బెటర్ తల

28 May, 2016 06:33 IST|Sakshi
బెటర్ తల

దేవుడు సృష్టించింది  కొన్ని నాణ్యమైన తలలే!  తక్కినవాటిని జుట్టుతో కప్పేశాడు!

 

సినిమాలో ఒక జోక్:
డాక్టర్: రెండు నెలల్లో నీకు బట్టతల గ్యారంటీ. ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నావ్?
హీరో:  స్ట్రెస్ వల్ల డాక్టర్.
డాక్టర్: అవునా. స్ట్రెస్ ఎందుకు?
హీరో: జుట్టు రాలిపోతోందని...

    

ఆడవాళ్లు అనేక కారణాలకు స్పృహ తప్పుతారు. మగవాడు మాత్రం ఒకే ఒక కారణానికి కెవ్వుమంటాడు. అదేమిటో తెలుసా? అద్దంలో బట్టతల. దువ్వుకునేటప్పుడు వెంట్రుకలు రాలుతూ కనిపించినా నుదురు పైకి పాకుతూ కనిపించినా అందరికీ వెన్నులో చలి పుట్టొచ్చుగాని మగవాడికి మాత్రం మాడులో చలిపుడుతుంది. పుర్రె బయటపడుతుందేమోననే వెర్రి భయం పట్టుకుంటుంది.

 
అసలు కేశంకు కొంచెం ‘ల’ వత్తు తగిలిస్తే క్లేశం వస్తుంది. అంటే దేవుడు కేశంలోనే క్లేశం పెట్టాడన్న మాట. శివుడికి బట్టతల ఇష్యూ లేదు. ఆయనది చిక్కుముడుల తల. పైగా గంగమ్మ ఏసి ఒకటి రన్ అవుతూ ఉంటుంది. విష్ణుమూర్తికి హెయిర్‌లాస్ ప్రాబ్లమ్ ఉన్నట్టు లేదు. కిరీటాన్ని హెల్మెట్‌లా పెట్టుకున్నాక కూడా మనకు జులపాల జుట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఇక బ్రహ్మదేవునికి నాలుగు తలలతోపాటు నాలుగు గడ్డాల నిండుగా కూడా కేశాలు కళకళలాడుతూ ఉంటాయి. మరి ఈ ముగ్గురు దేవుళ్లకు లేని బాధ సగటు మగవాడికి ఎందుకు? బ్రహ్మ సృష్టించిన మగ ప్రాణికి ఎందుకు? ఒకవేళ ఇచ్చెనుపో... స్త్రీ జాతికి మగవాడి శిరోజాల మీదే దృష్టి పెట్టడం ఏలా? తరాల నుంచి వారికి మగవాడి ముఖం మీద కంటే తల మీద ఉన్న జుట్టు మీదే ఆసక్తి ఎక్కువ. ‘దీర్ఘ కేశములవాడు’... అని వారు మురిసిపోతారు. ‘నల్లని కురులవాడు’ అని మనసు పారేసుకుంటారు. ‘నీలాల ముంగురులవాడు’ అంటూ మఖ్మల్ పత్రం పై నెమలి ఈకతో లవ్ లెటర్ రాస్తారు.

 
ఏం జుట్టు లేనివాడు మనిషి కాడా? జుట్టున్న నాగార్జున మాత్రమేనా మన్మథుడు? ఇలా ఎవరు నిలదీయాలి? ఈ లోకం కళ్లు ఎవరు తెరిపించాలి? అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ప్చ్. బట్టతల ఉంది. కేన్సిల్. ఎన్.ఆర్.ఐ... అమెరికాలో పెద్ద ఉద్యోగం. నో. పైన ఎకరం పోయింది.  కేన్సిల్. బాగా వెనకేసుకున్నాడు.... బోనస్‌గా అత్తమామలు ఆడపడుచులు కూడా లేరు. నెవర్. ట్వంటీ ట్వంటీ మేచ్ ఆడటానికి సరిపడా గ్రౌండ్ ఉంది నెత్తి మీద కేన్సిల్. గవర్నమెంట్‌లో పెద్ద ఆఫీసర్. నోనో... ఆ ఓపెన్ టాప్‌వాడు సెల్ఫీకి పనికిరాడు... కేన్సిల్. ఇంతకీ ఏంటంటావ్. ఎవరినైనా తేండి... కాని నెత్తి మీద జుట్టున్నవాణ్ణి తేండి.

