భవిత బంగారమేనా!

30 May, 2014 22:43 IST|Sakshi
భవిత బంగారమేనా!

జాతీయ క్రీడారంగంపై గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ (ఏపీ) రాష్ట్రం తనదైన ముద్ర వేసింది. ఇక్కడి ఆటగాళ్లు అనేక మంది అంతర్జాతీయస్థాయి స్టార్లుగా ఎదగగా... జట్టుగా కూడా ఏపీ వేర్వేరు క్రీడల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. జూనియర్ స్థాయిలోనూ, ఆ తర్వాత సీనియర్ విభాగాల్లోనూ మన తెలుగు తేజాలు సత్తా చాటి వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా 2002లో జాతీయ క్రీడలు, 2003లో ఆఫ్రో ఆసియా క్రీడల నిర్వహణ తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా క్రీడా సంస్కృతి పెరిగింది. దానికి తోడు మౌలిక సౌకర్యాల అభివృద్ధి కూడా జరగడంతో పెద్ద సంఖ్యలో టోర్నీల నిర్వహణ జరిగింది. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులు దానిని ప్రదర్శించేందుకు తగిన వేదిక లభించింది. ముఖ్యంగా ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, చెస్, టేబుల్ టెన్నిస్‌లాంటి క్రీడాంశాల్లో మనోళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో క్రీడల పరిస్థితి, సౌకర్యాలు, ఆటగాళ్ల ప్రాతినిధ్యం ఎలా ఉండబోతోందని క్రీడావర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రీడల భవిష్యత్తుపై ఫోకస్...
 - మొహమ్మద్ అబ్దుల్  హాది
 
‘శాప్’లో విభజన

అవిభాజ్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) క్రీడలను పర్యవేక్షిస్తూ వచ్చింది. ఇకపై దీనిని కూడా రెండు భాగాలుగా చేయాల్సి ఉంది. అయితే కొత్త రాష్ట్రాల్లో విభజన జరుగుతుంది. శాఖల ప్రాధాన్యతను బట్టి చూస్తే కార్పొరేషన్ హోదా ఉన్న ‘శాప్’లో  వెంటనే పూర్తి స్థాయి విభజన జరగకపోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రీడా సామగ్రి, ఇతర వనరులను 58-42 నిష్పత్తిలో పంచుతున్నారు. ఇందులో ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో ఏడాది పట్టవచ్చు. ‘శాప్’ ప్రధాన కార్యాలయం లాల్‌బహదూర్ (ఎల్బీ) స్టేడియంలో ఉంది. దీనిని పూర్తిగా తెలంగాణకు కేటాయించాలని... స్టేడియంలోనే ఉన్న టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఏపీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కొత్త రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో ప్రస్తుతం బలహీనంగా ఉన్న, పెద్దగా ఆర్థిక పరిపుష్టి లేని ప్రభుత్వ సంస్థలను మరో సంస్థలోకి విలీనం చేస్తూ వస్తున్నారు. ‘శాప్’ కూడా ఇదే కోవలోకి చేరవచ్చని కూడా చెబుతున్నారు. ఇప్పటికే బడ్జెట్‌ను పంచుకుంటున్న యువజన వ్యవహారాల శాఖలోకి క్రీడలను చేర్చి ‘శాప్’ను పూర్తిగా రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే ఆ అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
     
బడ్జెట్
 
గత మూడు బడ్జెట్లలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోసం ఏడాదికి రూ. 22 కోట్లు కేటాయించింది. ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు పోను చాలా తక్కువ మొత్తం మాత్రమే నేరుగా క్రీడల అభివృద్ధికి ఉపయోగపడుతోంది. గతంలో జూనియర్ మొదలు సీనియర్ స్థాయి వరకు టోర్నీల నిర్వహణ కోసం ‘శాప్’ నిధులు అందజేసేది. అయితే రానురానూ పరిస్థితి ఇబ్బందికరంగా మారి నిర్వాహకులే టోర్నీ ఖర్చులు భరించాల్సి వచ్చింది. కేవలం తమ పరిధిలోని స్టేడియాలు, ఇతర క్రీడా మైదానాలను ఉచితంగా ఇవ్వడానికే ‘శాప్’ పరిమితమైంది. టోర్నీ ముగిశాక రీయింబర్స్‌మెంట్‌గా తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా... మూడేళ్ల పాటు నిర్వహించిన టోర్నీలకు  ఇటీవలే డబ్బులు రావడం పరిస్థితిని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల క్రీడల అభివృద్ధిపై దృష్టి పెట్టి, ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తేనే కాస్త మెరుగైన బడ్జెట్‌ను, ఎక్కువ నిధులను ఆశించవచ్చు.
     
మౌలిక సౌకర్యాలు

విభజన నేపథ్యంలో ప్రస్తుతం భౌగోళికంగా ఎక్కడ ఉన్న స్టేడియాలు, ఇతర మైదానాలు, క్రీడా అకాడమీలు అదే రాష్ట్రానికి కేటాయించాలని నిర్ణయించారు. హకీంపేటలో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్‌స్కూల్ (ఏపీఎస్‌ఎస్)కు ప్రత్యేక గుర్తింపు ఉండగా, ఇప్పుడు వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని స్పోర్ట్స్ స్కూల్‌కు కూడా అదే విధంగా స్వతంత్ర హోదా ఇవ్వడంతో ఇరు రాష్ట్రాలకు సమస్య లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఉన్న మైదానాలు, స్టేడియాల జాబితాను రెండు రకాలుగా విభజించారు. పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి క్రీడల నిర్వహణ కొనసాగుతున్నవి మొదటివి (బ్రౌన్ ఫీల్డ్) కాగా, నిర్మాణం పనులు ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతున్నవి (గ్రీన్ ఫీల్డ్) రెండో కోవకు వస్తాయి.
 
బ్రౌన్ ఫీల్డ్
 తెలంగాణ: 83 మైదానాలు
 ఆంధ్రప్రదేశ్: 60 మైదానాలు
 గ్రీన్ ఫీల్డ్
 తెలంగాణ: 60 మైదానాలు
 ఆంధ్రప్రదేశ్: 116 మైదానాలు
 
శిక్షణను కొనసాగించాలి
 
ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా ప్రధానంగా ఒక అంశంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ  జిల్లాల్లో స్టేడియాల వంటి మౌలిక సౌకర్యాలు ఎక్కువగా ఉంటే... ఆటగాళ్లు, ప్రదర్శన ఆధారంగా చూస్తే ఆంధ్ర ప్రాంతంలో ప్రతిభ, గుర్తింపు పొందిన ఆటగాళ్ల నిష్పత్తి ఎక్కువగా ఉంది. అయితే విభజన కారణంగా ఎక్కువ మంది క్రీడాకారులకు అవకాశం దక్కనుండటం పాజిటివ్ అంశంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక జాతీయ టోర్నీలో ఇప్పటివరకు రాష్ట్రం తరఫున 12 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కేది. ఇప్పుడు 24 మందికి లభిస్తుంది. అధికారికంగా పదేళ్లు రాజధాని అని ప్రకటించారు కాబట్టి సమన్వయంతో ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న సౌకర్యాలను శిక్షణ కోసం ఆంధ్ర ఆటగాళ్లు కూడా వినియోగించుకునే అవకాశం కల్పించాలి.
- కె.నర్సయ్య, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి
 
నియోజకవర్గానికి ఒక స్టేడియం!

గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక స్టేడియం ఉండాలని ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న నియోజకవర్గాలు కాకుండా ఇతర చోట్ల కొత్తగా మినీ స్టేడియాలు నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం రెండు బడ్జెట్లలో రూ. 200 కోట్ల చొప్పున కేటాయించింది. ప్రస్తుతం పని ప్రారంభమై, కొనసాగుతున్న లేదా ఆగిపోయిన (గ్రీన్ ఫీల్డ్) స్టేడియాలన్నీ ఇప్పుడు ఆ జాబితాలోనే ఉన్నాయి. కాబట్టి వీటిని కొనసాగించాలంటే, భవిష్యత్తు కోసం మైదానాలు సిద్ధం చేయాలంటే రెండు రాష్ట్రాలు క్రీడలకు ప్రాధాన్యత జాబితాలో చోటు కల్పించాలి. లేదంటే ఇన్ని మైదానాల నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయి, క్రీడాభివృద్ధికి అవరోధంగా మారే అవకాశం ఉంది. గతంలో రాష్ట్ర క్రీడారంగం ఎదుగుదలలో భాగమైన అంతర్జాతీయ స్థాయి స్టేడియాలన్నీ తెలంగాణ (రంగారెడ్డి జిల్లా)లోనే ఉండటం విశేషం. శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక స్టేడియం ఉండగా, విశాఖపట్నం జిల్లాలో ‘శాప్’కు సంబంధించిన ఒక్క స్టేడియం కూడా లేకపోవడం గమనార్హం. ఆ జిల్లాలో 12 ప్రాంతాల్లో మినీ స్టేడియాల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఒక్క స్టేడియం కూడా నిర్మాణంలో లేదు.
    
క్రీడా సంఘాల విభజన

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) పరిధిలో ఇన్నేళ్ల పాటు 46 క్రీడా సంఘాలు పని చేశాయి. వీటిలో 7 క్రీడాంశాల్లో మొదటి నుంచి హైదరాబాద్, ఆంధ్ర పేర్లతో వేర్వేరు అసోసియేషన్లు ఉన్నాయి. తాజాగా విభజన కారణంగా మిగిలిన 39 సంఘాలను కూడా రెండుగా విడగొడుతున్నారు. అన్నింటికీ వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో రెండు వేర్వేరు జట్లుగా బరిలోకి దిగడం మినహా అసోసియేషన్లపై విభజన ప్రభావం పెద్దగా ఉండదు.
    
ఆటగాళ్ల సంగతేమిటి?

సౌకర్యాలు, మైదానాల సంగతి సరే... అసలు క్రీడాకారులపై విభజన ప్రభావం ఏమైనా ఉంటుందా? ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయస్థాయి పోటీల్లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు క్రీడాకారులు ఇకపై ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారనేది ఆసక్తికరం. సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలో పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికే వేర్వేరు స్థాయిల్లో సత్తాచాటిన సీనియర్లకు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది.  చాలా మంది ఆటగాళ్లు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారైనా... హైదరాబాద్‌లోనే శిక్షణ పొందుతూ వచ్చారు. బ్యాడ్మింటన్, చెస్‌లో ఎక్కువ మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు జాతీయ స్థాయిలో పెట్రోలియం జట్లకే ఆడతారు కాబట్టి ఎలాంటి సమస్యా ఉండదు. మరికొన్ని రోజుల్లో కేరళలో జాతీయ క్రీడలు జరగనున్నాయి. అందులో రాష్ట్రాలకే ప్రాతినిధ్యం వహించాలి తప్ప పెట్రోలియంలాంటి సంస్థలకు ఆడటానికి ఉండదు. కాబట్టి ఆ క్రీడల్లో ఏ ఆటగాళ్లు ఏ రాష్ట్రం తరఫున ఆడనున్నారో స్పష్టంగా తేలిపోతుంది. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రీడా పాలసీ, ఇచ్చే ప్రోత్సాహకాలను బట్టి ఆటగాళ్లు రాష్ట్రాన్ని ఎంచుకోవచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
 
టీమ్ ఈవెంట్లకు దెబ్బ...

విభజన వల్ల నేరుగా ఆటపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. అయితే జిల్లాల పరిధి తగ్గడం వల్ల రాష్ట్ర ఒలింపిక్ సంఘాలు క్రీడల అభివృద్ధిపై మరింత ఫోకస్‌గా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ టోర్నీల నిర్వహణ సమయంలో ఆటగాళ్లకు తగిన సౌకర్యాలు కల్పించలేకపోయాం. ఇప్పుడు చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి పెట్టవచ్చు. అయితే జాతీయ స్థాయిలో ఏపీ టీమ్ చాలా ఈవెంట్లలో నిలకడగా టాప్-8 స్థానాల్లోనే ఉంటూ వస్తోంది. ఇప్పుడు రెండు జట్లుగా మారితే ఆటగాళ్లు విడిపోయి అలాంటి ఫలితాలు రాకపోవచ్చు. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన క్రీడా విధానాలు రూపొందిస్తే ఇరు రాష్ట్రాలూ క్రీడల్లో వెలగవచ్చు.
 - జగదీశ్వర్ యాదవ్, ఏపీ ఒలింపిక్ సంఘం కార్యదర్శి
 

మరిన్ని వార్తలు