అందరి బతుకమ్మ

9 Oct, 2016 00:33 IST|Sakshi
కులమతాలకు అతీతంగా బతుకమ్మ సంబరాలలో పాలుపంచుకుంటున్న మహిళలు.

తెలంగాణ జనసామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతుకమ్మ. అంటే ‘జీవించు - బ్రతికించు’ అని అర్థం. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపిణిగా ఆరాధించి అటు శక్తితత్వాన్ని, ఇటు మాతృదేవతారాధనను వారు స్థిరీకరించారు. భట్టు నరసింహకవి రచించిన ఈ పాటే ఈ కథకు, బతుకమ్మ పేరుకు ఆధారంగా నిలిచింది.

‘ధరచోళదేశమున ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో
ఆ రాజు భార్యరో ఉయ్యాలో అతివ సత్యవతి ఉయ్యాలో’

ధర్మాంగదుడనే చోళరాజు, సత్యవతి దంపతులు ఎన్నో నోములు నోచి కుమారులను కన్నారు. కాని యుద్ధంలో ఏదో కారణంతో వారంతా చనిపోయారు. సత్యవతి పూజలకు సంతోషించిన లక్ష్మీదేవి తానే ఆమెకు కూతురుగా పుట్టిందట. ఆ బిడ్డను ఆశీర్వదించడానికి దేవాదిదేవతలు, మహర్షులు వచ్చి ...

‘బతుకగనె ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో శ్రీలక్ష్మీదేవియు ఉయ్యాలో సృష్టి బ్రతుకమ్మాయె ఉయ్యాలో...’ అని ఆమెకు ‘బతుకమ్మ’ అనే నామకరణం చేశారని ఈ జానపద గాథ తెలుపుతుంది.

‘శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశురాణివై
పరగలక్ష్మీవయ్యా గౌరమ్మ భార్యవైతివి హరికినీ గౌరమ్మ’

అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియజేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం.

మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు సాగే బతుకమ్మ ఆరాధన ఎంతో విశిష్టమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చే పూలు మళ్లీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడినుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి అన్న ఆధ్యాత్మ, తాత్విక సందేశం ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకదానిపై ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అయినట్లే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసిమెలిసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం కన్పిస్తుంది.

దుసరిచెట్టు తీగలతో అల్లిన శిబ్బి - శిబ్బెం లేదా తాంబాళంలో అడుగున గుమ్మడి, ఆనపు, మోదుగ వంటి పెద్ద ఆకులను ఉపయోగించి కింది పీఠంలా తయారుచేస్తారు. ఆ పీఠంపై వర్తులాకారంగా ఈ కాలంలో దొరికే గుమ్మడి, తంగెడి, గునుగు, గోరింట, గడ్డిపూలు, కలువ, కట్ల, బంతి, బీర, పొట్ల, రుద్రాక్ష, చేమంతి, నీలంకట్ల, పారిజాత, పొన్న, మందార, మల్లె, మొల్ల, గుల్మాల పూలతో మెట్లుమెట్లుగా పేర్చి అందంగా తీర్చిదిద్దుతారు. మొత్తం బతుకమ్మపైన పసుపుముద్దను గౌరీదేవిగా పై స్థానంలో నిల్పుతారు. ఈ మొత్తం దృశ్యం మేరుప్రస్థ శ్రీచక్రంలాగా ఉంటుంది.

మహాలయ అమావాస్య బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’, చిన్న బతుకమ్మ అని పిలుస్తారు. చివరిరోజైన సద్దుల బతుకమ్మకు ఐదు రకాల సద్దులు పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడితో నైవేద్యం చేసి సమర్పిస్తారు. రకరకాల బతుకమ్మ పాటలతో నృత్యగీతాలాపన కొనసాగుతుంది. ఆటలు పూర్తయ్యాక కొత్త సిబ్బి పాత సిబ్బి అంటూ సద్దులను పంచుకొని తింటారు.

 బతుకమ్మ ఉత్సవంలో ఆటపాటలకు చాలా ప్రాధాన్యం ఉంది. ‘బతుకమ్మ ఆట’ అని ఈ నృత్యానికి పేరు. గ్రామాల్లో ఏ ఉత్సవమైనా, ఏ ఊరేగింపు అయినా ‘బతుకమ్మ ఆట’ (నృత్యం) చేస్తూ ఆ సందర్భానికి అనుగుణంగా పాడుతారు. అంతగా చొచ్చుకుపోయింది ఈ ఆట - పాట. ఈ రోజున ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని ముగిస్తారు. శ్రీ మూర్తి అయిన అమ్మవారిని సాటి స్త్రీ మూర్తులే ఆరాధించే ఈ పండుగలో స్త్రీల కళా నైపుణ్యం, సహ జీవన తత్వం, ప్రకృతి తాదాత్మ్యం కన్పిస్తాయి. అందరినీ బతుకమనీ, అందరికీ బతుకునివ్వమనీ కోరుకొనే ఈ మహోత్సవాన్ని  అందరూ జరుపుకోవాలి. అప్పుడే అందరి బతుకమ్మ అవుతుంది. 
- డా॥పి. భాస్కరయోగి

విదేశీయులనూ అలరిస్తున్న బతుకమ్మ సాంస్కృతిక వైభవం

మరిన్ని వార్తలు