బ్యాక్టీరియా...  మన జన్యువులను నియంత్రిస్తాయా?

10 Jan, 2018 23:55 IST|Sakshi

వినడానికే ఆశ్చర్యంగా అనిపించే విషయమిది. శరీరంలో.. ముఖ్యంగా  కడుపు, పేవుల్లో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా మన జన్యువులను నియంత్రించడం ద్వారా మన ఆరోగ్యానికి కారణమవుతున్నాయని మూడు దేశాల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా చేసిన పరిశోధన ద్వారా తెలిసింది. నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి. మనం పండ్లు, కాయగూరలు తిన్నప్పుడు.. వాటిని బ్యాక్టీరియా జీర్ణం చేసుకుంటాయి. ఈ క్రమంలో అవి  కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి బ్యాక్టీరియా నుంచి బయటపడి మన కణాల్లోకి ప్రవేశించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇలా అవి మన కణాల్లోకి చేరినప్పుడు అక్కడ ఉండే జన్యువుల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయన్నమాట.

బ్యాక్టీరియా విడుదల చేసే రసాయనాలు షార్ట్‌ చెయిన్‌ ఫ్యాటీయాసిడ్ల రూపంలో ఉంటాయని, హెచ్‌డీఏసీ అనే ప్రొటీన్‌ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా ఇవి జన్యువుల్లో రసాయన మార్పులకు కారణమవుతున్నాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్‌ ప్యాట్రిక్‌ వర్గా వెయిజ్‌ అంటున్నారు. కడుపు, పేవుల్లోని బ్యాక్టీరియా తొలగించిన ఎలుకల్లో హెచ్‌డీఏసీ ప్రొటీన్‌ ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితి పేవుల్లో కేన్సర్‌కు ఒక కారణమని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేశాయని ప్యాట్రిక్‌ తెలిపారు. కేన్సర్‌ నివారణతోపాటు మంచి ఆరోగ్యానికి శరీరంలోని కొన్ని బ్యాక్టీరియా కీలకమని తమ పరిశోధన చెబుతోందని ఆయన వివరించారు.  

మరిన్ని వార్తలు