 
ఇలా మాట్లాడేవాళ్ల మీద పరువు నష్టం దావా వేసే చట్టం ఎందుకు రాదు? దీని కోసం ఓపిక చేసుకుని అన్నా హజారే కాని ఓపిక లేకపోయినా అరవింద్ కేజ్రీవాల్‌గాని ఎందుకు పోరాటం చేయరు. బట్టతల ఉన్న సహోదరులారా... పోరాడండి... పోరాడితే పోయేదేమీ లేదు... మిగిలిన ఆ కాస్తంత జుట్టు తప్ప.

     

మగవాడు పుట్టింది దేని మీదైనా సరే కాలు దువ్వడానికి కాని జుట్టు దువ్వడానికి కాదు. జుట్టు ఉన్నా పౌరుషమే. జుట్టు లేకపోయినా పౌరుషమే. అసలు బట్టతల వల్లే ఈ సమాజం నడుస్తోందని రూఢీగా చెప్పవచ్చును. సమాజం నడవాలంటే మేధావులు కావాలి. మేధావులుగా ఎవరైనా మారాలంటే వారికి బట్టతల రావాలి. అందుకే అన్నారు పెద్దలు ‘బట్టతలవాడు బ్రహ్మవిద్యలు నేర్చున్’ అని. బట్టతల వాళ్లకు ఉన్న అడ్వాంటేజెస్ ఎవరికి ఉన్నాయి. బార్బర్ ఖర్చు లేదు. తలస్నానానికి షాంపు ఖర్చు లేదు. జేబులో దువ్వెన ఖర్చు లేదు. పేల భయం లేదు. ఇన్నేలా? చాలామంది మగవాళ్లు తమ జుట్టును తీసుకెళ్లి భార్య చేతిలో పెడతారు. కాని బట్టతల ఉన్నవాళ్లు  ఆత్మాభిమానం కలిగిన భర్తల్లా నిర్భీతితో మెలుగుతారు. బట్టతల కలిగినవారు నిస్వార్థపరులు. ఈ సంగతి ఉదాహరణతో సహా నిరూపించవచ్చు. చరిత్రలో ఎంతోమంది బట్టతల సైంటిస్ట్‌లు ఉన్నారు. వాళ్లంతా మానవ కల్యాణం కోసం ఆవిష్కరణలు చేశారే తప్పితే తమ బట్టతల మీద జుట్టు మొలిపించే ప్రయోగాలకు పోలేదు. థామస్ ఆల్వా ఎడిసన్‌కు సంపూర్ణ బట్టతల. కాని అతడు తన బుర్రలో వెలిగిన ఐడియాను బయట బల్బ్‌లా వెలిగించాడు కాని తలుచుకుంటే బట్టతల మీద బొచ్చు మొలిపించుకోలేక కాదు. ఆ సంగతి చేతకాకా కాదు. వద్దనుకున్నాడంతే.

     

ఇక చాలు. బట్టతల ఉన్నందుకు సమాజం మగవాణ్ణి వెంటాడింది చాలు. యుగాలుగా మగవాడు సమాజానికి భయపడి తన బట్టతలను దాచుకున్నాడు. కిరీటాలు పెట్టాడు. తల పాగాలు చుట్టాడు. టోపీలు ధరించాడు. తల గుడ్డ కట్టాడు. స్కార్ఫ్‌ల్లో తలను దాచుకున్నాడు. కాని ఇక అక్కర్లేదు. నా బట్టతలే నా అందం. నా బట్టతలే నా సంస్కారం. నా బట్టతలే నా గౌరవం. నా బట్టతలే నా ఆభరణం అని ఇప్పుడు బట్టతలను ఓన్ చేసుకుంటున్నాడు. అసలు ఏకంగా బట్టతల చుట్టూ ఉన్న ఇతర వెంట్రుకలను కూడా తొలగించి బోడి గుండుతో తిరుగుతూ అదే ఫ్యాషన్‌గా నిరూపించుకోగలుగుతున్నాడు. 20 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లు బట్టతలతో లేదా బోడి గుండుతో కనిపించడం వారి శారీరక దృఢత్వానికి ఒక సంకేతంగా భావిస్తున్న రోజులు వచ్చాయి. స్త్రీలు, సమాజం మంచి వయసులో ఉండి బోడి గుండుతో తిరుగుతున్నవారిని దృఢమైనవారిగా గుర్తిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయిదు పదేళ్ల క్రితం అయితే ఇలా కనిపించేవారిని చూసి నవ్వడం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు నవ్వు స్థానంలో యాక్సెప్టెన్స్ వచ్చింది.

