బ్యాడ్ హ్యాబిట్స్‌కు బై బై...! గుడ్‌హ్యాబిట్స్‌కు గుడ్‌మార్నింగ్!!

27 Jan, 2014 22:54 IST|Sakshi

మనం రోజూ ఎన్నో పనులు మనకు తెలియకుండానే చేస్తుంటాం. ఎదుటివారు తెలియ చెప్పేవరకూ, ఎత్తిచూపేవరకూ మనకు ఓ దురలవాటు ఉందనే స్పృహే లేకుండా వ్యవహరిస్తుంటాం. ఉదాహరణకు రాస్తూ, రాస్తూ మధ్యమధ్య మీ పెన్ క్యాప్‌నో, పెన్సిల్ చివరనో నోట్లో పెట్టుకుంటారా? చల్లటి నీళ్లు తాగుతూ ఆ ‘చిల్ల’టి  ద్రవంలో చాలాసేపు మీ పళ్లు మునిగి ఉండేలా చప్పరిస్తుంటారా? ఇలాంటి అనేక అలవాట్లను చక్కబరచుకుంటే కేవలం పళ్లనే కాదు... భవిష్యత్తులో నోటి నుంచి పంటికీ, పంటి నుంచి ఒంటికి పాకే ఎన్నో వ్యాధులను నివారించుకోవచ్చు.  గుడ్‌హ్యాబిట్స్‌కు గుడ్‌మార్నింగ్ చెప్పండిలా...
 
 దురలవాట్లలో జగమొండి... చిరుతిండి
 కొందరు అదేపనిగా ఏదో ఒక చిరుతిండిని నములుతూ ఉంటారు. దీనివల్ల పళ్లు ఎప్పుడూ పిండి పదార్థాల్లో, చక్కెరలో ముంచి ఉంచినట్లే అవుతుంటాయి. అలా ముంచి ఉంచిన ఫలితం వల్ల దంతాలు చాలా త్వరగా దెబ్బతింటాయి.
 అధిగమించడం ఇలా: చిరుతిండ్లు తినే అలవాటును మానుకోండి. ఒకవేళ మానలేకపోతే చిరుతిండ్లకు బదులుగా ఎప్పుడూ క్యారట్ ముక్కను నములుతూ ఉండండి.
 
సిగరెట్లు.. హెల్త్ హాజార్డ్స్ ఎన్నో రెట్లు!!
 సిగరెట్ వల్ల కేవలం పళ్లకు మాత్రమే కాదు... పూర్తి శరీర ఆరోగ్యానికి వచ్చే ముప్పు చాలా ఎక్కువ. నోటి దుర్వాసన అనే దుష్ఫలితం అదనంగా మరో అవాంఛిత  బోనస్. పొగాకు వల్ల చిగుర్లకూ ఎన్నో వ్యాధులు రావచ్చు. ఇక వాటితో పాటు నోటి, పెదవుల, నాలుక క్యాన్సర్ల ప్రమాదాలు మరీ ఎక్కువ. అనేక అంతర్గత అవయవాల రాచకురుపులకూ (క్యాన్సర్) ఈ అలవాటే రాచమార్గం.
 అధిగమించడం ఇలా: ఈ దురలవాటును తక్షణం మానేయాలి. తమంతట తాము మానలేకపోతే డాక్టర్‌ను సంప్రదించి మానేందుకు వీలుగా చూయింగ్ గమ్స్ వాడాలి.
 
చిప్స్ కరకర... పళ్లకు కటకట...
 కరకరలాడే చిప్స్ రుచికి సరేగానీ... పళ్లకు మాత్రం ప్రమాదకారి. చిప్స్‌లో పిండిపదార్థాలు (స్టార్చ్) ఎక్కువ. పైగా పళ్ల మధ్య చిక్కుకునే చిప్స్ అవశేషాలు దీర్ఘకాలంలో దంతక్షయానికి కారకాలు.
 అధిగమించడం ఇలా: చిప్స్‌ను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ రుచి కోసం తిన్నా... వీలైనంత త్వరగా నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవడం అవసరం.
 
పళ్లు ఓపెనర్స్ కావన్న సంగతి... ఐ-ఓపెనర్ కావాలి
 చాలామంది సీసా మూత తీయడానికి పళ్లను వాడుతుంటారు. కుట్టుపని చేసేవారు చాలా మంది సూదిని పళ్లతో పట్టుకుంటుంటారు. కొందరు ప్రతిసారీ దారాన్ని పళ్లతోనే తెంపుతుంటారు. కొందరు షాంపూ షాషేలను చింపడానికి పళ్లను ఉపయోగిస్తుంటారు. మీ పళ్లు ఓపెనర్స్ కావు. కత్తెరకు ప్రత్యామ్నాయం కూడా కాదు. ఇలా చేసే చాలా సమయాల్లో పళ్ల ఎనామిల్ దెబ్బతింటుంది. పళ్ల నుంచి చిన్న ముక్క ఊడిపోవచ్చు కూడా.
 అధిగమించడం ఇలా : సీసా మూత తీయాలంటే ఓపెనర్ వాడండి. షాషే చింపాలంటే కత్తెర వాడండి. వాటికి ప్రత్యామ్నాయంగా పళ్లను ఉపయోగించకండి.
 
కాఫీ, టీ... తాగితే తప్పేం‘టీ’?
 కొందరు కాఫీలు, టీలు అదేపనిగా తాగేస్తుంటారు.  కాస్తలో కాస్త టీ బెటర్‌గానీ... కాఫీ అయితే అందులోని అసిడిక్ గుణం వల్ల తెల్లటి పలువరసను పచ్చబారేలా చేస్తుంది. మితిమీరి తాగుతుంటే దీర్ఘకాలంలో పళ్లను మెరుపుకోల్పోయేలా చేస్తాయా  పానీయాలు. కాఫీ, టీ లో ఉన్న వేడికి చిగుర్లు, నాలుకపైన ఉంటే టేస్ట్ బడ్స్ దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ. కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పిప్పిపళ్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.
 అధిగమించడం ఇలా : కాఫీ, టీలు పరిమితంగా తాగండి. ఒకవేళ ఇప్పటికే పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్‌తో వాటిని బాగుచేసుకోండి.
 
పెన్సిల్ కొరుక్కుంటున్నారా?  
 రాస్తూ రాస్తూ పెన్సిన్‌ను, పెన్‌ను పళ్ల మధ్య కొరుకుతున్నారా? అలా చేయకండి. పళ్లను దెబ్బతీసే ఈ  అలవాటు చాలా తప్పు. పైగా పెన్సిల్ మధ్యన ఉండే లెడ్ చాలా ప్రమాదకారి.
 అధిగమించండిలా : మీరు రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్ వెళ్లకుండా బబుల్‌గమ్ నమలండి. క్రమంగా పై అలవాటు తప్పుతుంది. నోట్లో లాలాజలం పెరగడంతో కొన్ని అనారోగ్యాలూ తప్పుతాయి.
 
దగ్గు తగ్గించే మందు... దంతక్షయాన్ని పెంచే మందు
 దగ్గు మందు ఓ ఔషధమే కదా అని అనుకుంటారు చాలామంది. అందుకే అది తాగాక నోరు కడుక్కోరు. కానీ దగ్గు మందులో ఉండే చక్కెర పాళ్లు దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.
 అధిగమించడం ఇలా: దగ్గు మందు గొంతులో పోసుకోగానే కలిగే ఉపశమనాన్ని అనుభవిస్తుండగానే... నోరు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గుమందు తాగిన ప్రతిసారీ నోరు కడుక్కోవాలి.
 
తప్పుడు బ్రష్షింగ్‌తో ముప్పు తప్పదు...
 తాము అనుసరిస్తున్న విధానం తప్పని తెలిసేదాకా ప్రతివారూ తాము చాలా బాగా బ్రష్ చేసుకుంటున్నామనే అనుకుంటారు. కానీ బ్రష్షింగ్‌లో పొరబాటు చేసేవారు చాలా ఎక్కువ.
 అధిగమించడం ఇలా: మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌ను ఎంచుకోవాలి. అధిక ఒత్తిడితో బ్రష్షింగ్ చేయకూడదు. బ్రష్షింగ్ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్ చేసేలా టూత్‌బ్రష్‌ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్‌గా)  కదిలిస్తూ బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి.
 
‘రెడ్’వైన్... పళ్లకు ఎర్రటి డేంజర్ గుర్తు!
 గుండెపోటును నిరోధిస్తుందనీ, గుండెకు ఆరోగ్యం సమకూరుతుందంటూ కొందరు రెడ్‌వైన్ అదేపనిగా తాగేస్తుంటారు. అయితే రెడ్‌వైన్‌లో క్రోమోజెన్ ట్యానిన్స్ అనే రంగునిచ్చే పదార్థాలు (పిగ్నెంట్స్) పంటి ఎనామిల్‌ను దెబ్బతీసి పళ్లు మిలమిలను కోల్పోయేలా చేస్తాయి.
 అధిగమించడం ఇలా: రెడ్‌వైన్ అయినా సరే... అది కూడా మద్యమే కాబట్టి మానుకుంటేనే మంచిది.
 
