బ్యూటీ ఇన్ మినిట్స్..

15 Feb, 2016 23:20 IST|Sakshi
బ్యూటీ ఇన్ మినిట్స్..

బ్యూటిప్స్
రెండు స్ట్రాబెర్రీ పండ్లను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో ముఖంపై ప్యాక్ వేసుకొని, 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. స్ట్రాబెర్రీలు స్కిన్ ఇన్‌ఫెక్షన్స్‌ను నివారిస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖం ఎప్పుడూ నిగనిగలాడుతుంది.
     
* డార్క్ లిప్స్‌తో బాధ పడేవారికి ఇది సులువైన చిట్కా. మార్కెట్‌లో దొరికే లిప్‌బామ్స్ కంటే ఇంట్లోనే దాన్ని తయారు చేసుకోండి. తయారీకి గ్లిజరిన్, బీట్‌రూట్ పౌడర్, పెట్రోలియం జెల్లీ చాలు. ఒక చిన్న గిన్నెలో పెట్రోలియం జెల్లీని వేసి వేడి చేయాలి. అది ద్రవంగా మారగానే, అందులో టీ స్పూన్ గ్లిజరిన్, అర టీ స్పూన్ డ్రై బీట్‌రూట్ పౌడర్ వేసి కలపాలి. చల్లారాక దాన్ని ఒక చిన్న బాటిల్‌లో తీసుకొని రోజూ అప్లై చేసుకుంటే పింక్ లిప్స్ మీ సొంతం.
     
* కొందరి జుట్టు నల్లగా కాకుండా రాగి రంగులో కనిపిస్తుంది. అలాంటి వారు పావుకప్పు కొబ్బరి నూనెలో మూడు స్పూన్ల మందార రేకుల పొడిని వేసి మరిగించాలి. ఆ వేడి చల్లారక ముందే, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆముదం కలపాలి. గోరువెచ్చని ఆ నూనెను రాత్రి నిద్రపోయే ముందు తలకు పట్టించాలి. ఉదయం లేచిన వెంటనే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. వారానికి మూడు సార్లైనా ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.

మరిన్ని వార్తలు