యుద్ధక్షేత్రంలో శాంతి సందేశం

8 May, 2014 22:19 IST|Sakshi
యుద్ధక్షేత్రంలో శాంతి సందేశం

సందర్భం- 14 న బుద్ధపూర్ణిమ
 
మానవుడు తన శక్తియుక్తుల్ని  సమసమాజాల కోసం, శాంతి సుఖాల కోసం వెచ్చించాలి అనే అహింసా సందేశాన్ని ఈ అవనికి అందించిన అజరామరుడు గౌతమబుద్ధుడు. బుద్ధుడు ఒక శాంతి ప్రదాతే కాదు! శాంతి దూత కూడా.
 
అహింస, శాంతి అనే మానవీయ విలువల్ని ప్రపంచానికి అందించిన దేశం మనది. సాటి మనుషుల్ని మనుషులుగా చూడడమొక్కటే ‘మానవీయం’ కాదని; సమస్త జీవకోటిని, చరాచర ప్రపంచాన్ని ప్రకృతినీ ప్రేమతో చూసినప్పుడే అది మానవీయత అవుతుందని ప్రపంచానికి చాటిన బుద్ధ భగవానుడు పుట్టిన పుణ్యభూమి ఇది.
 
సంపదల కోసం, అధికారం కోసం మానవ రక్తాన్ని ఏరుల్లా పాలించిన ఈ ప్రపంచానికి మనిషి మనిషిగా బ్రతకడానికి, ఈ సృష్టిలో ఒక ‘మంచి’ జీవిగా మనుగడ సాగించడానికి బుద్ధుడు ప్రబోధించిన శాంతి సందేశం ఒక వరం.
 
‘‘రణరక్తం కాని చోటు భూస్థలమంతా వెదకినా దొరకదు.. గతమంతా తడిసె రక్తమున.. కాకుంటే కన్నీరులతో....’’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఒక వ్యక్తి మరోవ్యక్తిని, ఒక జాతి మరో జాతిని, ఒక దేశం మరో దేశాన్ని... ఇలా చంపుకుతిన్న దాఖలాలు చరిత్ర నిండా ఉన్నాయి.
 
రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిల నరమేధం తర్వాత అణుబాంబు ఫార్ములా సృష్టికర్త అయిన ఐన్‌స్టీన్‌ని ఒక విలేకరి ఇలా అడిగాడు - ‘‘సర్, ఇప్పుడే ఇలా ఉంది. ఇక, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎంత వినాశనం జరుగుతుంది?’’ అని. దానికి ఐన్‌స్టీన్, ‘‘మూడో ప్రపంచ యుద్ధం సంగతి అయితే నాకు తెలియదు. నాలుగో ప్రపంచ యుద్ధాన్ని మాత్రం ఆటవిక మానవులు కర్రల్తో చేసుకుంటారు’’ అన్నాడు. అంటే ప్రపంచం యుద్ధో న్మాదంతో సర్వనాశనం అవుతుందని ఆయన ఉద్దేశం.
 
యుద్ధాలకి మానవుని పచ్చి ‘దురాశే’ కారణమని బుద్ధుని అభిప్రాయం. ‘ఆశ’ వల్లే మానవ జాతి దుఃఖసాగరంలో పడి మునిగి పోతోందనేది బుద్ధుని ఆలోచన.
 
ఈ ఆశ, దురాశలు దూరం చేసుకుంటే  సమాజంలో శాంతి జీవనం నెలకొంటుందని ఆయన ప్రబోధించాడు. ప్రజలు శాంతియుత జీవనం సాగించాలంటే పంచశీలతను పాటిస్తూ ‘అష్టాంగ మార్గం’ అవలంబించాలని సూచించాడు.
 
బుద్ధుడు గొప్ప ధర్మ ప్రవక్త. ఈర్ష్యలు, ద్వేషాలు, మోహాలు, మత్సరాలు, అహంకారాలు, అణచివేతలు లేని సమ సమాజం కోసం కుటుంబాన్ని, రాజ్యాన్నీ, రాజ్యాధికారాన్నీ, అన్నింటినీ త్యజించి, నలభై ఏళ్లపాటు కాలినడకన దేశం మొత్తం తిరిగి తన శాంతి సందేశాన్ని గ్రామ గ్రామాన వినిపించాడు.
 
బుద్ధుడు కేవలం బోధనలతో సరిపెట్టుకున్న ప్రవక్త మాత్రమే కాదు. అహింస, శాంతి, సమత నెలకొల్పడానికి అహరహం కృషి చేశాడు. ఎన్నో హింసల్ని నిలువరించాడు. ఎన్నో యుద్ధాల్ని జరక్కుండా చూశాడు. బుద్ధుడు స్వయంగా యుద్ధ క్షేత్రాల మధ్య నిలబడి అడ్డుకున్న యుద్ధాలూ ఉన్నాయి!
 