పండ్లా... పళ్లా... ఏవి ముఖ్యం?
 ఫ్రూట్ జ్యూస్‌లతో ఆరోగ్యం సమకూరుతుంటుందని చాలామంది పళ్లరసాలు ఎక్కువగా తాగేస్తుంటారు. అందులో ఆరోగ్యంతో పాటు కొన్ని అనారోగ్య కారకాలూ ఉంటాయి. ఉదాహరణకు అందులోని చక్కెర, యాసిడ్ మోతాదులు. వీటివల్ల పళ్లు దెబ్బతింటాయి. ఉదాహరణకు మామూలుగా నారింజ కొరికి తిన్నదానికంటే చక్కెర కలిపిన ఆరెంజ్ పండ్లరసంతో పళ్లు పాడయ్యే అవకాశం  ఎక్కువ.
 అధిగమించడం ఇలా: పండ్లను జ్యూస్‌గా తాగడం కంటే కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్‌గా తాగినా చక్కెర కలుపుకోవద్దు. జ్యూస్ తాగిన వెంటనే నోరు కడుక్కోండి.
 
కొరుకుతూ ఉంటే ... అరుగుతూ ఉండటం ఖాయం
 కొందరికి మాటిమాటికీ పళ్లు కొరికే అలవాటు ఉంటుంది. మరికొందరు ‘బ్రక్సిజం’  అనే జబ్బు వల్ల పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇంకొందరు రోజువారీ ఒత్తిడుల వల్ల నిద్రలో తమకు తెలియకుండానే పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. కారణం ఏదైనా... అదేపనిగా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు అరుగుతుండటం తప్పనిసరి.
 అధిగమించడం ఇలా: ఈ అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునే రిలాక్సేషన్ టెక్నిక్స్, ధాన్యం అలవరచుకోవడం అవసరం.
 
పళ్లకు చుట్టుకుపోతాయి...ఆరోగ్యాన్ని పట్టుకుపోతాయి
 కొన్ని చాక్లెట్లు రుచిగా ఉంటాయి. కానీ పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అప్పుడవి చక్కెరను చాలాసేపు పంటిపై అంటిపెట్టుకునే ఉండేలా చేస్తాయి. దాంతో ఎనామిల్‌పై రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశం ఎక్కువ. దాంతో పిప్పిపళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఫలితంగా  దంతాలు చాలా త్వరగా దెబ్బతింటాయి.
 అధిగమించడం ఇలా: పంటిని చుట్టుకుపోయే చాక్లెట్లు, క్యాండీలు కాకుండా జిగురు తక్కువగా ఉండే వాటినే తినండి. ఒకవేళ వాటినే తినాల్సి వస్తే వెంటనే వేలితో జిగురు ఊడిపోయేలా నోరు శుభ్రం చేసుకోండి.
 
సోడా... బీడా...  రెండూ బ్యాడే!!
 కొందరు కడుపులో కాస్త ఉపశమనం కోసం సోడా తాగేస్తుంటారు. మరికొందరు పాన్ అలవాటుతో ఆకులు నమిలేస్తూ ఉంటారు. సోడాలో పదకొండు టీస్పూన్ల చక్కెర ఉంటుంది. అందులోని ఫాస్ఫారిక్ యాసిడ్ ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఇక పాన్‌బీడా తినేవాళ్ల పళ్ల గార వాళ్లకా అలవాటు ఉందని పట్టించేస్తుంది.
 అధిగమించడం ఇలా: సోడా,  బీడా... అలవాట్లను వెంటనే మానేయాల్సిందే.
 
‘ఐస్’సీ... ఇది చెడ్డ అలవాటా!?
 ఇటీవల బర్గరో, పఫ్ఫో తిన్న తర్వాత ఓ కూల్‌డ్రింక్ ఆర్డర్ ఇవ్వడం పరిపాటి. ఆ డ్రింకును కూల్‌గా ఉంచడం కోసం అందులో ఐస్‌గడ్డలు వేసి మరీ ఇస్తుంటారు రెస్టరెంట్లవాళ్లు. ఆ గడ్డల్ని నములుతూ ఆనందిస్తారు కొందరు. మరి ఇంకొందరైతే  ఐస్‌ఫ్రూట్‌ను చప్పరించకుండానే నమిలి తినేస్తుంటారు. కొందరు ఆటగాళ్లు పళ్లు దెబ్బతినకుండా పళ్ల మధ్య ఐస్ గడ్డలను పెట్టుకుని ఆటలాడుతుంటారు. ఆ టైమ్‌లో వాళ్లూ ఐస్ కొరుకుతూ ఉంటారు.
 అధిగమించడం ఇలా: అందుకే... ఐస్‌ఫ్రూట్ కొన్నా, ఐస్‌క్యాండీ తిన్నా ఐస్‌ను నమలకండి. ఐస్ పళ్లకు తగలకుండా జాగ్రత్త తీసుకోండి. ఆటగాళ్లు పళ్ల రక్షణ కోసం మౌత్‌గార్డ్‌నే వాడాలి. ఐస్‌ని కాదు.
 