     

సక్సెస్‌ను మించిన ఆకర్షణ లేదు. మగవాడు తాను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయితే అది అతడి నిజమైన బాహ్య ఆకర్షణ అయ్యే రోజులు వచ్చాయి. కనుక మగవాడు ఇప్పుడు బట్టతల బెంగను క్రమంగా వదిలించుకుంటున్నాడు. తనను ‘దానితో పాటు’గా అంగీకరించే స్థితికి సమాజాన్ని తీసుకువెళుతున్నాడు. తలంపు ముఖ్యం. తల కాదు. బట్టతల తలెత్తుకుని తిరుగుతున్న రోజులను స్వాగతిద్దాం.

 - శశి వెన్నిరాడై

 

 
మహామహులు...

తమ బట్టతలను లెక్క చేయకుండా మహామహులుగా మన్ననలు అందుకున్నవారు ఎందరో చరిత్రలో ఉన్నారు. గాంధీగారు తన బట్టతలను దాచుకునే వారు కాదు. నెహ్రూగారి బట్టతలకు తెల్లటి టోపీయే అందం. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాస్ చంద్రబోస్ వీరికంతా బట్టతలే. హీరోల్లో గొప్పవారు కూడా బట్టతలను లెక్క చేయలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళ సూపర్‌స్టార్ ఎం.జి.ఆర్, కన్నడ రాజకుమార్... వీరందరూ బట్టతల ఉన్నా  ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఒక వెలుగు వెలిగినవారే. నటుడు రజనీకాంత్ ఇంత పెద్ద స్టార్‌గా ఉన్నా బట్టతలను దాచుకోరు. ధీరూభాయ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం ఎంత అనేదే జాతి చూసిందిగాని ఆయన బట్టతలను ఎవరూ ఒక వంకగా చూడలేదు. క్రికెట్‌లో సయ్యద్ కిర్మాణి చేసే స్టంప్ ఔట్స్ చూశారే తప్పితే రౌండ్ క్యాప్ కింద ఉన్న అతడి బట్టతలను కాదు. అవును... నాకు బట్టతల ఉంది... ఆ నాలుగు వెంట్రుకలు కూడా పక్కకు పారేసి హాయిగా గుండుతో ఉంటాను ఇది నా ఫ్యాషన్ స్టేట్‌మెంట్ అని దేశంలో ధైర్యంగా ప్రకటించింది దక్షిణాదిన చో రామస్వామి అయితే ఉత్తరాదిన సినీ దర్శకుడు రాకేష్ రోషన్. ఆ తర్వాత పాప్ గాయకుడు బాబా సెహెగల్, జర్నలిస్ట్ ప్రీతిష్ నంది, అనుపమ్ ఖేర్ తదితరులు గుండుతో కనిపించసాగారు. తెలుగులో హాస్యనటుడు ఏవిఎస్ కూడా పూర్తి గుండునే తన మార్క్‌గా చేసుకున్నారు. సంగీత దర్శకుడు రమణ గోగుల దానిని కొనసాగిస్తున్నారు. కంప్యూటర్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ గాని నేటి ఆదర్శం సత్య నాదేళ్ల కాని తమ బట్టతలలను దాచుకోలేదు. వీరంతా జుట్టు లేనివారి జట్టు. బట్టతలకే జై కొట్టు.

 

రహస్య బట్టతలలు....
అందరూ రజనీకాంత్‌లు కాలేరు. స్క్రీన్ మీద మేకప్ బయట అక్కర్లేదు అనుకోలేరు. అదేం తప్పు కాదు. ఎవరి ఇష్టాయిఇష్టాలు వారివి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వచ్చాక బాలీవుడ్‌లో చాలామంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారని అంటారు. అమితాబ్ ఈ విషయంలో తొలి వరుసలో ఉంటారు. సల్మాన్‌ఖాన్, గోవింద, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా, సన్ని డియోల్, హాస్య నటుడు జావేద్ జాఫ్రీ, సంగీత దర్శకుడు అనూమలిక్... ఇలా ఈ పట్టిక అనంతం.

మరిన్ని వార్తలు