషంగా ఉండడానికి కారణం.. ఆ పుస్తకాలే! స్టూల్‌ ఎక్కి కిందటి వారం చదవాలనుకున్న పుస్తకం తీసి పేజీలు తిప్పు తోంది.. ఓ చేతిలో దుమ్ముతుడిచే గుడ్డను పట్టుకొని. ఏదో పనిమీద అటుగా వెళ్తున్న ప్రొఫెసర్‌ కంట్లో పడిందా దృశ్యం. ఆశ్చర్యపోయాడు. ‘‘బేబీ.. నీకు చదువొచ్చా?’’ అడిగాడు అదే ఆశ్చర్యంతో. ఆ మాట వినపడనంత ఏకాగ్రత ఆమెకు ఆ పుస్తకంలో. దగ్గరకు వచ్చి స్టూల్‌ను కదిపాడు ప్రొఫెసర్‌. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిపడింది బేబీ. ‘‘మాస్టారూ’’ అంటూ కంగారు, భయం కలగలిసిన భావంతో పుస్తకం అల్మారాలో పెట్టేసి చటుక్కున స్టూల్‌ దిగింది.

ఆప్యాయంగా తల మీద చేయి వేసి.. ‘‘నీకు చదువొచ్చా...’’ అని అడిగాడు. ‘‘ఆరు వరకే చదివాను మాస్టారూ.. కాని ఇష్టం’’ చెప్పింది బేబీ. ఓ పెన్ను, నోట్‌ బుక్‌ ఇచ్చి ఆమె జీవిత కథను రాయమని చెప్పాడు ప్రబో«ద్‌ కుమార్‌. 20 ఏళ్ల తర్వాత పెన్ను, బుక్‌ పట్టుకున్న ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. ధైర్యం చెప్పాడు ప్రొఫెసర్‌. తొలుత చాలా తప్పులు రాసింది. తన పేరు స్పెల్లింగ్‌తో సహా!  సరిదిద్దాడు ప్రబో«ద్‌. నోట్‌బుక్‌ మార్జిన్‌ నుంచి ప్రారంభమైన ఆమె రాతను కరెక్ట్‌ చేశాడు ఆయన. అలా ఆమె రాసినదాన్ని రోజూ చూసేవాడు, పొరపాట్లు దిద్దేవాడు. అంతేకాదు బెంగాలీ(ఆమె బెంగాలీ), ఇంగ్లిష్‌  పుస్తకాలను ఇచ్చేవాడు చదవమని.  ఫలితంగా.. వచ్చిందే ‘‘ఎ లైఫ్‌ లెస్‌ ఆర్డినరీ’’! బేబీని ప్రొఫెసర్‌ రాయమని చెప్పిన ఆమె జీవితకథ! మార్కెట్లో  సంచలనం సృష్టించింది.

‘‘ఇది బేబీ జీవితమే కాదు.. మన దేశంలోని చాలామంది ఒంటరి స్త్రీల, ఒంటరి తల్లుల కథ.. ఎందరో పనిమనుషుల వ్యథ.. మన సమాజంలో స్త్రీల మీద సాగుతున్న జులూమ్‌కు  అద్దంపట్టిన రచన’’ అంటూ బేబీ రాసిన పుస్తకం మీద సమీక్షలు వచ్చాయి. ‘‘ఒంటరి ప్రయాణం చాలా కష్టం. ముఖ్యంగా నాలాంటి మహిళలకు. ఊరొదిలి వెళ్లిపోతున్నప్పుడు చాలామంది చాలా మాటలన్నారు నన్ను.  అవేవీ వినిపించుకోలేదు. నా పిల్లలకు చదువు చెప్పించాలి, వాళ్లకు మంచి భవిష్యత్తునివ్వాలనే ఆశ తప్ప నాకింకే ఆలోచనా లేకుండింది.

నా పుస్తకం చదివిన ఒకావిడ.. ‘‘నా కథ కూడా నీలాంటి కథే ’’ అని ఫోన్‌ చేసి చెప్పినప్పుడు ముందు ఏడుపొచ్చింది. తర్వాత సంతోషమనిపించింది. మన దేశంలో నాలా ఇల్లు వదిలివెళ్లిన ఆడవాళ్లు చాలామంది ఉన్నారు. కాని వాళ్లందరికీ నాకు దొరికిన సపోర్ట్‌ దొరక్కపోయుండొచ్చు. నాలా మాట్లాడలేకపోవచ్చు. అలాంటి వాళ్లందరికీ నేను, నా పుస్తకం స్ఫూర్తినివ్వగలిగితే.. వాళ్లలో కొంతైనా ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగితే నా జన్మ ధన్యమైనట్టే!’’ అంటుంది 44 ఏళ్ల బేబీ హల్దార్‌. ఆమె ప్రయాణం ఆగలేదు. రెండో పుస్తకం మొదలుపెట్టింది. రాయడాన్ని కొనసాగించాలని కోరుకుంటోంది. ‘‘ఎ లైఫ్‌ లెస్‌ ఆర్డినరీ’ని ప్రముఖ బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్‌ ప్రకాష్‌ ఝా సినిమా తీయనున్నట్టు, ఈ పుస్తకాన్ని ఒరియా, తమిళ్, తెలుగులో అనువదించనున్నట్టూ వార్తలు వినిపిస్తున్నాయి.

తాత.. మనవడు
మున్షీ ప్రేమ్‌చంద్‌.. ఆధునిక హిందీ, ఉర్దూ సాహిత్య కృషీవలుడు. సేవాసదన్, వర్‌దాన్, రంగ్‌భూమి, నిర్మల, ప్రేమాశ్రం, గబన్, కర్మభూమి ఆయన రచనల్లో కొన్ని మాత్రమే. మున్షీ అనేది సాహిత్యప్రియులు ఆయనకు గౌరవంగా ఇచ్చిన బిరుదు! మున్షీ ప్రేమ్‌చంద్‌ సాహిత్యం ద్వారా సమాజానికి సేవ చేస్తే ఆయన మనవడు ప్రొఫెసర్‌ ప్రబో«ద్‌కుమార్‌ తనింట్లో పనిమనిషిని రచయిత్రిగా నిలిపి తాత స్ఫూర్తిని చాటాడు.
 

– శరాది

మరిన్ని వార్తలు