అందమైన సూర్యకాంతం....

12 Oct, 2015 00:24 IST|Sakshi
అందమైన సూర్యకాంతం....

వ్యాంప్
నాస్టాల్జియా

 
సూర్యకాంతం ఎప్పుడూ నాజుగ్గా ఉండాలనుకోలేదు. గయ్యాళితనానికి ఆ పాటి శరీర పుష్టి ఉండాలనుకొని ఉండొచ్చు. కాని నాదిరా అలా కాదు. చివరి వరకూ గ్లామర్ మెయింటెయిన్ చేసింది. గయ్యాళి పాత్రలు చేస్తే ఏమి? అందగత్తెలు గయ్యాళులు కాకూడదా? నాదిరా అనగానే అందరికీ శ్రీ 420లో ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ పాట గుర్తుకు వస్తుంది. తొలి సినిమా మహబూబ్ ఖాన్ ‘ఆన్’ అయితే ఆ తర్వాత ‘వారిస్’, ‘దిల్ అప్‌నా ప్రీత్ పరాయ్’ వంటి సినిమాలో ఆమె ప్రేక్షకులు గట్టిగా జ్ఞాపకం ఉంచుకునే పాత్రలు చేసింది. ఆంగ్లో ఇండియన్స్ మీద మన తెలుగు నిర్మాత బి.నాగిరెడ్డి నిర్మించిన హిట్ చిత్రం ‘జూలీ’లో నాదిరా పోషించిన తల్లి పాత్ర ఎవరూ మర్చిపోలేరు. దయా కనికరం లేనట్టుగా కనిపించే ముఖం, మాటలతో నాదిరా పాత్రలను రక్తి కట్టించేది. అయితే ఆమె నటించాల్సినన్ని సినిమాల్లో నటించలేదనే చెప్పాలి. తెర మీద కనిపించినట్టుగానే తెర వెనుక కూడా ఆమె చాలా డైనమిక్‌గా ఉండేది. పార్టీలు... స్నేహితులు... ప్రతి రోజూ ఒక ఉత్సవమే. బాగ్దాద్‌కు చెందిన యూదుల కుటుంబంలో పుట్టిన నాదిరా (అసలు పేరు ఫ్లోరెన్స్ నజకిల్ నాదిరా) ముంబై ఇండస్ట్రీనే తన కుటుంబం అనుకుంది.

ఇద్దరు సోదరులు ఉండేవారని, వాళ్లు ఇజ్రాయిల్‌లోనో అమెరికాలోనో స్థిరపడ్డారని అంటారు. ‘మహల్’ సినిమాలో ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’... వంటి సూపర్‌హిట్ పాటలు రాసిన ‘నక్షబ్’ అనే కవిని ఆమె పెళ్లాడింది. అయితే కాపురం రెండేళ్లే. విడాకులు తీసుకున్నాక అతడు పాకిస్తాన్ వెళ్లిపోయి చిన్న వయసులోనే మరణించారు. ఇంకెవరో ముక్కూముఖం తెలియనివాణ్ణి రెండో పెళ్లి చేసుకుని వారం రోజుల్లోనే తరిమి కొట్టింది. ఆమె టాలెంట్, స్క్రీన్ మీద ఇతరులు డామినేట్ చేసే సామర్థ్యమే ఆమె పాలిట శత్రువులయ్యాయేమో తెలియదు. నాదిరాకు గొప్ప సాహితీ పరిజ్ఞానం ఉంది. రాజకీయాలు కొట్టిన పిండి. మూడు నాలుగు భాషల్లో అద్భుత పాండిత్యం ఉంది. ఇంత ఉన్నా సాయంత్రమైతే పిలవని బాలీవుడ్ పార్టీలకు కూడా వెళ్లి తాగుతూ కూచునేది. కొన్నాళ్లు దీనిని పరిశ్రమ భరించినా ఆ తర్వాత విసుక్కోవడం ప్రారంభించింది. ముంబై మహలక్ష్మి టెంపుల్ సమీపంలోని చిన్న ఫ్లాట్‌లో ఒక్కత్తే జీవించిన నాదిరా చివరి రోజుల్లో సయాటికా వల్ల ఒకటి రెండేళ్లు మంచానికే పరిమితమైంది. దీప్తి నావెల్ వంటి ఒకరిద్దరు తప్ప ఆమెకు స్నేహితులు మిగల్లేదు. దిలీప్ కుమార్, రాజ్‌కపూర్ వంటి నటులతో ఢీ అంటే ఢీ అన్నట్టు నటించిన ఆ ప్రతిభావంతమైన నటి 2006లో తన 73వ ఏట మరణించింది.
 

మరిన్ని వార్తలు