గోళ్లు పలచబడి విరిగిపోతుంటే...

30 Oct, 2018 00:21 IST|Sakshi

బ్యూటిప్స్‌

గోళ్లు పొడవుగా పెంచుకొని, మంచి షేప్‌ చేయించుకోవాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.కానీ కొందరిలో గోళ్ల పెరుగుదల అంతగా ఉండదు. పైగా కొద్దిగా పెరిగినా త్వరగా విరిగిపోతుంటాయి.  దీనికి ప్రధాన కారణం... కాల్షియం, ఐరన్‌ లోపం. దీంతో పాటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. రోజూ రాత్రి పడుకునే ముందు నిమ్మరసం, గ్లిజరిన్‌ సమపాళ్లలో కలిపి గోళ్ల మీద రాసి, మసాజ్‌ చేయాలి. లేదా బాదం నూనెను వేలితో అద్దుకొని, గోరు చుట్టూ రాసి మృదువుగా మర్దనా చేయాలి. కొబ్బరినూనెను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే గోళ్ల పెరుగుదల బాగుంటుంది. త్వరగా విరిగిపోవు. నెల రోజులకోసారి ఇంట్లోనే గోరుచుట్టూ ఉన్న మురికిని తొలగించాలి.

దీనికి ఉప్పు, షాంపూ కలిపిన గోరువెచ్చని నీటిలో పది నుంచి పదిహేను నిమిషాలు వేళ్లు మునిగేలా ఉంచి, తర్వాత మెనిక్యూర్‌ టూల్‌తో గోరుచుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. గోళ్లను ఒక షేప్‌లో కత్తిరించి, పెట్రోలియమ్‌ జెల్లీ లేదా బాదం నూనెతో మర్దనా చేయాలి.వీటితో పాటు.. ∙ఆహారంలో కాల్షియం, ఐరన్‌ పాళ్లు ఎక్కువ ఉన్న పదార్థాలను చేర్చాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం మోతాదు అధికంగా ఉంటుంది. తాజా ఆకుకూరలు, నువ్వులు, పల్లీలు, బెల్లం.. మొదలైన వాటిలో ఐరన్‌ ఎక్కువ ఉంటుంది.  

మరిన్ని వార్తలు