క్రేజీగా అమ్మాయిలు... ఈజీగా మోసాలు

4 Dec, 2015 23:54 IST|Sakshi
పేరున్న సంస్థలు నిర్వహించే ఇలాంటి అందాలపోటీలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. నమ్మకం ఉంటుంది. ‘మిమ్మల్ని అందాల రాణులను చేస్తాం’ అంటూ ఊరించే

ఇంగ్లిష్‌లో కాన్‌టెస్ట్ అంటే పోటీ. కాన్ అంటే మోసం. కాన్-టెస్ట్ అంటే మరి మోసం చేసే పోటీ అన్నట్టేగా! ఆడపిల్లల్ని బురిడీ కొడుతున్న ఎన్నో కాన్-టెస్ట్‌లు ఉన్నాయి జాగ్రత్త.
 
అందాల వేట జోరు మీదుంది. కళాశాలా, షాపింగ్‌మాలా అనే తేడా లేదు. పబ్బులా, క్లబ్బులా అనే వ్యత్యాసమూ లేదు. ఎందెందు వెతికినా అందందే అన్నట్టుగా కొనసాగుతోంది అందగత్తెల అన్వేషణ. కిరీట ధారులై కిలకిలమంటున్న కాంతల నవ్వులతో నగరాలు హిస్టీరియా పూనినట్టు ఊగిపోతున్నాయి. ‘బ్యూటీ’ పథం వేగం చూస్తూంటే వీకెండ్స్‌లో ఏ మూవీకి వెళదాం అనేంత సహజంగా ఏ బ్యూటీ పెజెంట్‌కు వెళదాం అని అడిగే రోజులు వస్తాయేమోననే సందేహం. అయితే లెక్కకు మిక్కిలిగా జరుగుతున్న అందాల పోటీలన్నీ అందలాలెక్కించేవేనా? అథఃపాతాళానికి తోసేవి ఏమీ లేవా? అంటే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం, సమయం, సందర్భం కూడా వచ్చేశాయి.మిస్ ఢిల్లీ నుంచి మిస్ గల్లీ దాకా రకరకాల టైటిల్స్ అనౌన్స్ చేస్తూ ఎడా పెడా నిర్వహిస్తున్న కాంటెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే విలువైన సమయంతో పాటు మరెన్నో కోల్పోవాల్సి వస్తుందని గ్లామర్ రంగ ప్రముఖులు  హెచ్చరిస్తున్నారు.
 
క్రేజీగా అమ్మాయిలు... ఈజీగా మోసాలు
ఒకప్పుడు దేశీయంగా తెల్సిన ఏకైక బ్యూటీ కాంటెస్ట్ మిస్ ఇండియా. దాని తర్వాత మిసెస్ ఇండియా, గ్లాడ్‌రాగ్స్; మిస్ సౌతిండియా నుంచి మిస్ హైదరాబాద్, మిస్ తెలంగాణ  మిస్ గుజరాతీ ఇలా ఏరియాల వారీగా, కమ్యూనిటీల వారీగా కూడా వచ్చేశాయి. ఇక్కడే వీటిని మార్కెట్ చేసుకునేవారు అడ్డదారులు తొక్కడానికి అందమైన బాట ఏర్పడింది. ఒకప్పటితో పోలిస్తే  సినిమా, మోడలింగ్ రంగాలకు తొలి మెట్టు అని భావించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు యువతులు బాగా  ముందుకొస్తున్నారు. బ్యూటీ ఈవెంట్స్ వాణిజ్యపరంగానూ లాభదాయకంగా మారాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచార ం అందించే మార్గాలుగా కూడా  ఉపకరిస్తున్నాయి. కాస్తంత ముందస్తు ప్రచారం తోడైతే  బోలెడన్ని అప్లికేషన్లు, కోకొల్లలుగా అభ్యర్థులు, ఇబ్బడిముబ్బడిగా స్పాన్సర్లు... దీంతో చిన్నా చితకా ఈవెంట్ మేనేజర్లు అందరూ కాంటెస్ట్ ముసుగులో దోపిడీకి దిగుతున్నారు.
 
బ్యూటీఫుల్...బీకేర్ ఫుల్...

అద్దం అబద్ధం చెప్పదు. అందాల కిరీటం అబద్ధం చెప్పొచ్చు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ట్రెండ్స్‌లో అడుగు కలపడంలో తప్పులేకపోయినా, మార్కెట్ మాయలో పావులుగా మారకుండా జాగ్రత్త పడాలి. దశల వారీ పోటీ, గ్రూమింగ్ సెషన్ల పేరుతో కొన్ని రోజుల పాటు యువతులను పూర్తిగా తమ ‘ఆధ్వర్యం’లో ఉండేలా చూసుకుంటున్నారు నిర్వాహకులు.
 
ఆ సమయంలోనే ‘ఫలానా బ్యూటీ పేజెంట్‌లో పార్టిసిపెంట్స్  ఫలానా షోరూమ్‌లో...’ అంటూ ప్రచారం చేస్తున్నారు. అలా రకరకాల కమర్షియల్ ఈవెంట్స్‌లో అమ్మాయిలను పాల్గొనేలా చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు.  ఈ సమయంలో అమ్మాయిలు వీరు చెప్పినట్టు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప మరేమీ చేయలేరు. ఇక టైటిల్స్ మోసాలు సరేసరి. ఇటీవల జరిగిన ఓ కాంటెస్ట్‌లో నిర్వాహకులు తమ స్వంత వారికే టైటిల్‌ను దక్కించుకునేలా చేస్తే, మరో సంస్థ విజేతకు ప్రైజ్‌మనీ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టింది.  చాలా రకాల పోటీలు ప్రకటనలకే పరిమితమవుతూ స్పాన్సర్స్ వస్తే ఓకే లేకపోతే లేదు అన్నట్టుంటున్నాయి.  అందాల పోటీలో గెలిచినా, ఓడిపోయినా నష్టం లేదు. అయితే  చదువు, తెలివితేటలూ ఉండీ వంచనకు గురైతే అది జీవితకాలం వెంటాడే చేదు జ్ఞాపకం అవుతుంది. ఆ పరిస్థితి రాకుండా అమ్మాయిలు తెలివితేటలతో ముందడుగు వేయడమే నిజమైన గెలుపు.
 