యుద్ధాలను నివారించాక గౌతముడు సర్వాన్నీ త్యజించి, ధ్యానం చేసి, జ్ఞానం పొంది, బుద్ధునిగా మారాడు. మరలా ఎనిమిదేళ్ల తర్వాత ఆ రెండు రాజ్యాల మధ్య అదే సమస్యలవల్ల యుద్ధం ఖాయం అయ్యింది. ఈ విషయం బుద్ధునికి తెలిసింది. అప్పుడు బుద్ధుడు రాజగృహలో ఉంటున్నాడు. విషయం తెలిసి హుటాహుటిన బయలు దేరాడు. అప్పటికే యుద్ధం మొదలైంది. ఇరు రాజ్యాల సైనికులు లుంబిని ప్రాంతంలో కలబడ్డారు. బుద్ధుడు నిస్సంకోచంగా యుద్ధ క్షేత్రం మధ్యలోకి వెళ్లి నిలబడ్డాడు. ఇరు సైనికుల్ని శాంతింప చేశాడు. ఆయనకి ఒక వైపు తన తండ్రి వంశం వారు. మరోవైపు తన తల్లి వంశం వారు. ఇరు గణనాయకుల్ని పిలిపించాడు.
 
‘‘ఓ! గణవీరులారా! మీరెందుకిలా చీటికి మాటికి యుద్ధానికి తలపడుతున్నారు. పెద్దలందరూ కూర్చొని, నీటి పంపక విషయంలో కొన్ని విధివిధానాలు ఏర్పాటు చేసుకోవచ్చుగదా! ఆ నియమాల్ని ఏ ఒక్కరూ అతిక్రమించకుండా నడచుకుంటే ఇరు రాజ్యాలు క్షేమంగా, శాంతంగా, సుఖంగా ఉంటాయి గదా! ఈ పని చేయకుండా నీటికోసం, రక్తాన్ని ధారపోస్తున్నారా? మీకు నీరు ముఖ్యమా! రక్తం ముఖ్యమా! మీ వీరత్వాన్ని ప్రజలందరూ సుఖంగా బ్రతకడం కోసం వినియోగించండి. ప్రకృతి కల్గించే ఇబ్బందుల పరిష్కారం కోసం  ఎంతో విలువైన మీ ప్రాణాల్ని, రక్తాన్నీ ధారపోయకండి.

రాజ్యాన్ని శోకజలంతో నింపకండి. శాంతించండి. శాంతి చర్చలు జరపండి. యుద్ధాన్ని ఆపండి. ఆయుధాలు పడేయండి. ఆనకట్టలు కట్టి వరద జలాన్ని వృధా చేయకుండా రక్షించుకోండి. మీ శక్తి యుక్తులు ‘నిర్మాణానికి’ ఉపయోగించండి. వినాశకానికీ, విధ్వంసానికీ కాదు-’’ అని గొప్ప సందేశం ఇచ్చాడు. శాంతి ఉపదేశం ప్రబోధించాడు. అదే విధంగా మగధరాజు అజాతశత్రువు, కోసలరాజు ప్రసిద్ధ జిత్తుల చేత ఎన్నో యుద్ధాల్ని ఆపించాడు.
 
ఈ ప్రపంచం అనవసరపు యుద్ధాల ద్వారా ఎన్నో కోట్ల మానవుల్ని బలి తీసుకుంది. అంటే ఎంత ‘మానవసంపద’ హరింపబడిందో కదా.
 
- బొర్రా గోవర్ధన్
 
బుద్ధుని వల్లే ఆ యుద్ధం ఆగిపోయింది!
 
బుద్ధుని కాలంలో మన దేశంలో పదహారు రాజ్యాలుండేవి. వీటిని షోడశ మహా జనపథాలు అనేవారు. వీటిలో చాలా రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు. కోసల, మగధలు మాత్రమే రాచరిక రాజ్యాలు. బుద్ధుడు శాక్యవంశం వాడు. బుద్ధుని తల్లి మాయాదేవి ‘కొలియ’ వంశం ఆడపడుచు. శాక్యులవీ, కొలియులవీ వేరు వేరు గణ రాజ్యాలు. ఈ రెండు రాజ్యాల మధ్యగా రోహిణి నది ప్రవహిస్తుంది. ఈ నదికి ఎగువన కొలియ రాజ్యం, దిగువన శాక్య రాజ్యం ఉండేవి. వర్షాలు బాగా పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ నీరంతా లోతట్టుకు ప్రవహించి శాక్యరాజ్యం వరదల పాలయ్యేది. అలాగే వర్షాభావం ఏర్పడినప్పుడు కొలియులు కిందికి నీరు రానిచ్చేవారు కాదు. దానితో శాక్యుల పంటపొలాలన్నీ ఎండిపోయేవి. ఈ విషయం మీద వాగ్వివాదాలు పెరిగి ఇరు రాజ్యాలకీ యుద్ధం వచ్చింది. ‘చర్చల’ ద్వారా పరిష్కరించుకునే ఈ సమస్యను యుద్ధందాకా లాక్కెళ్లడం బుద్ధునికి ఇష్టం లేదు. ఒక యువరాజుగా సైన్యాన్ని నడిపించాల్సిన వాడే యుద్ధాన్ని వ్యతిరేకించాడు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందా మన్నాడు. అలాగని, బుద్ధుడు పిరికివాడు కాదు. యుద్ధ కళలన్నింటిలో, అన్ని గణరాజ్యాల యువకులందరి కంటే మేటిగా నిలచిన వాడే! యుద్ధం వద్దన్న విషయంపై సొంత గణం వారు బుద్ధుణ్ణి ఎంతో నిందించారు. అయినా, ఆయన మనస్సు యుద్ధాన్ని వ్యతిరేకించింది. ఇంతలో వర్షాలు పడ్డాయి. దానితో యుద్ధం ఆగిపోయింది.
 

మరిన్ని వార్తలు