బలిపీఠం నుంచి భాగవతం దాకా

14 Aug, 2017 01:39 IST|Sakshi
బలిపీఠం నుంచి భాగవతం దాకా

1969వ సంవత్సరానికి కాస్త అటో యిటో ‘బలిపీఠం’ చదివాను. రంగనాయకమ్మ రచన. ఒక నవలలోని ఇతివృత్తం ఉదాత్తంగా వుండాలనీ, పాత్రలు సమాజంలోంచి రావాలనీ, సంభాషణలు సహజంగా వుండాలనీ, శిల్ప సంయోజనం కళాత్మకంగా వుండాలనీ... యింకా యిటువంటి పెద్దపెద్ద మాటలు తెలియని వయస్సు నాది.

 

అప్పటికి నాకు పదమూడేళ్ళే! అయితేనేం...  భాస్కర్‌ను పెళ్ళి చేసుకోవాలని ఆశించిన తారలోని భంగపాటూ, హరిజనుడూ ఆదర్శ యువకుడూ అయిన భాస్కర్‌ బ్రాహ్మణ బాల వితంతువైన అరుణను వివాహం చేసుకొని పడిన బాధలూ, నవల చివరలో అరుణ తన అవసాన దశలో పశ్చాత్తాçపపడుతూ భాస్కర్‌తో మాట్లాడిన మాటలూ నన్ను కళ్ళనీళ్ళ పర్యంతం చేశాయి. నా పఠన ప్రస్థానంలో చిన్నతనంలోనే బలంగా నాటుకున్న స్మృతి శకలం అది.

1977 వచ్చేసింది ఎమర్జెన్సీ పీడ తొలగిపోయింది. కరీంనగర్‌లో కల్లోలంగా ఉంది. అప్పటికి నాకు ఇరవై ఏళ్ళు. ఉడుకు నెత్తురు ఉరకలేస్తున్న ప్రాయం. ‘మహాప్రస్థానం’ కంటబడింది. నేను వెంటపడ్డాను. అది నా ఒంటపట్టింది. మంచి కండపుష్టి కలిగిన ఆ కవిత్వం దాదాపు కంఠతాపాఠమైంది. శ్రీశ్రీ సామాన్యుణ్ణి సాహిత్యంలో మాన్యుణ్ణి చేశాడు. కష్టజీవులు ఇష్టజీవులయ్యారు. కర్మవీరులు ధర్మ ధీరులయ్యారు. ‘కవితా ఓ కవితా’ చదివి కదిలిపోయాను. మా తరాన్ని ఒక ఊపు ఊపి, కొత్త చూపు నిచ్చి, ఓ రకం కైపులో ముంచి, ప్రజల వైపు నిలబెట్టిన మహాప్రస్థాన స్థానం తెలుగు సాహిత్యంలోనే నిరుపమానం.

ఆ తర్వాత తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’ చదివాను. ఆ రాత్రికి జడవలేదు. అమృతంలో తడిసాను. ఆ అమృతం వల్ల మరణాన్ని జయించామో లేదో కాని అద్భుతమైన కవిత్వ పఠనంతో జీవించనైతే జీవించాము. ‘ఆర్తగీతం’ చదివి నా కార్జాలు కాలిపోయినై. గుండెలు కూలిపోయినై. 1956 నాటి పరిస్థితుల్లో పెద్దగా యిప్పటికీ మార్పులు లేకపోవటం పెద్ద విషాదం.  తిలక్‌ వల్ల కవిత్వం ఒక ఆల్కెమీ అని తెలిసింది. కవితకు అభ్యుదయ కాంక్ష వున్న వస్తువే కాదు, కళాత్మకమైన శైలీ రమ్యత కూడా అవసరం అన్న అవగాహన కలిగింది.

1995 వచ్చింది. పరిస్థితులు మారినై. ప్రపంచీకరణ దుష్ప్రభావం మొదలైంది. అస్తిత్వవాద ఛాయలు సాహిత్యంలో కనిపించినై. సమాజంలో ఆ అస్తిత్వ పరివేదనలో భాగంగా తెలంగాణ ఉద్యమం మొదలవుతున్నది. తెలంగాణ కవుల్ని ఒక ప్రత్యేకమైన అభినివేశంతో చదవాలన్న తపన పెరిగింది. పోతన్న దగ్గరికి పోయాను. అతను బాగవ్రతం చేసి రాసిన భాగవతం ఎనిమిది స్కంధాలూ చదివాను. అతని భక్త్యావేశ పారమ్యానికి పరవశుణ్ణి అయ్యాను. కవిత్వమే కాదు, కవుల వ్యక్తిత్వాలూ ఉన్నతంగా వుండాలన్న నా అభిమతానికి అతి దగ్గరగా పోతన కన్పించాడు.  పోతన భావజాలంతో నాకు పూర్తిగా ఏకీభావం లేకున్నా ఆ కవిత్వంలోని నిమగ్నత నన్ను ముగ్ధుణ్ని చేసింది. ఇప్పటికి భాగవతాన్ని మూడుసార్లు చదివాను. మిల్టన్‌ ‘పారడైజ్‌ లాస్ట్‌’లోని ఉదాత్త శైలి పోతన్నలో కనిపించింది.

ఇక ఆ తరువాత ‘మట్టి మనిషి’ దగ్గరికి వెళ్ళాను. వాసిరెడ్డి సీతాదేవి నవల. గొప్ప రచన. మట్టిలో మట్టిగా మారి నేలలోంచి రత్నాల రాశులు తీస్తున్న సాంబయ్య కనిపించాడు. అతని కొడుకు కోడలు వరూధిని వల్ల పట్నం వెళ్ళాడు. పట్టణ ప్రలోభంలో మాయలో వరూధిని గల్లంతైంది. చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త వెంకటపతిదీ అదే దుర్గతి. వాళ్లకో కొడుకు. వాడు పల్లెలో వున్న తాతను ఆశ్రయించాడు. ఆద్యంతం మలుపులతో, ఆసక్తికరమైన కథనంతో, దున్నేవాడిదే భూమి అంటూ, తుపాకితోనైనా దాన్ని సాధిస్తానని రవి నోట పలికించిన మాటలు నవలకు మంచి ముక్తాయింపునిచ్చాయి.

తెలుగు సాహిత్యానికి మాత్రమే పరిమితమై ఆలోచించినప్పుడు ఈ ఐదు పుస్తకాలూ నాకు బాగా నచ్చిన పుస్తకాలు ఆయా సన్నివేశాల్లో.
డా‘‘ నలిమెల భాస్కర్‌
9704374081

మరిన్ని వార్తలు