స్పోర్ట్స్‌డ్రింక్స్... ఒంటికి హాయి!.. మరి పంటికి?
 స్పోర్ట్స్ డ్రింక్ తాగాక చాలా హాయిగా ఉంటుంది. ఒంటికి హాయి సరే... మరి పంటి మాటేమిటి? వాటి ఆరోగ్యాన్నీ చూడాలి కదా. స్పోర్ట్స్ డ్రింక్స్‌లో, జ్యూసుల్లో ఉండే చక్కెర పళ్లకు తగులుతున్న కొద్దీ దంతక్షయం పెరుగుతుంది.
అధిగమించడం ఇలా: చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తక్కువ తాగండి. తాగాక  నోరు కడుక్కోండి.
 
నాలుకకు గాటు...నోటికి చేటు
 కొందరిప్పుడు చెవులకు లాగే నాలుకకూ స్టడ్ అలంకరించుకుంటున్నారు. మరికొందరు పెదవులకూ రింగ్స్ పెట్టుకుంటున్నారు. ఈ విపరీత ఫ్యాషన్ నోటి ఆరోగ్యానికి చేటు. పలువరసకూ తేలిగ్గా ఇన్ఫెక్షన్ తెచ్చిపెట్టగలదు.
 అధిగమించడం ఇలా: ఈ ఫ్యాషన్‌ను అనుసరించకూడదు. ఈ ఫ్యాషన్ ఒక్కోసారి ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెట్టగలదని గ్రహించండి.
 
గోళ్లు కొరికితే...పళ్లు దెబ్బతింటాయి...

 టెన్షన్ వల్ల కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.
 అధిగమించడం ఇలా: నిజంగానే గోళ్లు తొలగించుకోవాలనుకుంటే నెయిల్ కట్టర్‌నే వాడాలి. టెన్షన్ వల్ల ఈ అలవాటు వస్తే... రిలాక్సేషన్ టెక్నిక్స్‌తో ఒత్తిడి తగ్గించుకోవాలి.
 వేలు చీకడం మాన్పండి... ఎత్తుపళ్లను నివారించండి...
 చిన్న పిల్లల్లో వేలు చీకడం (థంబ్ సకింగ్) అనే అలవాటు ఎక్కువ. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని మాన్పించడం మంచిది. ఎందుకంటే అది ముందు పళ్లను ఎత్తుగా చేసి, పిల్లల అందాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్తులో ముందు పళ్ల మధ్య సందులు ఏర్పడవచ్చు.
 అధిగమించడం ఇలా... పిల్లల్లో వేలు చీకే అలవాటును వెంటనే మాన్పించాలి. ఒకవేళ పిల్లలు తమంతట తామే మానకపోతే దంతవైద్యులను సంప్రదించి, అప్లయన్స్‌ల సహాయంతో మాన్పవచ్చు.
 
బాటిల్‌తో బ్యాటిల్ చేసి... రాత్రి దూరం పెట్టండి
 కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులే ఎప్పుడూ బాటిల్‌ను పిల్లల నోటిలో ఉంచేస్తుంటారు. ఈ దురలవాటు వల్ల పిల్లలకు  ‘మిల్క్‌బాటిల్ కేరిస్’ అనే తరహా పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతింటాయి. పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి.
 అధిగమించడం ఇలా: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వవద్దు. పిల్లలకు పాలు పట్టించడానికి సీసా వాడకూడదు. గ్లాసు / స్పూన్ వాడాలి. పాలు తాగించిన వెంటనే బ్రష్ చేయించాలి. బ్రషింగ్ వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించాలి.
 
పళ్లు కుట్టుకోకండి... గ్యాప్స్ పెంచుకోకండి
 ఏదైనా తినగానే పళ్లల్లో చిక్కుకున్న ఆహారాన్ని తీయడానికి టూత్‌పిక్స్‌తో పళ్లు
 కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరుగుతాయి. దాంతో మరింత ఆహారం అక్కడ చిక్కుబడటం, బ్యాక్టీరియా పెరగడం పళ్లు మరింత వదులు కావడం జరుగుతాయి.
 అధిగమించడం ఇలా: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలి.
 
 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి

 
 డాక్టర్ ప్రత్యూష
 దంత వైద్య నిపుణులు,
 ప్రొఫెసర్, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ,
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్.

 

మరిన్ని వార్తలు