వెదురు చక్రం కరోనా హీరో

2 Jun, 2020 09:16 IST|Sakshi

కోవిడ్‌తో ప్రపంచం యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధానికి సాధనాలుగా, ఆయుధాలుగా కొత్త ఆవిష్కరణలెన్నో పుట్టుకొస్తున్నాయి. అలాంటిదే ఈ వెదురు ఫర్నిచర్‌. హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న వాళ్ల కోసం ఇది బాగా పని కొస్తుందని ఈశాన్య రాష్ట్రాల హాస్పిటళ్లు ఈ ఫర్నిచర్‌ మీద ఆసక్తి చూపిస్తున్నాయి. వెదురు మంచం, వీల్‌ చెయిర్, కంప్యూటర్‌ టేబుల్, రైటింగ్‌ టేబుల్, ఐవీ ఫ్లూయిడ్స్‌ స్టాండ్‌... మొదలైన వస్తువులను వెదురుతో చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్‌కు అవసరమైన ఫర్నిచర్‌ అంతటినీ వెదురుతోనే చేస్తున్నారు. ఒక పేషెంట్‌కు వాడిన వస్తువులను మరొకరికి వాడాల్సిన పని ఉండదు. ఒకసారి వాడిన తర్వాత వీటిని కాల్చేయవచ్చు. ఈ ఫర్నిచర్‌ రూపకర్త ఓ ప్రొఫెసర్‌. పేరు రవి మోకాశి పూనేకార్‌. అతడు గువాహటిలో ఐఐటీలో ప్రొఫెసర్‌.

పదేళ్ల నాటి ప్రయోగం
ఈశాన్య రాష్ట్రాల్లో 140 రకాల వెదురు చెట్లు పెరుగుతాయి. చాలా త్వరగా పెరిగే జాతులున్నాయి. నరికిన కొద్దీ పక్కన పిలకలు వేస్తూ పెరుగుతాయి. కాబట్టి సహజ వనరులను వృథా చేయడమనేది ఉండదు. వెదురు కలపతో పేషెంట్లకు అవసరమైన ఫర్నిచర్‌ను తయారు చేయడం ద్వారా పర్యావరణ హితమైన వస్తువులను వాడడం, ఒకసారి వాడిన వాటిని మరొకరికి వాడకుండా శుభ్రత పాటించడం సాధ్యమవుతుంది... అన్నారు రవి మోకాశి పూనేకార్‌. నిజానికి అతడు పదేళ్ల కిందట హాస్పిటళ్లలో వినియోగానికి ఇది మంచిదనే ఉద్దేశంతో వెదురు ఫర్నిచర్‌కు రూపకల్పన చేశాడు. వాటిని పరిశీలించిన నిపుణులు బాగా ఉపయోగపడతాయని, మంచి ప్రయత్నం అని ప్రశంసలైతే ఇచ్చారు. వాటిని హాస్పిటళ్ల కోసం తయారు చేయించుకోవడం మాత్రం జరగలేదు. ఇప్పుడు కోవిడ్‌ కష్టకాలంలో ఒకరికి వాడిన వస్తువులను మరొకరు వాడడానికి పేషెంట్‌లు ఏ మాత్రం ఇష్టపడకపోవడంతో హాస్పిటళ్లు, ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లు కూడా ఒకసారి వాడి కాల్చి పడేసే వెదురు ఫర్నిచరే బెస్ట్‌ అంటున్నారు. తన ఫార్ములా ఇప్పుడు ఉపయోగపడుతోందనే సంతోషం కంటే కోవిడ్‌ కారణంగా వడ్రంగులకు చేతి నిండా పని దొరుకుతోందని సంతోషిస్తున్నారు ప్రొఫెసర్‌.

మరిన్ని వార్తలు