ఈ బ్యాటరీ స్పెషల్‌ గురూ..

12 Dec, 2017 00:45 IST|Sakshi

రోజూ వేసుకునే దుస్తులతోనే మన ఫోన్లు, ఇతర సూక్ష్మ ఎలక్ట్రానిక్‌ పరికరాలను చార్జ్‌ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది. అబ్బో! సూపర్‌! అంటున్నారా? నిజంగానే ఆ రోజులు దగ్గరపడ్డాయి. బర్మింగ్‌ హామ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త సోకేయిన్‌ ఛోయి అచ్చం ఇలాంటి వస్త్రాలనే అభివృద్ధి చేశారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ వస్త్రంపై నల్లటి డిజైన్‌ లాంటివి కనిపిస్తున్నాయి కదా... అవన్నీ ప్రత్యేకమైన మైక్రోబియల్‌ ఫ్యుయల్‌సెల్స్‌. మరోలా చెప్పాలంటే బ్యాటరీలు. శరీరంపై ఉండే బ్యాక్టీరియా సూడోమోనాస్‌ ఎరుగినోసాను వాడుకుంటూ ఈ బ్యాటరీ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మైక్రోబియల్‌ ఫ్యుయల్‌సెల్‌లను సులభంగా తయారు చేయడంతోపాటు వాటితోనే నూలు పోగుల్లాంటివి సృష్టించడం ద్వారా ఛోయి విద్యుత్తు ఉత్పత్తి చేసే వస్త్రాలను తయారు చేయగలిగారు.

ఒక చదరపు సెంటీమీటర్‌ విస్తీర్ణం ఉన్న ఫ్యుయల్‌ సెల్‌తో గరిష్టంగా 6.4 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని ఛోయి అంటున్నారు. ఈ బ్యాటరీలతో కూడిన దుస్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఛోయి గతంలో కాగితాలపై ఇలాంటి బ్యాటరీలను తయారుచేశారు. అంతేకాకుండా మడిచేసే కాగితం, పలుచటి అగ్గిపెట్టె, నక్షత్రాల ఆకారాల్లో కూడా ఈ ఫ్యుయల్‌సెల్స్‌ను తయారు చేసినా... వస్త్రంలోకి అమరిపోయేలా చేయడం మాత్రం ఇదే తొలిసారి. 

మరిన్ని వార్తలు