బుల్లి స్టిక్కర్‌తో  భలే ఉపయోగాలు...

20 Oct, 2018 00:08 IST|Sakshi

గుండెకు ఆపరేషన్‌ అయినవారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలంటారు డాక్టర్లు. కొంచెం వేగంగా నడిచినా, అవసరానికి మించి ఆహారం తీసుకున్నా సమస్యలొచ్చి.. ప్రాణాలు పోయే అవకాశం ఉండటం దీనికి కారణం. రక్తపోటు, గుండెకొట్టుకునే వేగం వంటి అన్ని వివరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే సమస్య వస్తుందనిపించినప్పుడు తగిన చర్యలు తీసుకోవచ్చు. అయితే ఇప్పటివరకూ ఇందుకు తగిన మార్గం లేకపోయింది. ఈ నేపథ్యంలో పర్‌డ్యూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఓ స్టిక్కర్‌ (ఫొటోలో ఉన్నది) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కాగితం టేపుతో తయారైన ఈ స్టిక్కర్‌ను మణికట్టు వద్ద అతికించుకుంటే చాలు, మన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని అంటున్నారు రామేస్‌ మార్టినెజ్‌. వ్యాయామం చేస్తున్నా, ఈత కొడుతున్నా కూడా ఈ స్టిక్కర్‌ చెక్కుచెదరకుండా ఉంటుంది. బ్యాక్టీరియా దరిచేరకుండా కూడా జాగ్రత్త తీసుకోవచ్చు. ఒక్కో స్టిక్కర్‌ ఖరీదు నాలుగు రూపాయలకు మించదు. ఇది కేవలం గుండెజబ్బులు ఉన్న వారికి ఉపయోపగడటమే కాకుండా.. భవిష్యత్తులో రోగ నిర్ధారణ పరీక్షలకూ చవకైన విధానంగా మారగలదని మార్టినెజ్‌ అంటున్నారు. 
 

మరిన్ని వార్తలు