ఆ అమ్మాయిది విజయవాడ. మోడలింగ్‌లో కెరీర్ ఎంచుకుంది. ఓ బ్యూటీ కాంటెస్ట్‌కు అప్లయ్ చేసింది. హైదరాబాద్‌లో ఆడిషన్ల ప్రక్రియ తర్వాత ఆమె ఎంపికయినట్టు ప్రకటించారు. తుది పోటీలలో పొల్గొనేందుకు అర్హత ధ్రువీకరణ పత్రాలు పంపిస్తామన్నారు. సరేనని ఇంటికొచ్చేశాక ఆమెకు వచ్చిన ఫోన్లు ఆమె కంటి మీద కునుకును కరవు చేశాయి. నిర్వాహకుల తరపున  ఇద్దరు వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసి తమ ‘అవసరాల’ను ఏకరవు పెట్టడం, అవి తీరిస్తే ైటె టిల్ తథ్యమని, ఆ తర్వాత ఏకంగా ఎక్కడికో ఆమె వెళ్లిపోతుందని చెప్పడం మొదలుపెట్టారు. సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆమె మనసును నిభాయించుకుని... ఆ పోటీకి గుడ్‌బై చెప్పేసింది.
 
కాకినాడకు చెందిన మరో అమ్మాయి  హైదరాబా ద్‌కు వచ్చి, నాలుగైదు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొ ంది. చివరకి ఒక సంస్థ వారు ఏదో నామ్‌కే వాస్తే టైటిల్ ఆమె చేతిలో పెట్టి, ఏడాది పాటు తమ ఆధ్వ ర్యంలో పనిచేయాల న్నారు. ఆ తర్వాత సిని మాలో ఛాన్స్ అంటూ ‘యువ నిర్మాతల’కు పరిచ యం చేశారు. కొన్ని నెలలు వారి చేతిలో కీలుబొమ్మలా మారాక... కొన్ని రోజులు ఓ రెస్టారెంట్‌లో సైతం పని చేసిన ఆ యువతి నర్సుగా పనిచేసే తల్లి ఏడ్చి మొత్తుకున్నాక తిరిగి తన ఊరుకు వెళ్లిపోయింది.ఇటీవలే ఒక బ్యూటీ ఈవెంట్‌లో టైటిల్ సాధించిన అందాల రాణికి ఆర్నెల్లుగా ప్రైజ్‌మనీ సంగతి అటుంచి, ధృవీకరణ పత్రం కూడా ఇవ్వకుండా నిర్వాహకులు ముప్పుతిప్పలు పెడుతున్నారు.
 
అందాల పోటీల్లో పాల్గొనాలకునే అమ్మాయిలకు కొన్ని సూచనలు
మోడల్‌గా రాణించాలంటే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఫిజిక్ లేకపోయినా పర్లేదు మా కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు అంటే నమ్మవద్దు.ఎంట్రీ ఫీజు కింద వేల రూపాయలు కట్టమంటే ఆదరబాదరా కట్టనవసరం లేదు.ఈ పోటీలలో అనుమతి, రిజిస్ట్రేషన్ లేనివాటిని గుర్తించాల్సిన బాధ్యత అమ్మాయిలదే.పబ్‌లు, లాంజ్‌బార్‌లను వేదికగా చేసుకుని నిర్వహించే పోటీలకు  దూరంగా ఉండడమే మేలుటాప్ మోడల్స్‌ను, స్టార్స్‌ను తీసుకొచ్చినంత మాత్రాన  గొప్ప సంస్థలు అనుకోవద్దు. సెలబ్రిటీలు తమ రెమ్యునరేషన్ తీసుకుని  ప్రకటన వరకూ మాత్రమే పరిమితమవుతారు. ఆ తర్వాత వారికి ఆ ఈవెంట్ బాధ్యత ఉండదు.

గ్లామర్ రంగంలో రాణించాలనా? టైంపాస్‌కా అనేది ముందు నిర్ణయించుకోవాలి.పోటీ నిర్వాహకులు ఎవరు? నిర్వాహక సంస్థ గత చరిత్ర ఏమిటి? ఆ కాంటెస్ట్‌లో గెలిస్తే వారందించే ప్రయోజనాలకు హామీ ఏమిటి? వగైరా విషయాలు సమగ్రంగా తెలుసుకోవాలి.కాంటెస్ట్ నిర్వహణ సందర్భంగా గ్రూమింగ్ సెషన్ల కోసమో, మరొకటో అంటూ నిర్వాహకులు దూరప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్వాహకులపై ఎటువంటి సందేహాలు తలెత్తినా, పోటీలో నిర్ణయాలు సరిగా తీసుకోవడం లేదు అనిపించినా వెంటనే వాటిపై ప్రశ్నించాలి. మౌనం వహించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువఅప్లయ్ చేసినప్పటి నుంచి ప్రతి దశలో తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తూ, వీలైతే వారిలో ఎవరో ఒకరు మీ వెంటే ఉండేలా చూసుకోవాలి.
 
 - ఎస్.సత్యబాబు
 
 
 
 

మరిన్ని వార్తలు