ఆర్ట్‌ బై మహిళ

21 Nov, 2019 00:04 IST|Sakshi
అమెరికన్‌ మహిళా పెయింటర్‌ యామీ షెరాల్డ్‌ పెయింటింగ్‌ ‘ప్లేన్స్‌ రాకెట్స్‌ స్పేసెస్‌ ఇన్‌ బిట్వీన్‌’

దిద్దుబాటు

1914లో ‘బాల్టిమోర్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌’ ప్రారంభం అయిన రెండేళ్ల తర్వాత, తొలిసారిగా ఒక మహిళ గీసిన తైల వర్ణ చిత్రాన్ని మ్యూజియం కొనుగోలు చేసింది. అమెరికన్‌ పోర్ట్రెయిట్‌ పెయింటర్‌ శారా మిరియా పీలే వేసిన పెయింటింగ్‌ అది. నాటి నుంచి నేటికి నూరేళ్లకు పైగా గడిచిపోయాయి. లెక్కేస్తే ఇప్పుడు మ్యూజియంలో 95 వేల కళాఖండాలు ఉన్నాయి. అయితే వాటిలో మహిళలు గీసిన చిత్రాలు కేవలం నాలుగు శాతం మాత్రమే!! ఏమిటి ఇంత అంతరం?! కనీసం సగమైనా లేవు. సగంలో సగమైనా లేవు. ఆ సంగతిని మ్యూజియం దృష్టికి ఎవరు తెచ్చారో, తనకై తను గ్రహించిందో కానీ.. మ్యూజియం ఇప్పుడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసమానత్వాన్ని తొలగించాలనుకుంది.

2020లో ఏడాది మొత్తం కేవలం మహిళలు గీసిన చిత్రాలనే కొనుగోలు చేయాలని తీర్మానించుకుంది! ప్రాచీన తైల వర్ణ చిత్రాలు అపురూపమైనవి, అమూల్యమైనవి. వాటి వెల కూడా ఆ స్థాయిలోనే ఉంటుం ది. మరి అంత డబ్బు మ్యూజియంకి ఎలా? ప్రభుత్వాలు ఇవ్వవు. తనే సమకూర్చుకోవాలి. అందుకే మ్యూజియంలో ఉన్న ప్రసిద్ధ పురుష చిత్రకారుల విలువైన పెయింటింగ్‌లను విక్రయించి, అలా వచ్చిన డబ్బుతో మహిళా చిత్రకారుల ఆర్ట్‌పీస్‌లను కొనబోతోంది! ఇదొక్కటే కాదు. ఏడాది పొడవునా మ్యూజి యం నిర్వహించే 22 ప్రదర్శనలకూ కేవలం మహిళా ఆర్టిస్టులు గీసిన చిత్రాలనే ఆహ్వానించబోతోంది.

‘‘జరిగిన తప్పును సరిదిద్దుకోడానికే ఈ ప్రయత్నమంతా’’ అని మ్యూజియం డైరెక్టర్‌ క్రిస్టఫర్‌ బెడ్‌ఫోర్డ్‌ అంటున్నారు. మ్యూజియంలో వేలాడగట్టి ఉన్న పురుష చిత్రకారుడు మార్క్‌ రాథో పెయింటింగ్‌ పక్కన ఓ చిత్రకారిణి గీసిన చిత్రాన్ని తీసుకొచ్చి తగిలిస్తే తొలగిపోయే వ్యత్యాసం కాదది.. కొంచెం గట్టిగా, నిజాయితీగా, త్వరితంగా ప్రయత్నించ వలసిన విషయం అని కూడా ఆయన అన్నారు. స్త్రీ, పురుష చిత్రకారులకు ఇచ్చే ప్రాముఖ్యంలోని వివక్షను తొలగించడానికి రూపొందించుకున్న ఈ ‘ఉమెన్‌ 2020’ కార్యాచరణలో భాగంగా వచ్చే ఏడాది 20 లక్షల డాలర్లతో మహిళా ఆర్టిస్టులు గీసిన చిత్రాలను కొనుగోలు చేయాలని మ్యూజియం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు