పగుళ్లకు కాంప్లిమెంట్స్‌

12 Sep, 2019 01:10 IST|Sakshi

బ్యూటిప్స్‌

కవులకేం పన్లేదు. ఊరికే కూర్చొని కవితలు అల్లేస్తుంటారు. పాదాల్ని పద్మాలు అంటారు. తమలపాకులు అంటారు. అయినా పనీపాట ఉన్న స్త్రీల పాదాలు ‘పద్మాలంత సున్నితంగా, తమలపాకులంత కోమలంగా’ ఎలా ఉంటాయి చెప్పండి! కానీ కవుల భావుకతను మరీ అంత తీసిపడేయనక్కర్లేదు. ఒక ఆలోచనైతే కలిగించారు కదా.. పాదాలు మృదువుగా ఉంటే అందంగా ఉంటాయని! అలా అందంగా, శుభ్రంగా పాదాలను ఉంచుకోడానికి ప్రయత్నిస్తే పాపం కవుల కల్పనను గౌరవించినవాళ్లమూ అవుతాం, మనకూ కొన్ని కాంప్లిమెంట్స్‌ వస్తాయి. ఇప్పుడైతే పగుళ్ల పాదాలను చిన్న టిప్‌తో అందంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం.

ఏం చేయాలి?
బాగా పండిన అరటిపండ్లు రెండు తీసుకోండి. చక్కగా గుజ్జులా చెయ్యండి. కాస్త పచ్చిగా, పచ్చగా ఉన్న పండ్లయినా ఓకే అనుకోకండి. పూర్తిగా పండని అరటిపండ్లలో ఆసిడ్స్‌ ఉంటాయి. అవి చర్మంతో దురుసుగా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు ఆ పండిన అరటిపండ్ల గుజ్జును మెల్లిగా పాదమంతా రుద్దండి. కాలి వేళ్లు, వేళ్ల సందులకు కూడా గుజ్జును చేర్చి, చిన్న మసాజ్‌లాంటిది ఇవ్వండి. అలా రెండు పాదాలకూ రాసి, 20 నిముషాల పాటు అలాగే ఉంచేయండి. 20 నిముషాల తర్వాత శుభ్రమైన నీటితో (చల్లనివి గానీ, గోరు వెచ్చనివి గానీ) కడిగేయండి.

ఎన్నిసార్లు ?
పడుకోబోయే ముందు ప్రతి రోజూ చెయ్యాలి. అలా కనీసం రెండు వారాలు లేదా ఫలితాలతో మీరు సంతృప్తి చెందేవరకు చెయ్యాలి.

చేస్తే ఏమౌతుంది?
అరటిపండు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌. అంటే చర్మాన్ని తేమగా ఉంచే స్వభావం గలది. అరటిపండులో ఉండే విటమిన్‌ ఎ, బి6, సి లలో చర్మాన్ని మెత్తబరిచి, పొడిబారకుండా ఉంచే గుణాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి పాదాలను మృదువుగా మార్చేస్తాయి. మడమల పగుళ్లకు ఇది తిరుగులేని మంత్రం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా