నీటితో మసాజ్‌

21 Oct, 2019 01:49 IST|Sakshi

బాడీటిప్స్‌ / స్నానం

మనిషిని ఆరోగ్యంగా ఉంచే ప్రధానమైన దినచర్య స్నానం. రోజంతా వేడి, కాలుష్యం గల వాతావరణంలో ఉండే వాళ్లు రోజూ రెండుసార్లు స్నానం చేయడం తప్పనిసరి. అయితే స్నానం అంటే బకెట్‌లో ఉన్న నీటిని ఒంటి మీద కుమ్మరించుకోవడం కాదు. దేహమంతటినీ శుభ్రపరుస్తూ మర్దన చేయడమే స్నానం. మంచి స్నానం అంటే ఏమిటో తెలుసుకుందాం.

►స్నానానికి ఉపయోగించే నీరు మరీ వేడిగా ఉండకూడదు, చల్లగానూ ఉండకూడదు. గోరువెచ్చగా లేదా ఒంటికి హాయి కలిగించేటంత వేడి ఉండాలి. చర్మం మీద ఉండే సెబేషియస్‌ గ్రంథులు ఉత్తేజితమై చర్మసంరక్షణకు అవసరమైన నూనెలను స్రవించడానికి తగినంత వేడి మాత్రమే ఉండాలి. నీటి వేడి మరీ ఎక్కువైనా, మరీ తక్కువైనా చర్మం పొడిబారిపోతుంది.

►ఎక్స్‌ఫోలియేషన్‌ కోసం స్నానం చేసేటప్పుడు స్క్రబ్‌ వాడాలి. అయితే రోజూ స్క్రబ్‌ ఉపయోగిస్తే చర్మకణాలు దెబ్బతింటాయి కాబట్టి స్క్రబ్‌ వారానికి రెండుసార్లకు మించకూడదు. ఇందుకోసం మార్కెట్‌లో దొరికే రెడీమేడ్‌ స్క్రబ్‌లను వాడవచ్చు లేదా గరుకుగా ఉన్న సున్నిపిండిని వాడవచ్చు.

►వారంలో రెండుసార్లు ఒంటికి నూనె లేదా మీగడ రాసి మర్దన చేసి స్నానం చేయాలి. తగిన సమయం లేకపోతే కనీసం ఒక్కసారయినా అలా చేయాలి.

►ఒంటిని రుద్దేటప్పుడు మురికి త్వరగా వదలడం కోసం గోళ్లతో గీకకూడదు. అలాగే ఒంటికి సబ్బు పట్టించిన తరవాత వలయాకారపు స్ట్రోక్స్‌తో మర్దన చేస్తూ రుద్దాలి. ఇలా చేస్తే... స్నానంతో దేహం సేదదీరుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు