తిండిని బట్టే నిద్ర!

12 Dec, 2016 15:14 IST|Sakshi
తిండిని బట్టే నిద్ర!

ఫుడ్ అండ్ స్లీప్

మంచి నిద్రకూ, ఆహారానికీ సంబంధం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష సంబంధం ఉంటే చాలా సందర్భాల్లో పరోక్షంగా నిద్రపై దాని ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ఎక్కువగా టీ, కాఫీలు తాగని వారు సాయంత్రం వేళల్లో లేదా రాత్రి వేళలో వాటిని తాగితే నిద్రపట్టకపోవడం జరుగుతాయి. అలాగే... చాలా  రకాల ఆహారాలు నేరుగా ప్రభావం చూపకపోయినా... పరోక్షంగా ఆరోగ్యాన్నీ,  తద్వారా నిద్రనూ ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వారిలో వారికి జంక్‌ఫుడ్‌లోని చిప్స్ వంటి సరిపడని ఆహారమో, సాఫ్ట్ డ్రింక్ వంటి పానీయమో, తీపి పదార్థమో తీసుకున్న తర్వాత మెల్లగా శ్వాస మీద ప్రభావితం చూపుతాయి. దాంతో రాత్రంతా నిద్ర లేకుండా గడపాల్సి వస్తుంది.

ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం...
పాలు : దీన్ని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. అన్ని పోషకాలతో పాటు ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర కోసం మరీ వేడిగానూ, మరీ చల్లగానూ లేకుండా ఉండే గోరువెచ్చటి పాలను నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవడం మేలు. ఇది స్వాభావికమైన స్లీపింగ్ పిల్.

సింపుల్ కార్బోహైడ్రేట్స్: భోజనం తర్వాత కాస్త మగతగానూ, నిద్రపడుతున్నట్లుగానూ  అనిపించడం చాలామందికి తెలిసిందే. కార్బోహైడ్రేట్ తీసుకున్న తర్వాత వాటి నుంచి శక్తిని తయారు చేసేందుకు  నిద్ర వస్తుంటుంది. అందుకే భోజనం తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే సింపుల్ ఓట్ మీల్, వరి లాంటి మిగతా కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన నిద్ర వస్తుంది. ఇందులోని మెలటోనిన్ అనే పదార్థం కండరాలను రిలాక్స్ చేయడంతో పాటు మెదడులో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే రసాయనాన్ని ప్రేరేపించడమే దీనికి కారణం. దీంతో పాటు, విటమిన్ ‘సి’ పాళ్ళు ఎక్కువగా ఉండే బొప్పాయి, అనాస, నిమ్మజాతి పండ్లు సహజమైన రాత్రి నిద్రను కలగజేస్తాయి. అలాగే, సెలేనియవ్‌ు ఎక్కువగా ఉండే చేపలు, బాదాం లాంటి నట్స్ ఆరోగ్యకరమైన నిద్రను కలిగిస్తాయి.

నిద్రను దూరం చేసే పదార్థాలు
జంక్ ఫుడ్: మన ఆహారంలో త్వరగా లభ్యమై, మార్కెట్‌లో తేలికగా దొరికే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం తప్పనిసరిగా చెడు అలవాటు. ఇందులో ఉండే రిఫైన్‌‌డ పిండిపదార్థాల వల్ల డయాబెటిస్ వంటి అనేక సమస్యలు రావచ్చు. దీని వల్ల కలిగే ఎలర్జీల కారణంగా నిద్ర దూరం కావచ్చు. కాబట్టి ఇది మంచి అలవాటు కానే కాదు.

టీ : థయానిన్ అనే అమైనో ఆసిడ్ అనేది మెదడుకు ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. అన్ని రకాల టీలలోనూ ఇది ఉంటుంది. అందుకే నిద్రకు ఉపక్రమించే ముందు ఏ రకమైన టీ అయినా తాగకపోవడం మేలు.

కాఫీ : ఇందులోని కెఫిన్ అనే పదార్థం మెదడును ఉత్తేజపరుస్తుంది. దాంతో, నిద్ర దూరమవుతుంది. కాబట్టి, నిద్ర పోవడానికి ముందు కాఫీ తాగకుండా ఉండడమే మేలు.

సుజాతా స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్
మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్ హైదరాబాద్

మరిన్ని వార్తలు