పాపకు దద్దుర్లు... ఏం చేయాలి?

18 Jul, 2013 02:40 IST|Sakshi
పాపకు దద్దుర్లు... ఏం చేయాలి?
 మా పాపకు ఐదేళ్లు. ఇటీవల ఒంటి మీద దద్దుర్లలా వచ్చాయి. ఒకరోజు ఉండి మళ్లీ తగ్గుతున్నాయి. ఆ టైమ్‌లో అమ్మాయి చాలా ఇబ్బంది పడుతోంది. ఈ సమస్యకు మందులు వాడాం. తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తున్నాయి. మా పాపకు ఇలా జరగడానికి కారణం ఏమిటి? 
 - సురేఖ, ఒంగోలు
 
 మీ పాపకు ఉన్న సమస్యను అర్టికేరియా అంటారు. ఈ సమస్య లో చర్మం పైభాగం (సూపర్‌ఫీషియల్ డర్మిస్) ఎర్రబడి కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఇది చిన్న ఎర్రటి మచ్చలా మొదలై శరీరమంతటా అనేకచోట్ల కనిపించవచ్చు. మనలోని 20 శాతం మందిలో జీవితకాలంలో కనీసం ఒకసారైనా కనిపించే అతి సాధారణ సమస్య ఇది. ఆర్టికేరియాలో అక్యూట్ అని, క్రానిక్ అని రెండు రకాలు ఉంటాయి. లక్షణాలను బట్టి మీ పాపకు అక్యూట్ ఆర్టికేరియా అని చెప్పవచ్చు. 
 
 ఆర్టికేరియాకు అనేక కారణాలు ఉన్నా యి. అందులో ముఖ్యంగా ఆహారం వల్ల (గుడ్డు, గోధుమ, వేరుశనగలు, సముద్రపు చేపలు, కొందరిలో స్ట్రాబెర్రీస్); మందులు, ఏదైనా పురుగు కుట్టడం (తేనెటీగలు లేదా చీమల వంటివి); ఇన్ఫెక్షన్లు (బ్యాక్టీరియల్ లేదా వైరల్); కాంటాక్ట్ అలర్జీలు (లేటెక్స్/రబ్బరు, పుప్పొడి వంటివి); గొంగళిపురుగులు, కొన్ని జంతువుల లాలాజలం తగలడం వల్ల; రక్తం, రక్తానికి సంబంధించిన ఉత్పాదనల వల్ల... మీరు చెబుతున్న అక్యూట్ అర్టికేరియా రావచ్చు. 
 
 దీర్ఘకాలికంగా కనిపించే క్రానిక్ ఆర్టికేరియాలో 80 శాతం కేసుల్లో కారణం ఇదీ అని చెప్పడం కష్టం.  కాకపోతే కొన్నిసార్లు చాలా వేడి, చల్లటి, ఒత్తిడితో కూడిన, కంపనాలతో ఉండే పరిసరాల వల్ల, థైరాయిడ్, రక్తానికి సంబంధించిన రుగ్మతల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) ఆర్టికేరియా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. 
 
 అక్యూట్ అర్టికేరియాకు నట్స్‌తో కూడిన ఆహారం, ఆహారంలో వేసే కృత్రిమ రంగులు, పుప్పొడి, ఏదైనా పురుగు కుట్టడం, కడుపులో నులిపురుగులు, సింథటిక్ దుస్తులు, సీఫుడ్ వంటి వాటిని సాధారణ కారణాలుగా గుర్తించారు. కాబట్టి మీ పాప విషయంలో చికిత్సలో భాగంగా మొదట పైన పేర్కొన్న అంశాలలో మీ పాప ఆర్టికేరియాకు ఏది కారణం కావచ్చో దాన్ని గుర్తించి, దానినుంచి కొన్నాళ్లు మీ పాపను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇక మందుల విషయానికి వస్తే యాంటీహిస్టమైన్స్, హెచ్2 బ్లాకర్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇక లక్షణాలు తీవ్రంగా కనిపించే వారిలో ఇమ్యునో మాడ్యులేషన్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. 
 
 మీ పాప విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీహిస్టమైన్స్ లో హైడ్రాక్సిజీన్, సిట్రజీన్ వంటి మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య పదేపదే తిరగబెడుతూ, తీవ్రంగా కనిపిస్తుంటే కొన్ని ఇమ్యునలాజికల్ పరీక్ష లు కూడా చేయించాల్సి ఉంటుంది. కాబట్టి తీవ్రతను బట్టి మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణుణ్ణి లేదా మీ పీడియాట్రీషియన్‌తో చర్చించి, తగిన చికిత్స తీసుకోండి. 
 
మరిన్ని వార్తలు